
నిజామాబాద్ పేరును 'ఇందూరు'గా మారుస్తాం: ఎన్. రాంచందర్ రావు
ఇందూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొని పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కార్యకర్తల్లో కనిపిస్తున్న ఉత్సాహం, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఇందూరులో బీజేపీ విజయం ఖాయమనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 13న వెలువడే ఫలితాల తర్వాత నిజామాబాద్ పేరు ఇందూరుగా మారడం స్పష్టమవుతుందని పేర్కొన్నారు.
గతంలో ఇదే ప్రాంతంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వారిపై తీవ్రంగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్ గతంలో ఎంఐఎంతో కలిసి పనిచేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ పెరుగుతున్న ప్రభావాన్ని అడ్డుకోవడానికే బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య రాజకీయ సమన్వయం జరుగుతోందని అన్నారు. బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్‌కు వేసే ఓటు చివరికి ఎంఐఎంకే లాభం చేకూరుస్తుందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు, రైతులు, యువత, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించిన రాంచందర్ రావు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కులం, మతం, వర్గ భేదాలు లేకుండా ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ లక్ష్యంతో పాలన అందిస్తోందని ఆయన చెప్పారు.
పట్టణాల అభివృద్ధి కోసం రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాలు, అమృత్ పథకం, ఇంటింటికి తాగునీటి సరఫరా వంటి పథకాలు కేంద్ర నిధులతో అమలవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా బలహీనంగా ఉందని చెబుతూనే పన్నులు పెంచి ప్రజలపై భారం మోపుతోందని, బస్సు, విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కమీషన్ల ప్రభుత్వంగా ఆరోపించిన ఆయన, రాష్ట్రంలో అవినీతి పెరిగిందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలుచేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణకు సుపరిపాలన, అభివృద్ధి, భద్రత కావాలంటే బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఈ ఎన్నికల్లో ప్రజలను కోరారు.
