
నిందితుల ముందే మూడేళ్ల చిన్నారిని ఎలా ప్రశ్నిస్తారు? సుప్రీం ఆగ్రహం
ఆ పోలీసులు కనీస విచక్షణ జ్ఞానం లేకుండా ఆ పసిపాపను అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు అతిసమీపంలోనే ప్రశ్నించారు. పోలీస్ యూనిఫాంలోనే ఆ చిన్నారిని భయపెట్టారు. అలా ఎలా వ్యవహరిస్తారని సుప్రీంకోర్టు మండిపడింది. కనీసం ఆమె వయస్సును పరిగణనలోకి తీసుకోకుండా విచారించడంపై తీవ్రంగా తప్పుబట్టింది.
గురుగ్రామ్‌లో మూడేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి కేసులో పోలీసులు, మేజిస్ట్రేట్ వ్యవహరించిన తీరు తీవ్ర ఆందోళన కలిగించిందని సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారిని నిందితుల సమక్షంలోనే ప్రశ్నించడం, పోలీస్ యూనిఫాంలోనే విచారణ జరపడం వంటి చర్యలను కోర్టు ‘అసంవేదన’గా, ‘చట్టవిరుద్ధం’గా అభివర్ణించింది. ఈ కేసులో గురుగ్రామ్ పోలీస్ కమిషనర్‌తో పాటు దర్యాప్తు అధికారి మార్చి 25న పూర్తి రికార్డులతో కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్నారి తండ్రి సమర్పించిన అఫిడవిట్‌ను సీల్డ్ కవర్‌లో జిల్లా న్యాయమూర్తికి పంపించాలని ఆదేశిస్తూ, మేజిస్ట్రేట్ వ్యవహారంపై వివరణ తీసుకుని నివేదిక ఇవ్వాలని పేర్కొంది. బాధితురాలిని మేజిస్ట్రేట్ ఎదుట, అది కూడా నిందితుల సమక్షంలో విచారించడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది.
నాలుగు అడుగుల దూరంలో విచారణ
కేసు విచారణలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు వివరాలు తెలియజేస్తూ, చిన్నారిని మొదట పోలీస్ స్టేషన్‌కు, అక్కడి నుంచి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి, తరువాత కోర్టుకు తీసుకెళ్లారని చెప్పారు. ఈ ప్రక్రియలో పోలీసులు యూనిఫాంలో ఉండగా, నిందితులు కేవలం నాలుగు అడుగుల దూరంలో నిలబడి ఉండగానే చిన్నారిని ప్రశ్నించారని తెలిపారు. ఇది చిన్నారి మానసిక స్థితిని మరింత దెబ్బతీసిందని ఆయన వాదించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారి తల్లిదండ్రులకు కేసును ముందుకు తీసుకెళ్లవద్దని సూచించాడన్న ఆరోపణలపై కూడా కోర్టు తీవ్రంగా స్పందించింది. ఫిర్యాదు లేకపోయినా పోలీసులు దర్యాప్తు చేయాల్సిందే అని స్పష్టం చేసింది. చిన్నారి వయస్సు, ఆమె ఎదుర్కొన్న మానసిక ఆవేదనను పరిగణలోకి తీసుకోకుండా పెద్దవారిలా వ్యవహరించారని కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు సమయంలో చిన్నారిని పోలీస్ స్టేషన్, సీడబ్ల్యూసీ కార్యాలయం, కోర్టు, ఆసుపత్రి మధ్య తరలించడం వల్ల ఆమె మానసిక స్థితి మరింత దిగజారిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. తల్లిదండ్రులు ఇంటికే వచ్చి విచారణ చేయాలని కోరినా, సబ్‌ఇన్‌స్పెక్టర్ అసహనంగా స్పందించినట్టు ఆరోపించారు.
రెండు నెలలపాటు లైంగికదాడి
ఈ కేసులో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల చిన్నారిపై దాదాపు రెండు నెలల పాటు లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు మహిళా సహాయకులు, వారి పురుష సహచరుడు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య జరిగినప్పటికీ, చిన్నారి తన తల్లికి విషయం చెప్పిన తరువాత ఫిబ్రవరి 4న మాత్రమే కేసు నమోదైంది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు కొంతమందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే కేసులో దర్యాప్తు అధికారి గతంలో పోక్సో కేసులో లంచం తీసుకున్నందుకు సస్పెండ్ అయ్యాడన్న విషయం కూడా బయటపడింది. కేసు దర్యాప్తులో లోపాలున్నాయని ఆరోపిస్తూ, ఈ ఘటనపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ)తో విచారణ జరపాలని చిన్నారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై హర్యానా ప్రభుత్వం, డీజీపీ, గురుగ్రామ్ పోలీస్ కమిషనర్, డీసీపీ నుంచి కోర్టు స్పందనలు కోరింది. ఈ ఘటనలో చిన్నారిని నిందితుల సమక్షంలోనే ప్రశ్నించడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి అంశాలు తీవ్ర చర్చకు దారి తీస్తుండగా, కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు కఠినంగా పర్యవేక్షణ కొనసాగించనుంది.
