Let's talk: editor@tmv.in
నిబంధనలు ఉల్లంఘించిన బస్సులపై కఠిన చర్యలు: ఏపీ రవాణా శాఖ మంత్రి

నిబంధనలు ఉల్లంఘించిన బస్సులపై కఠిన చర్యలు: ఏపీ రవాణా శాఖ మంత్రి

Panthagani Anusha
29 మార్చి, 2026

రాష్ట్రంలో వరుసగా సంభవిస్తున్న ఘోర బస్సు ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు ట్రావెల్స్, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సుల ఆట కట్టించేందుకు రవాణా శాఖ రంగంలోకి దిగింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీలు రవాణా రంగంలో కలకలం రేపాయి. మొత్తం 1,036 బస్సులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన 236 బస్సులపై కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధించారు.

రాష్ట్రంలోని కీలక రహదారులు, టోల్ ప్లాజాలు మరియు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద మొత్తం 16 వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. ప్రధానంగా బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ పత్రాలు, పర్మిట్లు డ్రైవర్ల లైసెన్సులను అధికారులు తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేకుండా రహదారులపైకి వస్తున్న వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేయడంతో పాటు యజమానులపై కఠిన చర్యలకు సిఫార్సు చేశారు. నిబంధనల అతిక్రమణపై రాజీ పడే ప్రసక్తే లేదని ప్రయాణికుల భద్రతే తమ తొలి ప్రాధాన్యతని మంత్రి స్పష్టం చేశారు.

గత ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న నాలుగు ప్రధాన ప్రమాదాల్లో 45 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ముఖ్యంగా ప్రమాద సమయంలో బస్సుల్లో మంటలు చెలరేగి 33 మంది సజీవ దహనం కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విచారణకు ఆదేశించడమే కాకుండా ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యగా ఈ భారీ తనిఖీలను చేపట్టింది. పాతబడిన బస్సులు, అగ్నిమాపక పరికరాలు లేని వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి తనిఖీలు కేవలం ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు. బస్సు యజమానులు కేవలం లాభాపేక్షతో కాకుండా ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలని నిబంధనలు పాటించని పక్షంలో పర్మిట్లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని సురక్షితమైన వాహనాల్లోనే ప్రయాణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.