Let's talk: editor@tmv.in
నిజామాబాద్ మున్సిపల్ పోరు: 70% సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ 'విజయ' వ్యూహం

నిజామాబాద్ మున్సిపల్ పోరు: 70% సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ 'విజయ' వ్యూహం

Dantu Vijaya Lakshmi Prasanna
23 జనవరి, 2026

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై పట్టు సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పార్టీ కీలక నేతలు పాల్గొని, ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టారు. ఈ ఎన్నికల్లో 70 శాతం కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంక్షేమ పథకాలే 'శ్రీరామరక్ష'

సమావేశం అనంతరం మాజీ మంత్రి, సీనియర్ నేత మహమ్మద్ అలీ షబ్బీర్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీకి భారీ విజయాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ముస్లిం బస్తీలతో పాటు పేదలకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఓటర్లపై బలమైన ప్రభావం చూపుతున్నాయని ఆయన విశ్లేషించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 73 శాతం స్థానాలను గెలుచుకోవడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, అదే జోరును పట్టణాల్లోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

క్షేత్రస్థాయిలో ప్రచారం

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఈ సమావేశం అత్యంత ఫలప్రదంగా జరిగిందని తెలిపారు. ఆశావహ అభ్యర్థులు, నియోజకవర్గ ఇంచార్జుల నుంచి అభిప్రాయాలను సేకరించామని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పారు. నిజామాబాద్‌తో ప్రారంభమైన ఈ సమీక్షా సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17‌ పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఎన్నికల సమయం, సవాళ్లు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేలా యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే, ఫిబ్రవరిలో మహాశివరాత్రి, రంజాన్ పండుగలు ఉన్నందున, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికల షెడ్యూల్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రస్తుతం 60 వార్డులున్న నిజామాబాద్ కార్పొరేషన్‌లో బిఆర్ఎస్ మేయర్ పదవిలో ఉండగా, బీజేపీ 28 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో, ప్రతిపక్షాలను చిత్తు చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ తన పావులను కదుపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరగనుండటంతో, ఇది సెమీఫైనల్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.