Let's talk: editor@tmv.in
నిర్మల్ జిల్లా ‘పోలీస్ అక్క’కు స్కోచ్ అవార్డు.. తెలంగాణకు గర్వకారణం

నిర్మల్ జిల్లా ‘పోలీస్ అక్క’కు స్కోచ్ అవార్డు.. తెలంగాణకు గర్వకారణం

Gaddamidi Naveen
29 మార్చి, 2026

మహిళల రక్షణే ధ్యేయంగా నిర్మల్ జిల్లాలో అమలు చేస్తున్న ‘పోలీస్ అక్క’ కార్యక్రమం జాతీయ స్థాయిలో అత్యున్నతమైన స్కోచ్ అవార్డు దక్కించుకోవడంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ వినూత్న కార్యక్రమం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. న్యూఢిల్లీలో ఈ అవార్డును అందుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

మహిళల భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, ముఖ్యంగా విద్యార్థినులలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఈ ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని రూపొందించారు. మహిళా పోలీస్ అధికారులు స్వయంగా ‘పోలీస్ అక్క’లుగా మారి, ఆపద సమయాల్లో ఎలా స్పందించాలి, ధైర్యంగా ఎలా ముందడుగు వేయాలి అనే అంశాలపై బాలికలకు, మహిళలకు మార్గదర్శకత్వం వహిస్తారు.

క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరగా ఉంటూ నిర్వహిస్తున్న ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రయత్నాలను సీఎం అభినందించారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు సుమారు 7,000 మంది విద్యార్థినులు, మహిళలకు భద్రతా అంశాలపై శిక్షణ అవగాహన కల్పించడం ఒక గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు. ‘పోలీస్ అక్క’ చొరవ కేవలం నిర్మల్ జిల్లాకే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని మొత్తం పోలీస్ వ్యవస్థకే ఒక స్ఫూర్తిదాయకమైన నమూనాగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి కొనియాడారు.

కష్టకాలంలో ఉన్న మహిళలకు అండగా ఉంటూ, వారిలో మనోధైర్యాన్ని నింపే ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పును తీసుకువస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత, భద్రత విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్, డీజీపీ ప్రశంసలు

ఈ విజయంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ డీజీపీ ప్రత్యేక హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిలను అభినందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, ‘పోలీస్ అక్క’ కార్యక్రమం మానవీయ కోణంలో సాగే పోలీసింగ్‌కు ఒక ఉత్తమ ఉదాహరణ అని కొనియాడారు. మహిళా అధికారులను మెంటర్లుగా, సంరక్షకులుగా నియమించడం ద్వారా కేవలం భద్రత మాత్రమే కాకుండా, యువతుల్లో నిజమైన ఆత్మవిశ్వాసాన్ని ఈ పథకం నింపుతోందని ఆయన ప్రశంసించారు. నిర్మల్ పోలీసుల కఠోర శ్రమకు ఈ అవార్డు సరైన గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ డీజీపీ కూడా ఈ చొరవను అభినందిస్తూ, మహిళా సిబ్బంది సమాజంలో రోల్ మోడల్స్‌గా మారుతుండటం గర్వకారణమని తెలిపారు. యువతులకు సరైన దిశానిర్దేశం చేస్తూ, వారి భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దడంలో ‘పోలీస్ అక్క’ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది సురక్షితమైన సమాజ నిర్మాణానికి బలమైన పునాది అని ఆయన అభివర్ణించారు. జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు మరింత ఉత్సాహాన్నిస్తుందని అధికారులు భావిస్తున్నారు.