
నిజాంల నాటి చారిత్రక చెరువును పునరుద్ధరించిన హైడ్రా
పాతబస్తీలో కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న నిజాంల నాటి చారిత్రక చెరువుకు హైడ్రా కొత్త ప్రాణం పోసింది. ఆక్రమణలతో ఆనవాళ్లే కోల్పోయిన బమ్–రుక్న్–ఉద్–దౌలా చెరువును తిరిగి వెలికి తీసి, చరిత్రను తవ్వి తీసినట్టుగా పునరుద్ధరించింది. ఒకప్పుడు నిజాం రాజుల కాలంలో వైభవంగా వెలుగొందిన ఈ చెరువును నేడు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ పాతబస్తీకే మణిహారంగా మార్చుతోంది హైడ్రా.
జనవరిలో చెరువును ప్రజలకు అందుబాటులోకి తెచ్చే దిశగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం బమ్–రుక్న్–ఉద్–దౌలా చెరువు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న చరిత్రకు మళ్లీ ప్రాణం పోస్తున్నాం. ప్రతి అంశంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చెరువుకు స్థానికులు సులభంగా చేరుకునేలా రహదారులు, ప్రవేశ ద్వారాలు ఉండాలని సూచించారు. చెరువు చుట్టూ బండ్‌పై ఏర్పాటు చేస్తున్న వాకింగ్ ట్రాక్‌లను పరిశీలించారు. చెరువు లోపలి వైపున భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న ఫెన్సింగ్ పనులను తనిఖీ చేశారు. చిన్నారులు ఆనందంగా ఆడుకునేలా ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న ప్లే ఏరియాలను, వృద్ధులు సేదదీరేందుకు నాలుగు వైపులా నిర్మించనున్న గజబోల నిర్మాణాలను పరిశీలించారు. పార్కులు, ఓపెన్ జిమ్‌ల ఏర్పాట్లు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని ఆయన సూచించారు.
విహార కేంద్రంగా అభివృద్ధి
నగరాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, నేషనల్ పోలీస్ అకాడమీ సమీపంలో ఉన్న ఈ చెరువును ఒక ఆదర్శ విహార కేంద్రంగా తీర్చిదిద్దాలని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఔషధ గుణాలు కలిగిన వృక్ష జాతులను, పచ్చని మొక్కలను చెరువు చుట్టూ నాటాలని సూచించారు. పచ్చిక బయళ్లతో పార్కులు ఆహ్లాదకరంగా ఉండేలా రూపకల్పన చేయాలని ఆయన చెప్పారు. చెరువు పరిసరాల్లో ఉష్ణోగ్రతల్లో మార్పు స్పష్టంగా కనిపించేలా పచ్చని వాతావరణం ఉండాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.
నిజాంల కాలంలో చెరువు నిర్మాణంలో వాడిన రాతిని వినియోగిస్తూ కట్టడాన్ని మరింత పటిష్టం చేయాలని, ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు విశాలంగా ఉండేలా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు. రాజేంద్రనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో వర్షపు నీరు ఈ చెరువుకు చేరేలా ఇన్‌లెట్లు నిర్మించాలని, వరద సమస్యలకు ఈ చెరువు చెక్‌పెట్టేలా అభివృద్ధి చేయాలని సూచించారు. భద్రత కోసం సీసీటీవీ కెమెరాలతో నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు.
చరిత్రను చాటే చెరువు
చారిత్రక ఆధారాల ప్రకారం, మూడో నిజాం సికందర్ జాహ్ పాలనలో అప్పటి ప్రధాని నవాబ్ రుక్న్–ఉద్–దౌలా ఈ చెరువును నిర్మించారు. అందుకే దీనికి బమ్–రుక్న్–ఉద్–దౌలా చెరువు అనే పేరు వచ్చింది. ఒకప్పుడు తాగునీటి అవసరాల కోసం 104 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు, కాలక్రమేణా కుదించబడుతూ హెచ్‌ఎండీఏ రికార్డుల ప్రకారం 17.05 ఎకరాలకు, చివరకు కేవలం 4.12 ఎకరాలకు పరిమితమైంది.
గత ఏడాది ఆగస్టులో హైడ్రా ఆక్రమణలను తొలగించి పూర్తి స్థాయిలో భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ ప్రక్రియలో ఎన్నో అవరోధాలు, విమర్శలను ఎదుర్కొన్నా వెనకడుగు వేయకుండా అభివృద్ధి పనులు పూర్తి చేసింది. నేడు ఆ విమర్శించిన వారే ఆశ్చర్యపోయేలా చెరువును అభివృద్ధి చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలలో కూడా ఊహించని స్థాయిలో ఈ ప్రాంతానికి అందం తీసుకొచ్చిన హైడ్రాకు అభినందనలు తెలియజేస్తున్నారు.
విశేషాలు, విశ్వాసాలు
స్థానిక వృద్ధులు చెబుతున్న కథనాల ప్రకారం, రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఈ చెరువుకు చేరేదని, నిజాంల కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు, ఈ చెరువును రాణులు స్నానాల కోసం వినియోగించేవారని చెబుతున్నారు. చెరువులో వనమూలికల చెట్లు, కొమ్మలు వేసి, దిగువ నిర్మించిన బావిలోకి వచ్చిన ఊట నీటిని తాగునీటిగా ఉపయోగించేవారని, ఔషధ గుణాలు కలిగిన ఈ నీటినే నిజాంలు వినియోగించేవారని స్థానికులు వివరిస్తున్నారు.
ఇక చెరువు చుట్టూ సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండటంతో, ఆ నీటిని సెంటు తయారీకి ఉపయోగించి అరబ్ దేశాలకు ఎగుమతి చేసేవారని చెబుతున్నారు. ఇలాంటి అపార చరిత్ర కలిగిన చెరువు మళ్లీ పునరుద్ధరణకు నోచుకోవడం పాతబస్తీ ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
