
నివేదికలను తొక్కిపెట్టారు..నిధులను బినామీల ఖాతాలకు మళ్లించారు: మంత్రి పయ్యావుల కేశవ్
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో జరిగిన అపచారంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం సంచలన వివరాలు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం శ్రీవారిపై భక్తి లేకుండా నెయ్యి సేకరణను కేవలం ఒక వాణిజ్య లావాదేవీగా మాత్రమే చూసిందని ఆయన మండిపడ్డారు. శనివారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసిందని ఆరోపించారు.
నివేదికలను అణిచివేసిన జగన్ ప్రభుత్వం
నెయ్యి నమూనాలపై వస్తున్న వార్తలకు ఆధారాలను మంత్రి పయ్యావుల ప్రస్తావించారు. ఎన్డీడీబీ కి పంపిన నమూనాల్లో జంతువుల కొవ్వులు ఉండవచ్చని స్పష్టంగా పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే నివేదికను ఉటంకించారు. మైసూరులోని సి.ఎఫ్.టి.ఆర్.ఐ కి పంపిన నమూనాల్లో సైతం నెయ్యి కల్తీ అని తేలింది. అయితే గత జగన్ ప్రభుత్వం ఆ నిజాలు బయటకు రాకుండా ఆ నివేదికలను తొక్కిపెట్టింది అని ఆయన ఆరోపించారు. కేవలం తమకు అనుకూలమైన చిన్న కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు టెండర్ నిబంధనలను సైతం మార్చేశారని విమర్శించారు.
రూ.240 కోట్ల స్కామ్.. సుబ్బారెడ్డి పీఏ పై ఆరోపణలు
సిట్ సమర్పించిన ఛార్జిషీట్ ప్రకారం ఈ నెయ్యి కల్తీ వ్యవహారంలో దాదాపు రూ.240 కోట్ల విలువైన మోసం జరిగిందని మంత్రి తెలిపారు. అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) పాల కంపెనీల నుంచి ఏకంగా రూ.4 కోట్లు లంచంగా తీసుకున్నారని ఆ డబ్బును ఇతర బినామీ ఖాతాలకు మళ్లించారని దర్యాప్తులో తేలింది అని ఆయన పేర్కొన్నారు. భక్తుల సొమ్మును దోచుకోవడమే కాకుండా పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేసిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
అయితే ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో జంతు కొవ్వు కలిసినట్టు నిర్ధారణ కాలేదని స్పష్టంగా పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. దర్యాప్తు ప్రకారం అవకతవకలు ప్రధానంగా నెయ్యి సేకరణ విధానం, టెండరింగ్ నిబంధనల మార్పులు, నాణ్యత నియంత్రణ లోపాలకు సంబంధించినవేనని వెల్లడైంది.
20 కోట్ల లడ్డూల అపచారం: బీఆర్ నాయుడు
మరోవైపు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2019-2024 మధ్య కాలంలో సరఫరా అయిన 60 లక్షల కిలోల నెయ్యి కల్తీదని దీనితో తయారు చేసిన 20 కోట్ల లడ్డూలను భక్తులకు పంపిణీ చేసి మహా పాపానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ ఛార్జిషీట్‌లో 9 మంది టీటీడీ అధికారులు 5 గురు పాల నిపుణులతో సహా మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం కమిషన్ల కోసమే ఈ సింథటిక్ నెయ్యిని వాడారని దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను తేల్చేందుకు సీబీఐ ద్వారా మైక్రో-డీఎన్ఏ పరీక్షలు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకు దారి తీసింది. అధికార పక్షం ఇది వ్యవస్థలో జరిగిన లోపాలపై చర్యలుగా పేర్కొంటుండగా ప్రతిపక్షం మాత్రం దీన్ని రాజకీయ దాడిగా అభివర్ణిస్తోంది. ఏదేమైనా కోట్లాది భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న టీటీడీ వ్యవహారంలో జరిగిన తప్పులను సరిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతుండగా లడ్డు పవిత్రతకు భంగం కలగలేదన్న దర్యాప్తు అంశం ఈ వివాదంలో కీలకంగా మారింది.
