
నిర్మల్ జిల్లాలో గ్యాస్ గోదాంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి మంగళవారం సారంగాపూర్ మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు, అక్రమ మొరం తవ్వకాలపై అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
తనిఖీ సందర్భంగా గ్యాస్ సరఫరా, భద్రతా ప్రమాణాల అమలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ అభినవ్ ప్రజలకు సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేసి, ఆందోళన చెందవద్దని తెలిపారు. సిలిండర్ల సరఫరాలో జాప్యం, కృత్రిమ కొరత, బ్లాక్‌లో విక్రయం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదాముల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు వంటి భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.
అనంతరం సారంగాపూర్ మండలం జాం గ్రామ చెరువు సమీపంలో జరుగుతున్న అక్రమ మొరం, ఇసుక తవ్వకాలను కలెక్టర్ పరిశీలించారు. సొంత అవసరాల కోసం తవ్వకాలు జరపాలన్నా రెవెన్యూ అధికారుల ముందస్తు అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, మైనింగ్ అధికారి హరి ప్రసాద్, తహసీల్దార్ సంధ్యారాణి తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజల ఆస్తులను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని యంత్రాంగం తేల్చి చెప్పింది.
