
నా జీవితంపై రాయడం అంత సులభంగా అనిపించలేదు: సోనియా గాంధీ
తన జీవితంపై రాయడం అంత సులభంగా అనిపించలేదని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు. తనలో లోతుగా దాచుకున్న అనుభవాలు, భావోద్వేగాలను పంచుకోవడం ద్వారా తనను తాను ఇతరులకు తెరిచి చూపించాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. సోనియా గాంధీ 544 పేజీల జ్ఞాపకాల పుస్తకం ‘ బిలాంగింగ్ : ఏ జర్నీ ఆఫ్ లవ్’ నవంబర్ 10న హార్డ్‌కవర్, ఈ-బుక్ రూపాల్లో విడుదల కానుంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఆధ్వర్యంలోని ఆల్ఫ్రెడ్ ఏ. నాఫ్ ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంది. ఆడియో ఎడిషన్‌ను కూడా పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ విడుదల చేయనుంది. తొలి ముద్రణగా లక్ష ప్రతులను ప్రచురించనున్నట్లు సంస్థ తెలిపింది.
పుస్తకం గురించి సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘నా జీవితంపై రాయడం నాకు అంత సులభంగా అనిపించలేదు. నన్ను నేను చూపించుకోవడం, ఎప్పటినుంచో మనసులో లోతుగా దాచుకున్న క్షణాలు, అనుభవాలను పంచుకోవడం అందులో భాగం’ అని పేర్కొన్నారు.
విషాదాల నుంచి రాజకీయాల్లోకి..
తన జీవితంలో ఎదురైన వేదన, నష్టమే తనను రాజకీయాల ప్రపంచంలోకి తీసుకువచ్చాయని సోనియా గాంధీ చెప్పారు. అప్పటివరకు తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో గోప్యంగా ఉంచుకున్నానని తెలిపారు. తన జీవితంలో చోటుచేసుకున్న సంతోషాలు, విషాదాలు, కుటుంబ అనుబంధాలు, రాజకీయ ప్రయాణానికి ఈ పుస్తకం అద్దం పడుతుందని చెప్పారు. తన జీవితాన్ని ‘హృదయ ప్రయాణానికి సంబంధించిన పత్రం’గా ఆమె అభివర్ణించారు. యుద్ధానంతర ఇటలీలో తన బాల్యం నుంచి భారత్‌లో తన జీవిత ప్రయాణం వరకు పుస్తకంలో వివరించినట్లు తెలిపారు. రాజీవ్ గాంధీతో తన పరిచయం, వివాహం, అనంతరం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోడలిగా భారత రాజకీయ కుటుంబంలోకి ప్రవేశించిన తీరు ఇందులో ప్రస్తావించారు.
రాజీవ్‌తో ప్రేమ.. భారత్‌లో కొత్త జీవితం
1965లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో 19 ఏళ్ల సోనియా మైనోగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీతో ప్రేమలో పడినట్లు పుస్తకం ప్రారంభంలో వివరించారు. మూడేళ్ల తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇందిరాగాంధీతో తన పరిచయం, హిందీ నేర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు, చీరలు ధరించడం, భారతీయ వంటకాలను ఆస్వాదించడం వంటి వ్యక్తిగత అనుభవాలను కూడా ఆమె పుస్తకంలో పొందుపరిచారు. గాంధీ కుటుంబాన్ని వెంటాడిన విషాదాలనూ ఆమె ప్రస్తావించారు. రాజీవ్ గాంధీ సోదరుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడం, 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురికావడం, అనంతరం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావడం, ఏడేళ్లకు ఎన్నికల ప్రచారంలోనే హత్యకు గురికావడం వంటి ఘటనలు ఇందులో ఉన్నాయి.
2004లో ప్రధాని పదవిని తిరస్కరించిన అంశం
ఏళ్లపాటు రాజకీయాల్లోకి రావడానికి నిరాకరించినప్పటికీ చివరకు తాను రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించాల్సి వచ్చిందో కూడా సోనియా గాంధీ వివరించారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రధాని పదవిని స్వీకరించకుండా తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈ జ్ఞాపకాల పుస్తకం ప్రస్తావిస్తుంది.
ఆరు దశాబ్దాలుగా భారత్‌లో తాను చూసిన సామాజిక, రాజకీయ మార్పులకు తన కథ ఒక ప్రత్యేక దృక్కోణాన్ని అందిస్తుందని సోనియా గాంధీ అన్నారు. భారత్‌ను ‘తనకు చెందిన అందమైన దేశం’గా అభివర్ణించారు. ప్రచురణ సంస్థ నాఫ్ ప్రకారం.. ఈ పుస్తకం సోనియా గాంధీ వ్యక్తిగత జీవితం, ప్రేమ, కుటుంబం, భారత్‌తో ఆమె అనుబంధంతో పాటు స్వాతంత్ర్యానంతర భారతదేశంలోని రాజకీయ, సామాజిక పరిణామాలపై ఆమె దృక్కోణాన్ని ఆవిష్కరిస్తుంది. గుర్తింపు, బాధ్యత, స్వస్థలం అనే భావనలతో పాటు ఆరు దశాబ్దాల భారత ఆర్థిక, సామాజిక మార్పులపై ఆమె అనుభవాలను కూడా పుస్తకంలో పొందుపరిచినట్లు ప్రచురణ సంస్థ తెలిపింది.
