
నిద్రలేచిన పురాతన జీవం
భూమి కడుపులో 40వేల ఏళ్లుగా నిద్రిస్తున్న జీవం ఒక్కసారిగా మేల్కొన్నది. అది పూలు పూయించే జీవం కాదు, భయం పుట్టించే జీవం. మానవజాతి పుట్టకముందే ఉన్న ఆ జీవం ఇప్పుడు మళ్లీ మన ముందుకొచ్చింది. ఇటు మంచు కరుగుతోంది.. అటు భూమి వేడెక్కుతోంది.. ఆ వేడి తాకిడి కింద మరణం నుంచి మెల్లగా లేచిన ఆ సూక్ష్మజీవులు మళ్లీ జీవించడం మొదలుపెట్టాయి. శూన్యంలో ఒక చినుకంత జీవం మళ్లీ కదలింది. మైక్రోస్కోప్ కింద అది మెల్లగా విరబూసింది. ఇది కథ కాదు.. ప్రకృతి రాసిన ఒక శాపగీతం.
యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. మంచుతో, రాతితో, మట్టితో కలసి 40వేల ఏళ్లుగా నిశ్శబ్దంగా పడి ఉన్న భూమి గుండె భాగాన్ని తవ్వారు. అది మానవ అడుగులు అరుదుగా తగిలే ప్రదేశం. ఆ మట్టి నమూనాలను వారు జాగ్రత్తగా ప్రయోగశాలకు తీసుకెళ్లి, చల్లదనాన్ని మెల్లగా వేడి చేశారు. 3 డిగ్రీల నుంచి 12 డిగ్రీల వరకు పెంచిన ఉష్ణోగ్రతల్లో, వారు ఆ నిద్రిస్తున్న కణాలను మేల్కొలిపే ప్రయత్నం చేశారు. మొదట ఎలాంటి రియాక్షన్ రాలేదు. వారాల తరబడి, నెలల తరబడి ఆ మంచు కణాలు మౌనంగా ఉండిపోయాయి. కానీ ఒక రోజు, మైక్రోస్కోప్ కింద చిన్న చలనం కనిపించింది. అది ఊపిరి లేని చలనం కాదు, జీవానికి మొదటి కదలిక. మంచు రంధ్రాల మధ్య, సూక్ష్మ స్థాయిలో జీవం మళ్లీ మొలకెత్తింది. భూమి నిశ్శబ్దం భగ్నమై, శాస్త్రవేత్తల గుండెల్లో ఒక చల్లటి భయం పాకింది.
కంటికి కనిపించని ఆ జీవం మనం ఊహించలేనంత పురాతనమైనది. అది మానవ జాతికి ముందే ఈ భూమిపై సంచరించిన ఒక సూక్ష్మ గాథ. మంచు కప్పుకున్న నేల కింద 40వేల సంవత్సరాలుగా నిద్రించిన ఆ సూక్ష్మజీవులు ఇప్పుడు మళ్లీ కదలడం మొదలుపెట్టాయి. అవి కేవలం జీవరాశులు కాదు, కాలపు జ్ఞాపకాలు. ఆ నమూనాలను అలాస్కా-ఫెయిర్‌బ్యాంక్స్ సమీపంలోని పర్మాఫ్రోస్ట్ రీసెర్చ్ టన్నల్ అనే ప్రదేశం నుంచి తీసుకున్నారు. ఆ భూగర్భ మార్గం శాస్త్రవేత్తల కంటికి ఒక శ్మశానం లాంటిది. ఇది భయానకంగా ఉంటుంది. మంచు కరిగినప్పుడు బయటకు వస్తున్న ప్రతి కణం ఒక కొత్త మర్మం. మైక్రోస్కోప్ కింద ఆ చిన్న చిన్న కణాలు కదిలినప్పుడు, అది ఒక భూతగీతం విన్నట్టే ఉంటుంది.
ఈ సూక్ష్మజీవులు మానవుడిని ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేవు కానీ.. వాటి మేల్కొలుపు ప్రపంచానికి మరో ముప్పు తీసుకువస్తుంది. అవి మళ్లీ జీవించినప్పుడు కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి వాయువులను విడుదల చేస్తాయి. ఈ వాయువులే మన వాతావరణాన్ని వేడి చేస్తాయి. ఇటు ఈ మంచు మెల్లగా కరుగుతున్నది..అటు భూమి మెల్లగా వేడెక్కుతున్నది.. ఈ వేడి మరిన్ని మంచు గర్భాల్ని చీలుస్తున్నది. ప్రతి చీలికలోనూ మరో జీవం నిద్రలేచే అవకాశం ఉంది. అందుకే ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరూ చెప్పలేరు కూడా. ఇక ఈ మేల్కొలుపు వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే, ఇవి కేవలం సూక్ష్మ జీవులు మాత్రమే కాదు, భూమి నాడుల్లో పాతిపడిన పాత జ్వాలలు. మనిషి ఇంకా చూడని రోగాలు, ఎప్పుడో మరచిపోయిన వ్యాధులు, ఈ మంచు గర్భంలో నిద్రపోతున్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం.. ఇవి మనల్ని నేరుగా సంక్రమించకపోయినా, ఇవి మళ్లీ ఊపిరి తీసుకోవడం వల్ల భూమి వాతావరణం మారిపోతుంది. ఈ జీవాలు మేల్కొన్నప్పుడు విడుదలయ్యే వాయువులు చాలా ప్రమాదకరం.
ఇది కేవలం శాస్త్రానికే కాదు.. మానవజాతికి కూడా హెచ్చరిక. ఒకరోజు ఈ మంచు కింద నుంచి పాతకాలపు రోగాలు బయటకు వస్తే, మన మందులు, మన టీకాలు వాటి ఎదుట బలహీనంగా మారిపోతాయేమో. కొందరు శాస్త్రవేత్తల ప్రకారం.. పర్మాఫ్రోస్ట్ కరిగిపోతే, యాంటీబయోటిక్స్‌కు ప్రతిఘటన చూపే సూక్ష్మజీవులు కూడా మేల్కొనే అవకాశం ఉంది. అనేక శతాబ్దాల క్రితం భూమిని భయపెట్టిన ఆంత్రాక్స్, పాక్స్ లాంటి వ్యాధులు మళ్లీ బయటికొచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు మానవుడు యంత్రాలతో ఆకాశాన్ని తాకాడు.. అణువులతో ప్రపంచాన్ని వశపరిచాడు కానీ.. భూమి గర్భంలోని ఒక సూక్ష్మజీవాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పుడిదే అందరిని భయపెడుతోంది. మరి చూడాలి.. ఈ 40వేల నాటి సూక్ష్మజీవులు ప్రపంచాన్ని ఏం చేయనున్నాయో వెయిట్ అండ్ సీ..!
