Let's talk: editor@tmv.in
నిద్ర: మానసిక ఆరోగ్యానికి ఒక అద్భుత ఔషధం

నిద్ర: మానసిక ఆరోగ్యానికి ఒక అద్భుత ఔషధం

Dantu Vijaya Lakshmi Prasanna
12 ఫిబ్రవరి, 2026

కనురెప్పల వెనుక దాగి ఉన్న ప్రశాంత ప్రపంచమే నిద్ర. రోజంతా పడిన శ్రమను, మనసును వేధించిన అలజడులను మర్చిపోయి, రేపటి కోసం మనల్ని మనం సిద్ధం చేసుకునే ఒక అద్భుతమైన వరం అది. కానీ, ఆ నిశ్శబ్ద రాత్రి వేళలో అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు, కొందరు మాత్రం కళ్ళు మూసినా కదలని కాలంతో పోరాటం చేస్తుంటారు. నిద్ర రాని ఆ గంటలు భారంగా గడుస్తుంటే, మనిషి కేవలం శారీరకంగానే కాదు, మానసిక నిశ్చలతను కూడా కోల్పోతాడు. మనసులోని భావోద్వేగాల అలజడి నిద్రను దూరం చేస్తే, ఆ నిద్రలేమి మళ్ళీ మనసును మరింత చీకట్లోకి నెట్టివేస్తుంది. ఇది కేవలం కంటికి విశ్రాంతి లేకపోవడం కాదు, ఆత్మకు లభించాల్సిన శాంతి కరువవ్వడం.

మనం ప్రేమించే వ్యక్తులు పక్కన ఉన్నా, విలాసవంతమైన పడక ఉన్నా, నిద్ర అనేది మన మెదడు లోపలి నుండి రావాల్సిన ఒక సహజమైన స్పందన. నిద్రలేమి అనేది ఒక వ్యక్తిని ఒంటరిని చేస్తుంది. లోపల ఏదో వెలితి, రేపటి గురించి తెలియని భయం, చిన్న విషయానికే సహనం కోల్పోయే స్థితి. ఇవన్నీ ఒక చీకటి వలయంలా మనల్ని చుట్టుముడతాయి. నిద్ర అనేది కేవలం శరీరం ఆగిపోయే సమయం కాదు, అది మన మనసును మనమే ప్రేమించుకునే క్షణం. అందుకే, నిద్రను కోల్పోవడం అంటే మనలోని సంతోషాన్ని, ఉత్సాహాన్ని మెల్లమెల్లగా కోల్పోవడమే. నిద్రను ఒక ఔషధంగా గుర్తించినప్పుడే, మనం మళ్ళీ సంపూర్ణమైన మానసిక ఆరోగ్యంతో చిరునవ్వు చిందించగలం.

యువతకు భారమైన ఉదయం

నేటి తరం యువత నిద్రకు దూరం కావడానికి ప్రధాన కారణం సాంకేతికతతో ముడిపడి ఉన్న జీవనశైలి. స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా, ఓవర్-ది-టాప్ ప్లాట్‌ఫారమ్‌లు యువతను ఒక మాయా ప్రపంచంలో బంధిస్తున్నాయి. రాత్రి వేళల్లో గంటల తరబడి రీల్స్ చూడటం లేదా వెబ్ సిరీస్‌లు చూడటం వల్ల సమయం తెలియకుండానే గడిచిపోతోంది. మొబైల్ స్క్రీన్‌ల నుండి వెలువడే 'బ్లూ లైట్' మన మెదడును మోసం చేసి, అది ఇంకా పగలే అని నమ్మేలా చేస్తుంది. దీనివల్ల నిద్రను కలిగించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి, కళ్ళు అలిసిపోయినా మెదడు మాత్రం మేల్కొనే ఉంటుంది. దీనినే 'డిజిటల్ ఇన్సోమ్నియా' అని పిలుస్తున్నారు.

మరొక ప్రధాన కారణం 'రివెంజ్ బెడ్‌టైమ్ ప్రోకాస్టినేషన్'. పగలు చదువు, ఉద్యోగం లేదా ఇంటి పనుల ఒత్తిడిలో తమకంటూ వ్యక్తిగత సమయం దొరకని యువత, ఆ 'స్వేచ్ఛ' కోసం నిద్రను త్యాగం చేస్తున్నారు. రాత్రి అందరూ పడుకున్నాక దొరికే ప్రశాంతమైన సమయాన్ని తమకు ఇష్టమైన పనుల కోసం (చాటింగ్, గేమింగ్ లేదా కేవలం ఆలోచించడం) వాడుకుంటారు. ఈ క్రమంలో నిద్ర సమయం తగ్గిపోయి, అది దీర్ఘకాలిక అలవాటుగా మారిపోతుంది. దీనికి తోడు 'ఫోమో' అంటే సోషల్ మీడియాలో ఏదైనా కొత్త విషయం మిస్ అవుతామేమో అనే ఆందోళన వారిని నిరంతరం అలర్ట్‌గా ఉంచుతోంది.

