
నిజాన్ని ఎప్పటికీ బంధించలేరు
లడఖ్ ను రాజ్యాంగంలో ఆరో షెడ్యూల్ లో చేర్చాలని, రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సుమారు 15 రోజుల పాటు నిరవధిక నిరసన దీక్ష చేసిన సామాజిక వేత్త, పర్యావరణ కార్యకర్త అయిన సోనమ్ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. అయితే ఆయనను విడుదల చేయాలని పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జీత్ సింగ్ బెయిన్స్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన వాంగ్ చుక్ అరెస్ట్ ను తీవ్రస్థాయిలో ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘సత్యాన్ని ఎప్పటికీ నిర్భందించలేం.
సోనమ్ అరెస్ట్ ప్రజాస్వామం పై జరిగిన ప్రత్యక్ష దాడి. ఆయన నేరస్థుడు కాదు లడఖ్ స్వరం. ఆయన అక్కడ విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి అసమానంగా కృషి చేశారు. ఆయనను అరెస్ట్ చేయడమంటే చట్టాలను తుంగలో తొక్కడమే’ అని విమర్శించారు. ప్రతీకార రాజకీయాలకు సోనమ్ వాంగ్ చుక్ ను బలి చేయవద్దు. రాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును ఇచ్చిందని, ప్రతి ఒక్కరికీ అభిప్రాయాలు తెలిపే హక్కు ఉందని, సువిశాల దేశంలో భిన్నప్రాయాలు వ్యక్తం అవుతాయని, అంతమాత్రనికే వారిని అణగదొక్కడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందే తప్పా, బలోపేతం చేయదని గుర్తు చేశారు.
చరిత్రలో చీకటి రోజు
శాంతియుత నిరసనలో పాల్గొనడానికి వచ్చిన పౌరులు. అక్కడ అకస్మాతుగా ప్రారంభమైన హింసతో ఆందోళనకు లోనయ్యారని, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారని లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్, బీజేపీ నాయకుడు తాషి గ్యాలన్స్ వాపోయారు. ఈ దుర్ఘటనను చరిత్రలో చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. వందమందికి గాయపడడం అత్యంత బాధకరమన్నారు. నిరసనకారులపై పోలీసులు అధికంగా బల ప్రయోగం చేశారని, నిరసనకారుల నుంచి, పోలీసుల నుంచి వైఫల్యం జరిగిందని, ఇరువైపుల జవాబుదారీ తనం ఉండాలని డిమాండ్ చేశారు.
లేహ్‌లో కొనసాగుతున్న కర్య్ఫూ
రాష్ట్ర హోదా కోసం ఇటీవల చెలరేగిన హింసలో నలుగురు మరణించడం, వందమందికి పైగా గాయపడడంతో లడఖ్ లో శాంతి భద్రతలను అదుపులో ఉంచడానికి పోలీసులు కర్య్ఫూ విధించారు. దీని ప్రకారం ఐదు లేదా అంతకంటే ఎక్కువమంది గుమిగూడడం పై నిషేదం విధించారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ఊరేగింపులు కానీ ర్యాలీలు తీయడానికి లేదు.
