
నా జీవితాన్ని మలిచినవారు ఉపాధ్యాయులే: ప్రధాని మోడీ
విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తన బాల్యం, యువత దశల్లో ఉపాధ్యాయుల ప్రభావం తనపై ఎంతో ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ‘పరీక్షా పే చర్చ’ తొమ్మిదవ ఎడిషన్‌లోని రెండో ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలను సరైన దిశలో నడిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని చెప్పారు. నేను రూపుదిద్దుకునే దశలో ఉపాధ్యాయుల ప్రభావం నాపై చాలా ఎక్కువగా ఉంది. వారు మమ్మల్ని లైబ్రరీకి వెళ్లి విషయాలు చదివి, మరుసటి రోజు వాటిపై చర్చించమని ప్రోత్సహించేవారు. శారీరక దృఢత్వంపై నాకు ఆసక్తి ఏర్పడటానికి కూడా నా ఉపాధ్యాయులే కారణం. ఏ గొప్ప వ్యక్తినైనా అడిగితే, తన జీవితాన్ని మలిచినవారు తల్లి, ఉపాధ్యాయులేనని చెబుతారని ప్రధాని అన్నారు.
‘పరీక్షా పే చర్చ’ కేవలం బోర్డు పరీక్షల సిద్ధతకే పరిమితం కాదని, విద్యార్థులు తమ ఆలోచనలు, ఒత్తిడి, ఆశలు, జీవితం గురించి స్వేచ్ఛగా మాట్లాడుకునే వేదికగా ఇది మారిందని పేర్కొన్నారు. మీ ప్రశ్నలు వింటే అవి నన్ను కూడా హృదయపూర్వకంగా తాకుతాయి. పరీక్షల సమయంలో వచ్చే ఒత్తిడి, అంచనాలు, జీవితం పట్ల కలిగే అనేక ఆలోచనలు ఈ చర్చల్లో భాగమవుతుంటాయి. విద్యార్థులు ఇవన్నీ బహిరంగంగా పంచుకోవాలన్నదే ‘పరీక్షా పే చర్చ’ ఉద్దేశమని చెప్పారు. పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులు క్రమం తప్పకుండా రాయడం అలవాటు చేసుకోవాలని, సరిపడ నిద్ర పోవాలని ప్రధాని సూచించారు. చాలామంది చదువుకే పరిమితమవుతున్నారు. కానీ ప్రశ్నాపత్రాలు రాయడం అలవాటు చేసుకుంటే ఒత్తిడి ఉండదు. అలాగే నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. సరిగ్గా నిద్ర పోతే మనసు ఉల్లాసంగా, సానుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు.
జీవితంలో పురోగతి సాధించాలంటే నిరంతర ఆత్మపరిశీలన, దృఢ సంకల్పం అవసరమని ప్రధాని తెలిపారు. జీవితంలో తృప్తిపడితే పురోగతి ఆగిపోతుంది. మనతో మనమే పోటీ పడాలి. ఎందుకు ఈ మార్పు వచ్చింది? ఎక్కడ లోపం జరిగింది? కారణం ఏమిటి? అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలని సూచించారు.
ఆహారం ఔషధంలా ఉండాలి
అస్సాంలోని గువాహటి నుంచి వచ్చిన విద్యార్థులతో జరిగిన పరస్పర సంభాషణలో ప్రధాని మోడీ తన ఆహారపు అలవాట్లపై మాట్లాడారు. ఒక విద్యార్థి తన ఆహారం గురించి ప్రశ్నించగా, తాను ఎలాంటి నిర్దిష్ట డైట్ ప్లాన్‌ను అనుసరించడం లేదని ప్రధాని తెలిపారు. గతంలో నేను అనేక ప్రాంతాలకు ప్రయాణించేవాడిని. అక్కడ లభ్యమయ్యే ఆహారాన్నే తీసుకునేవాడిని. కొన్నిసార్లు నేనే వంట చేసుకునేవాడిని. అప్పుడప్పుడు ఖిచ్డీ కూడా చేసేవాడిని అని మోడీ చెప్పారు. ఆహారాన్ని నాలుక సంతృప్తికోసం మాత్రమే కాకుండా, శరీర పోషణ కోసం తీసుకోవాలని ప్రధాని సూచించారు. ఆహారాన్ని ఔషధంలా భావించాలి. మనం తింటున్నది నాలుకను తృప్తిపరచడానికా? లేక శరీరానికి అవసరమైన పోషణ అందించడానికా? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని అన్నారు. కొంతమంది అధికంగా తింటారని, మరికొందరు తమ శరీరానికి అవసరమైన ప్రాధాన్యతనే ఇవ్వరని ప్రధాని వ్యాఖ్యానించారు. అలాగే, ఉదయాన్నే సూర్యోదయాన్ని చూడటం అలవాటు చేసుకున్న వారు శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుకుంటారని తెలిపారు. ఇలాంటి మంచి అలవాట్లను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. అవే మన ఆరోగ్యాన్ని కాపాడతాయని ప్రధాని సూచించారు.
2026 ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం దేశవ్యాప్తంగా విస్తరించిందని అధికారులు తెలిపారు. తొలిసారిగా కోయంబత్తూరు (తమిళనాడు), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), దేవ్‌మోగ్రా (గుజరాత్), గువాహటి (అస్సాం), న్యూఢిల్లీ వంటి పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై క్రూయిజ్‌లో నిర్వహించిన సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
