
నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక
తెలంగాణలోని ములుగు జిల్లాకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'నిర్భయ నిధి' కింద మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు ప్రాజెక్టు ఎంపిక అయ్యింది. మహిళలు, పిల్లల కోసం సురక్షిత, సౌకర్యవంతమైన నగర వాతావరణాన్ని రూపొందించడానికి ఈ ప్రాజెక్టు ప్రధానంగా లక్ష్యంగా పెట్టబడింది.
ప్రాజెక్ట్ అమలు ద్వారా మహిళా భద్రతకు అనుగుణంగా జెండర్ రెస్పాన్సివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తారు. అత్యాధునిక నిఘా కెమెరాలు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సాయం అందించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌లను బలోపేతం చేస్తారు. మహిళలు, బాలికలు ఆత్మగౌరవంతో, ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రయాణించేలా రక్షణ చర్యలు చేపడతారు.మహిళల పట్ల నేరాలను అరికట్టి, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంలో ములుగు జిల్లా ఈ ప్రాజెక్టు ద్వారా ఆదర్శంగా నిలవనుంది.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, న్యూఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రాన్ని ములుగు జిల్లాను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ములుగు జిల్లా ఈ కార్యక్రమంలో ఎంపిక కావడం, స్థానిక మహిళలు, పిల్లల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తోంది.
