
నా పై అవినీతి ఆరోపణలు చేసిన వారితోనే ప్రభుత్వంలో ఉన్నాను: అజిత్ పవార్
మహారాష్ట్రలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా పూర్తిగా గందరగోళంగా మారాయి. అజిత్ పవార్ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా బీజేపీతో కలిసి అధికారంలో కొనసాగుతూనే, మరోవైపు మున్సిపల్ ఎన్నికల కోసం ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)తో చేతులు కలిపారు. అంతేకాదు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీపైనే బహిరంగంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది సాధారణ రాజకీయ పోటీలా కాకుండా అధికారంలో కలిసి – ఎన్నికల్లో విడిగా – విమర్శల్లో శత్రువులుగా అనే కొత్త తరహా రాజకీయ నమూనాను తెరపైకి తీసుకొచ్చారు. ఒకే సమయంలో మిత్రుడిగా ఉండి, అదే సమయంలో ప్రత్యర్థిగా వ్యవహరించడం ప్రజలకు తీవ్ర గందరగోళాన్ని కలిగిస్తోంది. ఇవెక్కడి ఊసరవెల్లి రాజకీయాలు బాబోయ్ అంటూ ప్రజలు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది.
పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థులపై నేరపూరిత నేపథ్యం ఉందంటూ బీజేపీ చేసిన విమర్శలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తీవ్రంగా స్పందించారు. కోర్టులో నేరం రుజువయ్యే వరకు ఎవరినీ దోషిగా పరిగణించరాదని స్పష్టం చేశారు. బీజేపీ పేరు ప్రస్తావించకుండా అజిత్ పవార్ మాట్లాడుతూ ఒకప్పుడు తనపై సాగునీటి కుంభకోణం ఆరోపణలు చేసిన పార్టీతోనే ప్రస్తుతం తాను ప్రభుత్వంలో భాగస్వామినని గుర్తుచేశారు.
మమ్మల్ని ప్రశ్నిస్తున్నవారిని నేను అడగదలుచుకున్నది ఏంటంటే, ఓ నిందితుడు పారిపోవడానికి ఎవరు సహాయపడ్డారో కూడా చూడాలి. అలాగే గత 15 ఏళ్లలో ఏ పార్టీ ఎంతమంది నేరపూరిత నేపథ్యం ఉన్న అభ్యర్థులను నిలబెట్టిందో వారి రికార్డులను బయటకు తీయాలని ఆయన అన్నారు. అదేవిధంగా రేపు ఎవరి మీదైనా కేసు నమోదైతే, నేరం రుజువు కాకముందే అతడు దోషి అయిపోతాడా? నా మీద రూ.70 వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు చేసినవాళ్లంతా ఇవాళ నా వెంట ప్రభుత్వంలో ఉన్నారా లేదా? చెప్పండి అని అజిత్ పవార్ ప్రశ్నించారు.
ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టారో చూడండి
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్, పుణెలో నేరపూరిత రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తూ, ఎన్సీపీ ఎందుకు నేరపూరిత నేపథ్యం ఉన్న అభ్యర్థులను పోటీలో నిలబెడుతోందని ప్రశ్నించడంతో అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోహోల్ మాట్లాడుతూ పుణెలో నేరాలు అంతం కావాలి, కొయితా గ్యాంగులను నిర్మూలించాలి అని పుణె గార్డియన్ మంత్రి అజిత్ పవార్ చెబుతున్నారు. కానీ మరోవైపు, తూర్పు పుణె నుంచి దక్షిణం, ఉత్తరం వరకు ఆయన వర్గం ప్రకటించిన అభ్యర్థుల జాబితా చూస్తే, ఎలాంటి వ్యక్తులను వారు ఆశ్రయించారో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఏ ప్రమాణాలకు సరిపోతుందో మాకు తెలియదని అన్నారు.
పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు బీజేపీ, ఎన్సీపీల మధ్య రాజకీయ వేడి పెరిగింది. రాష్ట్ర, కేంద్ర స్థాయిలో రెండు పార్టీలు మిత్రపక్షాలైనా, స్థానిక సంస్థల ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేయడం వల్ల తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. అదనంగా అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గంతో కలిసి పీఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడంతో మహాయుతి కూటమి భాగస్వాములే పరస్పరం ఎదురుదాడికి దిగిన పరిస్థితి ఏర్పడింది.
