
నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు: కేటీఆర్
తన పేరుతో ఎలాంటి సంస్థలను ఏర్పాటు చేయడానికి తాను అనుమతి ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తన పేరుతో కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయన్న సమాచారం తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ పేర్లతో కొంతమంది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పలువురు తనకు తెలియజేశారని చెప్పారు. అలాగే తన పేరును ఉపయోగిస్తూ మరికొన్ని సంస్థలు కూడా ఏర్పాటయ్యాయని సమాచారం అందిందన్నారు.
ఈ నేపథ్యంలో తన పేరుతో ఎలాంటి సంస్థలకూ అధికారిక అనుమతి లేదని ఆయన స్పష్టంచేశారు. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని పేర్కొన్నారు. తన పేరుతో నడుస్తున్న సంస్థలకు ఎటువంటి గుర్తింపు లేదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
ఎవరైనా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే అవి భారత రాష్ట్ర సమితి పరిధిలోనే నిర్వహించాలని ఆయన సూచించారు. తనపై అభిమానంతో కార్యక్రమాలు చేపట్టాలనుకునే వారు నేరుగా పార్టీతో కలిసి నడవాలని ఆయన పిలుపునిచ్చారు. తన పేరుతో ఇప్పటికే కొనసాగుతున్న కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని కూడా కేటీఆర్ ఈసందర్బంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా గట్టి హెచ్చరిక జారీ చేశారు.
