
నిఖార్సైన మాస్ లీడర్ పీజేఆర్: కేటీఆర్
హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో గత యాభై ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన ధీశాలి, నిఖార్సైన మాస్ లీడర్ పీ. జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. పీజేఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కొనసాగుతూ కూడా ప్రజల ప్రయోజనాల కోసం సొంత ప్రభుత్వాన్ని నిలదీసిన ధైర్యం పీజేఆర్‌కు మాత్రమే సాధ్యమైందన్నారు. “కృష్ణా జలాలు తెచ్చి హైదరాబాద్ దాహార్తి తీర్చాలి” అనే నినాదంతో ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి, పేదల సంక్షేమానికి పీజేఆర్ చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను పీజేఆర్ చూసి ఉంటే గుండె ఆనందంతో పులకించిపోయేవారని కేటీఆర్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌పై పీజేఆర్ కి ఉన్న విజన్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిజం చేసిందన్నారు. భవిష్యత్ తరాల నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా ప్రజాసేవలో పీజేఆర్ చూపిన నిబద్ధతను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
పీజేఆర్ ఆశయాలను ఆయన సుపుత్రుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నారని కేటీఆర్ ప్రశంసించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయ అభివృద్ధితో పాటు నగర ప్రజల సంక్షేమంలో ఆయన పాత్ర ప్రశంసనీయమన్నారు.
పీజేఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన నివాళి
ఖైరతాబాద్ చౌరస్తాలో పీజేఆర్ 18వ వర్ధంతి సందర్భంగా దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రజాదరణ కలిగిన మాస్ లీడర్ పీ. జనార్ధన్ రెడ్డి (పీజేఆర్)కి మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకున్నారు.
మంత్రి మాట్లాడుతూ, పీజేఆర్ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప మాస్ లీడర్ అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ రాజీలేని పోరాటం చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన నిలబడి పోరాడిన ధైర్యం ఆయనను ప్రత్యేకంగా నిలిపిందన్నారు.ప్రజా సేవ పట్ల పీజేఆర్ చూపిన నిబద్ధత, అంకితభావం నేటి, రాబోయే తరాల నాయకులకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
గాంధీ భవన్‌లో పీజేఆర్ వర్ధంతి వేడుకలు
పీ. జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్‌లో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీజేఆర్ చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్ పూలమాల వేసి స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలు పాల్గొని పీజేఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పేదలు అణగారిన వర్గాల సంక్షేమం కోసం జీవితాంతం అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా పీజేఆర్‌ను కొనియాడారు. ప్రజాసేవ పట్ల ఆయన చూపిన నిబద్ధత, ధైర్యం, నాయకత్వ గుణాలు నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.
