Let's talk: editor@tmv.in
నిబంధనల ప్రకారమే లోక్‌సభ పని చేస్తుంది: స్పీకర్ ఓం బిర్లా

నిబంధనల ప్రకారమే లోక్‌సభ పని చేస్తుంది: స్పీకర్ ఓం బిర్లా

Pinjari Chand
13 మార్చి, 2026

లోక్‌సభ నిబంధనల ప్రకారమే పనిచేస్తుందని, ఏ సభ్యుడికీ ఎప్పుడైనా ఏ విషయంపైనా మాట్లాడే ప్రత్యేక హక్కు లేదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. తనను పదవి నుంచి తొలగించాలన్న తీర్మానం ఓటింగ్‌లో తిరస్కరించిన మరుసటి రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ కుర్చీ ఏ వ్యక్తికి చెందినది కాదని, అది సభ గౌరవానికి ప్రతీక అని బిర్లా పేర్కొన్నారు. ఏ సభ్యుడికి ఆమోదయోగ్యంగా లేకపోయినా లోక్‌సభ నిర్ణయించిన నిబంధనలు, విధివిధానాల ప్రకారమే కొనసాగుతుందని ఆయన తెలిపారు. సభ నిర్వహణలో తాను నిష్పాక్షికంగా, నిజాయితీగా వ్యవహరిస్తానని చెప్పారు. ఈ సభలోని ఏ సభ్యుడికీ నిబంధనల పరిధి వెలుపల మాట్లాడే హక్కు లేదని బిర్లా పేర్కొనగా అధికారపక్ష సభ్యులు డెస్కులు కొడుతూ మద్దతు తెలిపారు. తనపై జరిగిన చర్చలో సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని బిర్లా అన్నారు. తనకు మద్దతు తెలిపిన వారికీ, వ్యతిరేకంగా మాట్లాడిన వారికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి 10న బడ్జెట్ సమావేశాల తొలి దశలో ప్రతిపక్షాలు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమావేశాల తొలి దశ ఫిబ్రవరి 13న ముగియగా, రెండో దశ మార్చి 9న ప్రారంభమైంది. అప్పటి నుంచి మొదటిసారి బిర్లా సభను నిర్వహించేందుకు గురువారం హాజరయ్యారు. గత రెండు రోజుల చర్చలో కొందరు సభ్యులు ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీకి మాట్లాడే అవకాశాలు తక్కువగా ఇస్తున్నారని, ఆయనకు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారని బిర్లా తెలిపారు.

నావద్ద ఎలాంటి స్విచ్‌ లేదు

అయితే ప్రతి సభ్యుడికి మాట్లాడే హక్కు ఉన్నప్పటికీ అది నిబంధనల ప్రకారం మాత్రమే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గానీ, మంత్రి గానీ, ఇతర సభ్యులెవరైనా గానీ స్పీకర్ అనుమతి లేకుండా మాట్లాడలేరని అన్నారు. సభలో సభ్యులకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పటికీ వారు నిబంధనలను పాటించాల్సిందేనని పేర్కొన్నారు. కొంతమంది సభ్యులు మాట్లాడే సమయంలో వారి మైక్రోఫోన్‌ను ఆఫ్ చేస్తారని వస్తున్న ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. ‘మైక్ ఆన్ లేదా ఆఫ్ చేయడానికి నా వద్ద ఎలాంటి స్విచ్ లేదు. సభాపతి అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే సభ్యుల మైక్ ఆన్ అవుతుంది’ అని చెప్పారు.

2020లో భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం.నరవణే రాసిన ప్రచురితం కాని స్మృతిగ్రంథాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిన పత్రిక కథనాన్ని సభలో ఉంచేందుకు రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వలేదన్న ఆరోపణలపై కూడా బిర్లా స్పందించారు. గత స్పీకర్లు ఇచ్చిన తీర్పులను ఉదాహరిస్తూ కొన్ని సందర్భాల్లో సభలో పత్రాలు ఉంచేందుకు అనుమతి ఇవ్వలేమని చెప్పారు.