
నిర్మల్‌లో సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం: కలెక్టర్ అభిలాషా
నిర్మల్ జిల్లాలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా కీలక చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బైల్ బజార్ రైతు వేదికలో నిర్వహించిన జాతీయ సేంద్రియ వ్యవసాయ మిషన్ (ఎన్-ఎన్‌ఎంఎఫ్) శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహజ వ్యవసాయం అత్యంత ముఖ్యమని, రసాయన రహిత పద్ధతులు రైతులకు వినియోగదారులకు దీర్ఘకాల ప్రయోజనాలు అందిస్తాయని ఆమె పేర్కొన్నారు.
జిల్లాలో సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించేందుకు 15 క్లస్టర్లను గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రతి క్లస్టర్ నుంచి ఇద్దరు ఐకేపీ మహిళలను ఎంపిక చేసి ‘కృషి సఖీలు’గా ప్రత్యేక శిక్షణ అందించామని తెలిపారు. ఈ కృషి సఖీలు గ్రామస్థాయిలో రైతులకు మార్గదర్శకత్వం ఇవ్వడంతో పాటు సేంద్రియ విధానాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఈ సందర్భంగా ధృవపత్రాలు పంపిణీ చేశారు.
సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులకు సరైన మార్కెట్ కల్పించేందుకు జిల్లా కేంద్రంలో ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులు నేరుగా వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో సేంద్రియ వ్యవసాయానికి మరింత ఊతం లభించి, రైతుల ఆదాయం పెరగడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుబాటులోకి వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
