
నిత్య వివాదాల శింగనమల
గ్రూపు తగాదాలకు పెట్టింది పేరు శింగనమల నియోజకవర్గం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ స్థాయిలో ఏ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు ఉండవు. పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో గ్రూపు తగదాలతో నిత్యం వార్తల్లో ఉంటుంది శింగనమల నియోజకవర్గం. నిత్య వివాదాలు, తగాదాలతో వార్తల్లోకి ఎక్కడానికి కారణం ఏంటి అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు రకరకాల కారణాలు సమాధానంగా వినిపిస్తున్నాయి.
శింగనమల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఎక్కువ కాలం ఏ ఎమ్మెల్యే నియోజకవర్గంలో నిలదొక్కుకోలేదు. వర్గాన్ని నడపలేదు. అందుకే ప్రతిసారి కొత్తవారు ఎమ్మెల్యే అవుతున్నారు. ఒకరో, ఇద్దరో రెండు సార్లు గెలిచిన పరిస్థితి. కానీ ఎవరు గెలిచినా అధికారం మాత్రం పరిమితమే. దీనికి కారణం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడమే. టికెట్ రావాలంటే అగ్రవర్ణ నేతల అండ ఉండాల్సిందే. గెలవాలన్నా వారి అనుగ్రహం ఉండాల్సిందే. గెలిచాక వారి మాట వినాల్సిందే. వినకపోతే నియోజకవర్గంలో, పార్టీలో సొంత పార్టీ వారే సమస్యలు సృష్టించడం. ఎమ్మెల్యేను బద్నాం చేయడం. అధిష్టానానికి ఫిర్యాదు చేయడం. మొత్తంగా ఎమ్మెల్యే పనికిరారు అన్న భావన అటు ప్రజల్లోనూ, ఇటు అధిష్టానంలోను సృష్టించడం ఇక్కడ సాధారణ విషయం.
ప్రాంతీయ పార్టీల్లో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఉన్నప్పటి కంటే ఎక్కువగా ఇప్పుడు టీడీపీ,వైసీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. 2019లో ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి గెలిచారు. ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి ఏపీ పాఠశాల విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమీషన్ సీఈవోగా ఉన్నారు. ఆమె సామాజికవర్గం ఎస్సీ. ఆమె భర్తది రెడ్డి సామాజికవర్గం. అయినప్పటికీ వైసీపీలో గ్రూపు తగదాలు ఆగలేదు. ప్రతి కీలక నేత నియోజకవర్గంలో పెత్తనం కోసం ప్రయత్నించారు. ఆమెపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. చివరికి 2024 ఎన్నికల్లో ఆమెకు టికెట్ రాకుండా చేశారు. కానీ జగన్ ఆమె భర్తకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆలూరు సాంబశివారెడ్డి చెప్పినవారికి టికెట్ ఇచ్చారు. ఇది వైసీపీలోని పరిస్థితి. ఇప్పుడు శైలజానాథ్ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్నారు. కానీ గ్రూపులు మాత్రం మారలేదు. ఇంకా ఉనికిలోనే ఉన్నాయి. అధికారం లేదు కాబట్టి నిద్రావస్థలో ఉన్నాయి.
టీడీపీ విషయానికి వస్తే.. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నిత్యం వార్తల్లో ఉంటున్నారు. దీనికి కారణం గ్రూపు తగాదాలే. మండలానికో నాయకుడు పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే తన పట్టు కోల్పోకుండా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గ్రూపులు, తగదాలు పెరిగాయి. నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తున్నారు. ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇంచార్జీ మంత్రి ముందు రాళ్లు రువ్వుకుంటున్నారు. చొక్కాలు చించుకుంటున్నారు. మేం లేకుండా గెలవగలవా, గెలిచావా అంటూ మాట్లాడుతున్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు మీద ఫిర్యాదులు అందుతున్నాయి. కానీ ఎమ్మెల్యే మాత్రం ఎవరికీ తలవంచకుండా ముందుకు వెళ్తున్నారు.
ఈ స్థాయిలో శింగనమల గ్రూపు తగాదాలకు ఎస్సీ నియోజకవర్గం కావడమే కారణం అంటున్నారు విశ్లేషకులు. కానీ మిగిలిన ఎస్సీ నియోజకవర్గాల్లో ఈస్థాయి తగదాలు ఎందుకు లేవు అన్న ప్రశ్న కూడా ఉంది. దీనికి సమాధానం శింగనమలలో ఎస్సీ రిజర్డ్వ్ కాకుంటే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న నాయకులు మండలానికి ఒకరు ఉన్నారు. అటు వైసీపీలో ఇటు టీడీపీలో ఇదే పరిస్థితి. వారంతా ఎమ్మెల్యేలు కాకుండానే ఎమ్మెల్యే పెత్తనం కోరుతున్నారు. అందుకే సమస్య అన్నది ఒక అంచనా. అదే సందర్భంలో ఇరుపార్టీల్లోనూ పక్క నియోజకవర్గాల నేతల జోక్యం, పెత్తనం ఇంకో కారణం అన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే నిత్య వివాదాలు, తగాదాలతో శింగనమల వార్తల్లో ఉంటుందన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది.
