
నిజామాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై బీజేపీ నేతల విమర్శలు
నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల సమస్యలు వినడానికి ఒక్క నిమిషం సమయం కూడా లేదా? అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నా, సీఎం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారని ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు సరైన మద్దతు ధర లేక, వరి, మక్కజొన్న, సోయాబీన్ రైతులు నష్టాల్లో కూరుకుపోయారన్నారు. పంట బీమా, రుణమాఫీ, నీటి సరఫరా, ఎరువుల కొరత వంటి సమస్యలతో రైతులు దిన స్థితిలో ఉన్నారని స్థానిక బీజేపీ నాయకులు పేర్కొన్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని వారు విమర్శించారు.
అదేవిధంగా, నిజామాబాద్ నగరంలో రోడ్లు దయనీయ స్థితిలో ఉన్నాయని, డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని, తాగునీటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కాకుండా, ముఖ్యమంత్రి కేవలం పార్టీ కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రజా సమస్యలు వినకపోవడం దురదృష్టకరమని బీజేపీ నేతలు విమర్శించారు.
ఈ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ , నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్, నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి , అలాగే పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల తరఫున బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని, రైతులు, యువత, బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఎప్పటికప్పుడు ప్రజా ఉద్యమాలు చేస్తుందని నాయకులు పేర్కొన్నారు.
