Let's talk: editor@tmv.in
నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఖరీదైన గుండె చికిత్స

నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఖరీదైన గుండె చికిత్స

Gaddamidi Naveen
4 జనవరి, 2026

ప్రభుత్వ రంగంలోని నిమ్స్ ఆసుపత్రి వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. తీవ్రమైన గుండె సమస్య అయిన వెంట్రిక్యులర్ ప్రీమేచ్యూర్ కాంట్రాక్షన్స్ తో బాధపడుతున్న ఇద్దరు యువ రోగులకు నిమ్స్‌లో అధునాతన సాంకేతికతతో విజయవంతమైన చికిత్స నిర్వహించారు.

ఈ ఇద్దరికీ 40 నుంచి50 శాతం వరకు ఉన్న వీపీసీ భారం, అత్యాధునిక 3డీ మ్యాపింగ్ సాంకేతికతతో కూడిన రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్స ద్వారా పూర్తిగా శూన్యానికి తగ్గింది. చికిత్స అనంతరం రోగులు పూర్తిగా కోలుకుని, సాధారణ జీవితానికి తిరిగి చేరుకున్నారు. ఈ ప్రాణరక్షక చికిత్సలు ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా అందించటం గమనార్హం. ఖరీదైన ఈ తరహా గుండె చికిత్సలు సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయల ఖర్చుతో జరుగుతాయి. కానీ నిమ్స్‌లో మాత్రం పేద, మధ్యతరగతి రోగులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈపీఎస్ (ఎలక్ట్రో ఫిజియాలజీ స్టడీ)తో పాటు ఆర్.ఎఫ్ఎ చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్న ఏకైక ప్రభుత్వ ఆసుపత్రిగా నిమ్స్ ప్రత్యేక గుర్తింపు పొందింది. అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు, ఆధునిక పరికరాలు, ప్రభుత్వ మద్దతుతో నిమ్స్ గుండె రోగులకు ఆశాజ్యోతి లాగా నిలుస్తోంది. ఈ విజయవంతమైన చికిత్సలు ప్రభుత్వ వైద్య రంగంలో మరో కీలక మైలురాయిగా నిలిచాయి.అత్యాధునిక సాంకేతికత, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుండటం గమనార్హం.