
నితీశ్ కేబినెట్ లో సామాజిక సమీకరణకు ప్రాధాన్యం
బీహార్ ముఖ్యమంత్రి గా పదోసారి ప్రమాణం చేసిన నితీశ్ కుమార్ గురువారం 26 మంది మంత్రులతో కొత్త కేబినెట్‌ని ఏర్పాటు చేశారు. ఈ జాబితాలో అనుభవజ్ఞులు, 10 మంది కొత్తవారు, అలాగే కుల–ప్రాంతీయ సమతౌల్యం స్పష్టంగా కనిపించింది. 19 ఏళ్లకు పైగా రాష్ట్ర పరిపాలనలో ఉన్న జెడీయూ అధినేత నితీశ్ తన పార్టీలోని కీలక నేతలతో పాటు ఎన్డీఏ భాగస్వామి బీజేపీకి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యమంత్రి సహా గరిష్ఠంగా 36 మంది మంత్రులు ఉండొచ్చు.
విజయ్ సిన్హా – సామ్రాట్ చౌదరీ కొనసాగింపు
బీజేపీకి చెందిన మాజీ ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరీ, విజయ్‌కుమార్ సిన్హా కేబినెట్‌లో కొనసాగుతుండగా జెడీయూ సీనియర్‌లు బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజయ్‌కుమార్ చౌదరీ, శ్రావణ్ కుమార్‌లను కూడా మళ్లీ బాధ్యతల్లోనే ఉంచారు.
గతంలో ఉన్న బీజేపీ మంత్రుల రీ-ఎంట్రీ
బీజేపీకి చెందిన మంగళ్ పండే, ప్రమోద్ కుమార్, సురేంద్ర ప్రసాద్ మెహతా, నితిన్ నబీన్ మళ్లీ మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం ‘ఒకే వ్యక్తి–ఒకే హోదా’ నిబంధన ప్రకారం రాజీనామా చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ కూడా మంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. 2022లో నితీశ్ ఎన్డీఏని విడిచినప్పుడు తప్పుకున్న నారాయణ ప్రసాద్ ఈసారి తిరిగి క్యాబినెట్‌లోకి వచ్చారు.
ఇతర పార్టీలకు స్థానం
ఎన్డీఏ భాగస్వామి హమ్(ఎస్) నుంచి మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్‌కు మళ్లీ చోటు కల్పించారు. ఎల్పీజే(ఆర్వీ) నుంచి సంజయ్ కుమార్ సింగ్, సంజయ్ కుమార్ రెండు స్థానాలు దక్కించుకున్నారు.
కొత్త ముఖాలకు అవకాశం
బీజేపీ యువ నేత, షూటర్‌గా పేరున్న శ్రేయసీ సింగ్, ఔరై ఎమ్మెల్యే రామా నిషాద్ (మల్లాహ్–ఈబీసీ కమ్యూనిటీ ) మొదటిసారిగా మంత్రులయ్యారు. జెడీయూ మాజీ నేత ఉపేంద్ర కుష్వాహా కుమారుడు దీపక్ ప్రసాద్ ఎమ్మెల్యే కాకపోయినా నేరుగా క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. త్వరలో శాసన మండలిలోకి పంపే అవకాశం ఉంది. రిత్‌లాల్ యాదవ్‌పై విజయం సాధించిన సీనియర్ బీజేపీ నేత రామ్‌కృపాల్ యాదవ్ మళ్లీ ముఖ్య పాత్రలోకి వచ్చారు.
ముగ్గురు మహిళలు… ఒకే ఒక్క ముస్లిం మంత్రి
మొత్తం ముగ్గురు మహిళలు — లెసీ సింగ్ (జెడీయూ), శ్రేయసీ సింగ్, రామా నిషాద్. కేబినెట్‌లో జేడీయూ నుంచి గెలిచిన జామా ఖాన్ మాత్రమే ముస్లిం ప్రతినిధిగా ఉన్నారు.
సామాజిక సమీకరణే లక్ష్యం
27 మంది సభ్యుల్లో 8 మంది అగ్ర కులాల వారు, 5గురు దళితులు, 13 మంది ఓబీసీ/ఈబీసీ వర్గాల వారు ఉన్నారు. పార్టీల వారీగా బీజేపీ 14, జెడీయూ 8, ఎల్పీజే(ఆర్వీ) 2, హమ్(ఎస్), ఆర్‌ఎల్‌ఎం చెరో ఒక్కటి దక్కించుకున్నాయి.
కేబినెట్‌లో చోటు దక్కని వారు
గత ప్రభుత్వం లో మంత్రులుగా పని చేసిన నితీశ్ మిశ్రా, జీవేష్ మిశ్రా, సంజయ్ సారావగి ఈసారి జాబితాలో లేరు. ప్రమాణ స్వీకార వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, పలు ఎన్డీఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చారు. బీహార్ అసెంబ్లీలో 89 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచిన విషయం తెలిసిందే.