ఆధునిక పోటీ ప్రపంచం సృష్టించిన కెరీర్, విద్యా ఒత్తిడి కూడా నిద్రను హరిస్తోంది. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం, పరీక్షల భయం లేదా ఆఫీసు డెడ్ లైన్స్ యువతలో ఆందోళనను పెంచుతున్నాయి. ఈ మానసిక ఒత్తిడి వల్ల పడకపై చేరినా మెదడు విశ్రాంతి తీసుకోలేకపోతుంది. దీనికి తోడు మారుతున్న ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా రాత్రిపూట కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ తాగడం లేదా అర్ధరాత్రి జంక్ ఫుడ్ తినడం వంటివి శరీర జీవ గడియారాన్ని పూర్తిగా గందరగోళానికి గురిచేస్తున్నాయి.

సాంఘిక, శారీరక మార్పులు కూడా యువత నిద్రపై ప్రభావం చూపుతున్నాయి. వీకెండ్స్ (వారాంతాల్లో) ఆలస్యంగా నిద్రలేవడం, పగలు ఎక్కువ సమయం పడుకోవడం వల్ల ఆదివారం రాత్రి నిద్ర పట్టక, సోమవారం ఉదయం తీవ్రమైన అలసటకు గురవుతున్నారు. ఈ క్రమశిక్షణ లేని నిద్ర వేళలు మెదడులోని 'స్లీప్ ఫ్యూయల్'ను దెబ్బతీస్తాయి. నిద్రలేమి కేవలం అలసటనే కాదు, యువతలో చిరాకు, ఏకాగ్రత లోపించడం, ఊబకాయం చిన్న వయసులోనే డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది.

మనం రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే, మరుసటి రోజు ఉదయం చాలా భారంగా అనిపిస్తుంది. సహనం తగ్గిపోవడం, ఆలోచనలు స్పష్టంగా లేకపోవడం మూడ్ సరిగ్గా లేకపోవడం వంటివి జరుగుతాయి. ఇది కేవలం మన భ్రమ కాదు. నిద్రకు, మన మానసిక స్థితికి చాలా లోతైన సంబంధం ఉంది. అధ్యయనాల ప్రకారం, నిద్రలేమి వల్ల డిప్రెషన్ (కుంగుబాటు), ఆందోళన పెరుగుతాయి. అదే సమయంలో, ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది అనడానికి నిద్రలో మార్పులే మొదటి సంకేతంగా కనిపిస్తాయి. ఇది ఒక చక్రంలా ఒకదానికొకటి ప్రభావితం చేసుకుంటాయి.

నిద్రలేమి వర్సస్ నిద్ర లేకపోవడం

డాక్టర్ లారెన్ వాటర్‌మాన్ చెప్పినట్లుగా, ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. 'స్లీప్ డిప్రివేషన్' అంటే పక్కన పసిపిల్లల ఏడుపు లేదా శబ్దాల వల్ల మనకు నిద్రపోయే అవకాశం ఉన్నా బయటి పరిస్థితుల వల్ల నిద్ర పట్టకపోవడం. ఇది శారీరక ఆరోగ్యానికి, గుండెకు ప్రమాదకరం. కానీ 'ఇన్సోమ్నియా' లేదా నిద్రలేమి అనేది మన మెదడు లోపల జరిగే మార్పు. ఇక్కడ నిద్రపోయే అవకాశం ఉన్నప్పటికీ, మెదడులోని కొన్ని వ్యవస్థలు మనల్ని మేల్కొని ఉంచుతాయి. దీర్ఘకాలిక ఇన్సోమ్నియా ఉన్నవారి మెదడు తక్కువ సమయంలోనే నాణ్యమైన నిద్రను పొందేలా అలవాటు పడుతుంది.

