
నా సొంత అడ్డా కొత్తగూడెం… కార్పొరేషన్‌ను నందనవనంగా మారుస్తా: మంత్రి పొంగులేటి
భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షం సీపీఎం అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారం ముగింపు సమావేశాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభివృద్ధి హామీలను ప్రధానంగా ప్రస్తావించారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని త్రీ టౌన్ సర్కిల్, రామవరం ప్రాంతాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్స్‌లో జిల్లా అధ్యక్షురాలు దేవీ ప్రసన్న, స్థానిక నేతలు, అభ్యర్థులతో కలిసి పాల్గొన్న నాయకత్వం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించింది.
ఈ సందర్భంగా మంత్రి కొత్తగూడెం తన సొంత గడ్డ అని పేర్కొంటూ, కార్పొరేషన్‌ను నందనవనంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని తెలిపారు. ముఖ్యంగా ప్రాంతంలో కొనసాగుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కిన్నెరసాని నీటిని శుద్ధి చేసి 24 గంటల సరఫరా చేసే ప్రణాళికను త్వరలో రూపొందించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే కొత్తగూడెంలో మొదటి విడతగా 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. రాబోయే మూడు విడతల్లో పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఇప్పటికే నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు అందజేస్తామని వెల్లడించారు. సింగరేణి ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న 76 జీవో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తామని మంత్రి చెప్పారు. అలాగే చిట్టి రామారావు వంటి ప్రాంతాల్లో ఉన్న పోడు భూముల సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలిపారు.
కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణం, విద్యుత్ తీగల తొలగింపు వంటి సమస్యలను ప్రజా ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో 60 డివిజన్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మద్దతు మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ శ్రేణులు చివరి రెండు రోజులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
