Let's talk: editor@tmv.in
నిరంతరాయ విద్యుత్ సరఫరానే మా ధ్యేయం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నిరంతరాయ విద్యుత్ సరఫరానే మా ధ్యేయం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Gaddamidi Naveen
15 జులై, 2026

రాష్ట్రంలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా ధ్యేయంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యుత్ ఉప కేంద్రాలను (సబ్‌స్టేషన్లు) నిర్మిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా మంగళవారం రూ. 376.25 కోట్ల విలువైన పలు విద్యుత్ అభివృద్ధి పనులకు ఆయన మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

ఈ పర్యటన నిమిత్తం వడ్డేపల్లి మండలం శాంతినగర్ హెలిపాడ్‌కు చాపర్‌లో చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు, మొక్కలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జులేకల్ గ్రామానికి చేరుకున్నారు. ఆలంపూర్ నియోజకవర్గ పరిధిలోని జులేకల్, పచ్చర్ల, పుల్లూరు, మేడికొండ ప్రాంతాల్లో కొత్తగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలిసి భట్టి విక్రమార్క అధికారికంగా ప్రారంభించారు.

ఎర్రవల్లి వద్ద భారీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన

ఈ పర్యటనలో భాగంగా ఎర్రవల్లి మండల కేంద్రం వద్ద రూ. 155 కోట్ల భారీ నిధులతో నిర్మించనున్న 220/132/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రం పనులకు డిప్యూటీ సీఎం ఇక్కడే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ఉచిత విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు, నేతలు ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి, ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు కట్టుబడి ఉందన్నారు. ఈ భారీ అధికారిక కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ ఇతర విద్యుత్, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
MalluBhattiVikramarkaTelanganaElectricityInfrastructurePowerSectorPowerDevelopmentEnergyForAllTelanganaDevelopmentJogulambaGadwal
నిరంతరాయ విద్యుత్ సరఫరానే మా ధ్యేయం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క - Tholi Paluku