
నికోబార్ గిరిజన నేతలతో రాహుల్‌గాంధీ భేటీ
గ్రేట్ నికోబార్ దీవిలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఉన్న గిరిజన నాయకుల ప్రతినిధి బృందంతో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బుధవారం భేటీ అయ్యారు. వారి సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని, స్వయంగా దీవులను సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన, అభివృద్ధి ప్రజలను శక్తివంతం చేయాల్సిందే గానీ, వారిని తొలగించేలా ఉండకూడదని అన్నారు. భారతదేశం కొద్దిమందికే కాదు, ప్రజలందరిదని స్పష్టం చేశారు. గిరిజన నేతలతో జరిగిన చర్చలో, ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ సమస్య మాత్రమే కాదని, వారి గుర్తింపు, జీవన హక్కులకు సంబంధించిన అంశమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 800కిపైగా కుటుంబాలు, ముఖ్యంగా అత్యంత సున్నిత గిరిజన వర్గాలు (పీవీటీజీస్), తమ భూములను కోల్పోయే ప్రమాదం ఉందని వారు తనకు వివరించారని చెప్పారు. తరతరాలుగా ప్రకృతితో అనుసంధానంగా జీవిస్తున్న ఈ సమాజాలు, దీవి పర్యావరణాన్ని కాపాడుతున్నప్పటికీ, ఇప్పుడు అభివృద్ధి పేరిట పక్కకు నెట్టబడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల లాభాలు ఎవరికోసం అన్న ప్రశ్నకు, పోర్టులు, మౌలిక వసతులు, వనరులపై నియంత్రణ పెద్ద కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తుందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు.
ఇదిలా ఉండగా, తాగునీరు, రహదారులు, విద్య, ఉపాధి వంటి ప్రాథమిక అవసరాల్లో కూడా వారు కష్టాలు ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తడమే కాకుండా, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూడడానికి తాను త్వరలోనే గ్రేట్ నికోబార్ దీవిని సందర్శిస్తానని ఆయన తెలిపారు.
ఇక ఈ ప్రాజెక్ట్‌పై గతంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్ట్ గిరిజన సమాజాల అస్తిత్వానికి ముప్పు అని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ మాత్రం అన్ని అనుమతులు చట్టబద్ధంగానే పొందినట్లు చెప్పి, దేశ అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ అవసరమని సమర్థించారు. ఇక గత నెలలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఈ ప్రాజెక్ట్‌పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, పర్యావరణ అనుమతుల్లో తగిన రక్షణ చర్యలు ఉన్నాయని పేర్కొంటూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చింది.
