

నిప్పుల కొలిమిలా ఏపీ
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి, సూర్యుడు నిప్పులు చెరుగుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. ఆదివారం నాటి ఎండ తీవ్రతను బట్టి చూస్తే, నేడు కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉండవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని సుమారు 70 మండలాల్లో నేడు వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున, బయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
200 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
ఆదివారం నాటి గణాంకాల ప్రకారం, రాష్ట్రంలోని 19 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచగా, మరో 35 మండలాల్లో వడగాల్పుల ప్రభావం కనిపించింది. అంతకుముందు రోజు శనివారం సుమారు 200 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటాయి. ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి.
కడప జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత
గడిచిన రెండు రోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3, తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలో 44.2 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడులో 42.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంది.
నేడు కూడా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న 24 గంటల్లో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఉక్కపోత, ఎండ తీవ్రత మరింత ఎక్కువగా అనిపించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
జాగ్రత్తలు తప్పనిసరి
తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు ఎండలో బయటకు రావొద్దని, తగినన్ని నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పత్రికా ప్రకటనలో కోరింది.
