
‘నిమ్స్’లో యువకుడి అనుమానాస్పద మృతి
నిమ్స్ ఆస్పత్రిలో అనస్థీషియా టెక్నీషియన్గా ఇంటర్న్‌షిప్ చేస్తున్న 19 ఏళ్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన కలకలం రేపింది. ఆస్పత్రి యాజమాన్యం ఈ మరణాన్ని ఆత్మహత్యగా చెబుతున్నప్పటికీ, మృతుడి కుటుంబం, సహచర విద్యార్థులు ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా యువకుడి మృతదేహం శుక్రవారం ఉదయం 8:45 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలోని అనస్థీషియా గదిలో లభ్యమైనట్లు పోలీసు అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా కొల్చారం మండలం తుమ్మలపల్లి తండాకు చెందిన రమావత్ లక్ష్మణ్, అమ్సి దంపతుల చిన్న కుమారుడు నితిన్. నిమ్స్‌లో మూడేళ్ల అనస్థీషియా కోర్సు పూర్తి చేసిన నితిన్, బోరబండలోని గిరిజన సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నాడు. కాగా ఈ ఇంటర్న్‌షిప్ రాబోయే జనవరిలో పూర్తవ్వాల్సి ఉంది.
గురువారం ఉదయం 8 గంటలకు నిమ్స్ ఆస్పత్రిలో తన విధులను ప్రారంభించిన నితిన్, మరుసటి రోజు ఉదయం వరకు డ్యూటీలో ఉండాల్సి ఉంది. రాత్రి 11.30 సమయంలో సీనియర్ టెక్నీషియన్ నరేశ్‌కు ఫోన్ చేసి, తన స్థానంలో రావాలని కోరాడు. ఆ తర్వాత, ఆసుపత్రిలోని అనస్థీషియా గదిలో వెళ్ళాడు. కాగా మరుసటి రోజు ఉదయం ఎంత తలుపులు కొట్టిన తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది బలవంతంగా తెరిచారు కాగా అప్పటికే నితిన్ విగతజీవిగా పడి ఉన్నాడు. .
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఇక దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు మరణానికి గల కారణాలను నిర్ధారించడానికి పోస్ట్‌మార్టం నివేదిక కోసం, అదేవిదంగా అతని సహచరులు, ఆసుపత్రి సిబ్బంది నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
కేసు దర్యాప్తు ఉన్నతాధికారి మాట్లాడుతూ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే తప్ప నితిన్ మరణానికి అసలు కారణాలు బయటపడవు అని తెలిపారు. మరోవైపు నితిన్ సోదరుడు ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపించాలని కోరుతూ, నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన ఈ విషాద ఘటనలో దాగిన సత్యాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు.