నిద్ర చక్రాలు

మనం నిద్రలో ఉన్నప్పుడు ప్రతి గంటకు సుమారు 10 నుండి 15 సార్లు కొద్దిగా మేల్కొంటాము. ఇది ఆదిమానవుల కాలం నుండి వస్తున్న పరిణామ క్రమం. అడవుల్లో లేదా గుహల్లో పడుకున్నప్పుడు ప్రమాదాలను పసిగట్టడానికి మెదడు ఇలా చేసేది. మనం పడకపై నుండి కింద పడకుండా ఉండటానికి కూడా ఈ మేల్కొలుపులే కారణం. సాధారణ నిద్ర ఉన్నవారు దీన్ని గుర్తుంచుకోరు, కానీ నిద్రలేమి సమస్య ఉన్నవారు ప్రతి చిన్న మెలకువను గమనిస్తూ, "నాకు నిద్ర రావడం లేదు" అని ఆందోళన చెందుతుంటారు. ఈ ఆందోళనే వారిని మరింత మేల్కొని ఉంచుతుంది.

మెలటోనిన్: వెలుగుకు భయపడే హార్మోన్

మెలటోనిన్ అనేది చీకటి పడగానే మన మెదడు సహజంగా విడుదల చేసే ఒక హార్మోన్. ఇది మన శరీరానికి "ఇక పడుకో" అని సంకేతాలను ఇస్తుంది. అయితే, ఆధునిక కాలంలో ఫోన్లు, కంప్యూటర్ల నుండి వచ్చే బ్లూ లైట్ ఈ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటోంది. ముఖ్యంగా మెలటోనిన్ సప్లిమెంట్ల విషయంలో జాగ్రత్త అవసరం. అవి వెలుతురు తగిలితే వెంటనే పనిచేయవు. గాలి చొరబడని, కాంతి తగలని ప్యాకెట్లలో ఉన్న మెలటోనిన్ మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది. లేదంటే మీరు వాడే మందులు కేవలం ఖాళీ టాబ్లెట్లుగా మిగిలిపోవచ్చు.

దీనిని ప్రధానంగా నిద్రలేమి, విదేశీ ప్రయాణాల వల్ల కలిగే జెట్ లాగ్, నైట్ షిఫ్ట్‌ల వల్ల దెబ్బతిన్న నిద్ర చక్రాన్ని సరిచేయడానికి ఉపయోగిస్తారు. ఇది నిద్ర పట్టే సమయాన్ని తగ్గించడమే కాకుండా, నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. భారతదేశంలో ప్రస్తుతం ఐటీ ఉద్యోగాలు, స్మార్ట్‌ఫోన్ల వాడకం వల్ల నిద్ర సమస్యలు పెరగడంతో మెలటోనిన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది.అలాగే ఆటిజం వంటి సమస్యలు ఉన్న పిల్లల్లో నిద్ర రాకపోతే డాక్టర్ల సలహాతో దీనిని వాడుతుంటారు.

2025-2026 నాటికి ఇది మార్కెట్లో మరింతగా అందుబాటులోకి రానుంది. ఇప్పుడు ఇండియాలో మెడికల్ షాపులతో పాటు అపోలో, అమేజాన్ వంటి ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో గమ్మీస్, మాత్రల రూపంలో ఇవి సులభంగా లభిస్తున్నాయి.

అయితే, మెలటోనిన్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. గర్భిణీలు, డయాబెటిస్, బీపీ మందులు వాడేవారు వైద్యుల సలహా లేకుండా వీటిని తీసుకోకూడదు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా (ఏడాది కంటే ఎక్కువ) వాడటం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అలాగే, పారదర్శక బాటిళ్లలో ఉండే గమ్మీలు కాంతికి గురై తమ ప్రభావాన్ని కోల్పోతాయి కాబట్టి, ఫాయిల్ ప్యాకేజింగ్‌లో ఉన్న సప్లిమెంట్లను ఎంచుకోవడం ఉత్తమం. డాక్టర్ సలహా లేకుండా వీటిని 'సహజమైనవి' అని భావించి అధిక మోతాదులో వాడటం సురక్షితం కాదు.

పావ్ లోవ్ థియరీ

శాస్త్రీయంగా 'క్లాసికల్ కండిషనింగ్' అనే ప్రక్రియ మన నిద్రను శాసిస్తుంది. పడకగదిలోకి వెళ్ళగానే నిద్ర రావాలి. కానీ ఇన్సోమ్నియా ఉన్నవారు బెడ్‌పై పడుకుని పని చేయడం, ఫోన్లు చూడటం లేదా గొడవలు పడటం వల్ల, వారి మెదడు పడకగదిని "మేల్కొని ఉండాల్సిన చోటు"గా గుర్తిస్తుంది. అందుకే సోఫాలో నిద్ర వచ్చే వ్యక్తి బెడ్‌పైకి వెళ్ళగానే మేల్కొంటాడు. బెడ్‌రూమ్‌ను కేవలం నిద్రకు మాత్రమే పరిమితం చేయడం ద్వారా మన మెదడును తిరిగి నిద్రకు అనుకూలంగా మార్చుకోవచ్చు.

