Let's talk: editor@tmv.in
నా రాజీనామా ఆమోదించండి: ఎమ్మెల్సీ కవిత

నా రాజీనామా ఆమోదించండి: ఎమ్మెల్సీ కవిత

Gaddamidi Naveen
6 జనవరి, 2026

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజీనామాను ప్రకటించి, తెలంగాణ శాస‌న‌మండ‌లిలో చివరి రోజు భావోద్వేగానికి లోనయ్యారు. శాసన మండలిలో తన చివరి రోజున అత్యంత భావోద్వేగంతో ప్రసంగించిన ఆమె, కన్నీటి పర్యంతమయ్యారు. తన సొంత పార్టీలోనే అవమానాలు ఎదుర్కొన్నానని, ఒంటరిని అయ్యానని ఆవేదన వ్యక్తం చేస్తూనే, భవిష్యత్తులో సరికొత్త రాజకీయ శక్తిగా తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

సొంత పార్టీపైనే సంచలన ఆరోపణలు

సోమవారం మండలి వేదికగా కవిత మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది.తన తండ్రి కేసీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులు తనపై కుట్రలు పన్నారని, తనను రాజకీయంగా పక్కన పెట్టేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు.పార్టీకి చెందిన మీడియా సంస్థలే తనపై నిరంతరంగా తప్పుడు ప్రచారాలు నిర్వహించాయని ఆమె వాపోయారు. అత్యంత అవమానకరమైన రీతిలో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తనను మాటల్లో చెప్పలేనంత బాధకు గురిచేసిందని అన్నారు. నా పోరాటం ఆత్మగౌరవం కోసం, ఆస్తి కోసం కాదు. నేను నమ్మే దేవుడి మీద, నా ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అంటూ కాంగ్రెస్ పార్టీ తనపై చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు.

కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని “ఓ జోక్”గా అభివర్ణించిన కవిత, గత బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో విస్తృత అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణ శాసనమండలిలో మాట్లాడుతున్న సమయంలో ఆమె పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు. తనపై పార్టీ తీసుకున్న సస్పెన్షన్ చర్యను గుర్తుచేసుకున్న కవిత, బీఆర్‌ఎస్ క్రమశిక్షణ కమిటీ ఒక్క రాత్రిలోనే ఏర్పాటైందని, తనకు షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని అన్నారు. జాతీయ స్థాయిలో పార్టీగా ఎదగాలని చెబుతున్న బీఆర్‌ఎస్‌కు కేవలం ఎనిమిది పేజీల రాజ్యాంగం ఉంది. ఈ రోజు ధైర్యంగా చెబుతున్నాను బీఆర్‌ఎస్ పార్టీ రాజ్యాంగం ఒక జోక్ అని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు.

పార్టీ నిర్వహణలో ఎలాంటి విధివిధానాలు పాటించలేదని, ఇలా పార్టీని నడపడం సరికాదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయిన వెంటనే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు శాసనమండలి ఛైర్మన్ దానిని ఆమోదించలేదని తెలిపారు. రాజీనామాకు గల కారణాలను వివరించేందుకు సోమవారం మాట్లాడేందుకు అవకాశం కోరినట్టు చెప్పారు.

బీఆర్‌ఎస్ పాలనలో అవినీతిపై విమర్శలు

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతిపై కూడా కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్ భవనాల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని పేర్కొన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల కలెక్టరేట్ భవనాలు నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటి భారీ వర్షానికే నీటమునిగాయి. ఇదే అవినీతికి పెద్ద నిదర్శనం అని అన్నారు.

అమర్ జ్యోతి, అంబేద్కర్ విగ్రహం, కొత్త సచివాలయం, జిల్లా కలెక్టరేట్ భవనాల నిర్మాణాల్లోనూ అవినీతి జరిగిందని అప్పట్లో తన తండ్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కవిత చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన అమరుల స్మారకంగా నిర్మించిన అమర్ జ్యోతి నుంచి ప్రభుత్వ భవనాల వరకు అవినీతి జరిగిందన్నది వాస్తవమేనని ఆమె వ్యాఖ్యానించారు. తాను బీఆర్‌ఎస్ పాలనలో తీసుకున్న కొన్ని ప్రజాదరణ లేని నిర్ణయాలకు భాగస్వామి కాదని కూడా కవిత స్పష్టం చేశారు. పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలోనూ అనేక నిర్ణయాలకు తాను వ్యతిరేకంగా ఉన్నానని, అయితే వాటిని పట్టించుకోలేదని తెలిపారు.

కవితను తీవ్రంగా బాధపెట్టిన మరో అంశం కాంట్రాక్ట్ & ఔట్‌సోర్సింగ్ విధానంలో మార్పులు. కేసీఆర్ తెలంగాణకు రాకముందు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తారని ప్రకటించగా, అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని పెంచి, సంరక్షించడం జరిగింది. కవిత ఆరోపించినట్లయితే, కొందరు నేతల ఈ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను 4, 5 లక్షల రూపాయల వరకు అమ్మివేశారు అని తెలిపారు.

కొత్త పార్టీ దిశగా అడుగులు

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అదే బాటలో పయనిస్తోందని కవిత విమర్శించారు. తెలంగాణకు ఒక స్వతంత్ర రాజకీయ పార్టీ అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.త్వరలోనే మేము ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం మేము పోరాడుతాం అని ఆమె ప్రకటించారు. ప్రస్తుతం ఈ సభ నుంచి ఒక వ్యక్తిగా వెళ్తున్నాను, కానీ త్వరలోనే 'శక్తి'గా తిరిగి వస్తానని ఆమె ప్రతిజ్ఞ చేశారు.

ఇదిలా ఉండగా, ఆదివారం సూర్యాపేటలో మాట్లాడిన కవిత, రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బహిష్కరించిన బీఆర్‌ఎస్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ సభలను బహిష్కరించడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికే లాభం చేకూరుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ బహిష్కరణ నిర్ణయం బీఆర్‌ఎస్ అధినాయకత్వం తీసుకున్నదా? లేక తన కజిన్, ఎమ్మెల్యే టీ. హరీష్ రావు వ్యక్తిగత నిర్ణయమా? అని ప్రశ్నించారు. సభల్లో చర్చలకు దూరంగా ఉండటం తీవ్రమైన రాజకీయ తప్పిదం అని హెచ్చరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో తన తండ్రి కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీయడంలో హరీష్ రావు, జే సంతోష్ కుమార్ పాత్ర ఉందని ఆరోపించిన తర్వాతే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కవిత గుర్తు చేశారు. 2025 సెప్టెంబర్‌లో జరిగిన ఈ పరిణామం బీఆర్‌ఎస్‌లో తీవ్ర కలకలం రేపింది.

సస్పెన్షన్ తర్వాత కవిత తన ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి వేదికగా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నారు. బీఆర్‌ఎస్‌తో పాటు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా అవినీతి, అక్రమాల ఆరోపణలు చేస్తున్నారు. గత డిసెంబర్ 12న ఆమె మాట్లాడుతూ, ఒక రోజు నేను ముఖ్యమంత్రి అవుతాను. 2014 నుంచి జరిగిన అన్ని అన్యాయాలపై విచారణ జరిపిస్తాను అని ప్రకటించారు. కవిత వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లోని అంతర్గత విభేదాలను మరింత బహిర్గతం చేశాయని, తెలంగాణ రాజకీయాల్లో ఇవి కొత్త మలుపులకు దారితీయవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.