
నిలకడగా దేవరపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం
మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారు. ఈ నెల 7వ తేదీ శనివారం మధ్యాహ్నం భోజనం వికటించి వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో ఇబ్బంది పడిన విద్యార్థులకు అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన వైద్య సేవలు అందించింది. ఈ ఘటనపై రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ స్పందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
సత్వర చికిత్సతో తప్పిన ప్రమాదం
అస్వస్థతకు గురైన వెంటనే విద్యార్థులను చికిత్స నిమిత్తం మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (12 మంది) రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి (45 మంది) తరలించారు. సోమవారం నాటికి పూర్తిస్థాయిలో కోలుకున్న 35 మంది విద్యార్థులను వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మిగిలిన విద్యార్థులు కూడా వేగంగా కోలుకుంటున్నారని వారి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిన అనంతరం డిశ్చార్జ్ చేస్తామని జాయింట్ కలెక్టర్ వివరించారు.
పాఠశాల వద్దే వైద్య శిబిరం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎం అండ్ హెచ్ ఓ) డాక్టర్ పి.సరిత పర్యవేక్షణలో శనివారం నుంచే దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో నిరంతర ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతరం నిఘా ఉంచామని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని పౌష్టికాహారం, తాగునీటి నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని పాఠశాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