అలసట వర్సెస్ నిద్రమత్తు

చాలామంది ఈ రెండింటినీ ఒకటే అనుకుంటారు. 'అలిసిపోవడం' అంటే శక్తి లేకపోవడం, ఏ పని చేయాలనిపించకపోవడం. కానీ 'నిద్రమత్తు' అంటే కళ్ళు ఆగిపోవడం, నిద్రలోకి జారిపోవడం. ఇన్సోమ్నియా ఉన్నవారు రోజంతా అలిసిపోయి ఉంటారు, కానీ వారికి నిద్రమత్తు రాదు. అందుకే వారు పడుకున్నా నిద్ర పట్టదు. మెదడులోని 'ఓరెక్సిన్' అనే రసాయనం అధికంగా ఉండటం వల్ల వారి మెదడు ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటుంది. దీనినే 'టైర్డ్ బట్ వైర్డ్' అంటారు.

15 నిమిషాల గోల్డెన్ రూల్:

ఒకవేళ మీరు పడకపై చేరిన 15-20 నిమిషాల వరకు నిద్ర పట్టకపోతే, బలవంతంగా అక్కడే పడుకుని ఉండకూడదు. వెంటనే లేచి వేరే గదిలోకి వెళ్ళి ఏదైనా సాధారణ పని చేయాలి. పుస్తకం చదవడం లేదా బోర్ కొట్టే పని ఏదైనా చేయవచ్చు. మళ్ళీ నిద్ర వస్తున్నట్లు అనిపించినప్పుడు మాత్రమే బెడ్ పైకి రావాలి. ఇలా చేయడం వల్ల పడకపై పడుకుని గంటల తరబడి బాధపడే అలవాటు తప్పుతుంది. పడకగది మరియు నిద్రలేమి మధ్య ఉన్న అనుబంధాన్ని తెంచడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం.

స్లీప్ ఫ్యూయల్: నిద్రకు ఇంధనం

మనం ఉదయం నిద్రలేచిన క్షణం నుండి మెదడులో నిద్రకు కావాల్సిన రసాయనం తయారవ్వడం మొదలవుతుంది. ఇది ఎంత ఎక్కువగా నిండితే రాత్రి అంత త్వరగా నిద్ర పడుతుంది. మధ్యాహ్నం పూట నిద్రపోవడం వల్ల ఈ ఇంధనం ఖర్చయిపోతుంది. దీనివల్ల రాత్రికి తగినంత ఇంధనం లేక నిద్ర రాదు. అలాగే ప్రతిరోజూ ఉదయం ఒకే సమయానికి నిద్రలేవడం వల్ల మన బాడీ క్లాక్ సరిగ్గా సెట్ అవుతుంది. ఆదివారం కదా అని ఆలస్యంగా లేస్తే, సోమవారం ఉదయం చాలా కష్టంగా ఉంటుంది.

కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఫర్ ఇన్సోమ్నియా* *నిద్రలేమికి అసలైన చికిత్స:

చాలామంది నిద్ర పట్టకపోతే నిద్రమాత్రలు వాడుతుంటారు, కానీ అవి తాత్కాలికమే. 'కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఫర్ ఇన్సోమ్నియా' (సిబిటి 1) అనేది నిద్రలేమికి శాశ్వత పరిష్కారం. ఇది నిద్ర గురించి మనకున్న భయాలను తొలగించి, మెదడును తిరిగి ప్రోగ్రామ్ చేస్తుంది. నిద్రపోయే సమయాన్ని కుదించడం క్రమశిక్షణతో కూడిన అలవాట్లను పాటించడం ద్వారా ఎలాంటి మందులు లేకుండానే నిద్రను తిరిగి పొందవచ్చు. ఇది డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

నిద్ర సమస్యలు మూడు నెలల కంటే ఎక్కువగా ఉండి, మీ రోజువారీ పనులను దెబ్బతీస్తుంటే ఖచ్చితంగా నిపుణులను సంప్రదించాలి. చిన్నపాటి స్ట్రెస్ వల్ల వచ్చే నిద్రలేమిని ప్రారంభంలోనే గుర్తించి సరిదిద్దుకుంటే అది 'క్రానిక్ ఇన్సోమ్నియా'గా మారకుండా ఉంటుంది. నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, అది మన మెదడును శుభ్రం చేసే ఒక ప్రక్రియ. కాబట్టి నిద్రను నిర్లక్ష్యం చేయకుండా, సరైన అలవాట్లతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం మనందరి బాధ్యత.