Let's talk: editor@tmv.in
నా గుండె ముక్కలైంది

నా గుండె ముక్కలైంది

Pinjari Chand
29 సెప్టెంబర్, 2025

‘కరూర్ లో నిన్న జరిగిన సంఘటన నన్ను ఎంతగానో బాధించింది. నా హృదయాన్ని కలచి వేసింది. ఈ బాధను వర్ణించలేను. మీరంతా నాకు జ్ఞాపకం వస్తూనే ఉన్నారు. మిమ్మల్ని కోల్పోవడం చాలా దుఖంగా ఉంది. అందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మన కుటుంబ సభ్యులను కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదు. అయినా మీ కుటుంబంలోని వ్యక్తిగా ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబ సభ్యుడికి రూ.20 లక్షల చొప్పున, గాయపడి చికిత్సపొందుతున్న వారందరికీ రూ. 2లక్షల చొప్పున సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నాను. ఇది చాలా చిన్న సహాయమే అయినా, మీతో కలిసి నిలబడడం నా కర్తవ్యం. అందరూ త్వరగా కొలుకోని ఇళ్లకు చేరుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని విజయ్ ‘ఎక్స్​’లో పోస్ట్​ చేశారు.

తమిళ వెట్రి కళగం(టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు విజయ్​ సెప్టెంబర్​ 13 నుంచి బస్సుయాత్రను తిరుచ్చి నుంచి ప్రారంభించారు. సెలవు దినాల్లో మాత్రమే ఈ యాత్ర కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం కరూర్​ లో జరిగిన సభ విషాదం నింపింది. సభలో రాత్రి జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించారు. ఇందులో 17 మంది మహిళలు, 13 మంది పురుషులు ఉన్నారు. చిన్నారులు 9 మంది ఉన్నారు. 90 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇంకా కొందరి పరిస్థితి విషమంగా ఉందని తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి సెంథిల్​ కుమార్​ తెలిపారు. అలాగే ఊపిరాడకనే చాలామంది చనిపోయ్యారని పోస్ట్​ మార్టం నివేదికలో పేర్కొన్నారు.

భద్రతా వైఫల్యమా? విజయ్​ ఆలస్యంగా రావడమేనా

తొక్కిసలాట ఘటన పై రకరకాల ఊహాగానాలు బయల్దేరాయి. 20 వేల మందికి మించని బజారులో దాదాపు లక్షమందికి పైగా రావడంతో ఈ దారుణం జరిగింది. అయితే ప్రభుత్వం సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని కొందరు వాదిస్తున్నారు. మరికొందరు విజయ్ దాదాపు ఐదు గంటలకు పైగా ఆలస్యంగా రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారని దీంతోనే ఘోరం జరిగిందని వాపోతున్నారు. ఇందులో అలాగే ప్రజలు కూడా అంత స్థాయిలో రావడం తగదని, అభిమానం ఉంటే ప్రాణాలను కూడా గుర్తు పెట్టుకోవాలి కదా, మరీ చిన్న పిల్లలను ఎందుకు తీసుకురావాల్సిన అవసరమేముంది అన్న స్థాయిలో కూడా విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ఇటు భద్రతా వైఫల్యాలు, విజయ్​ ఆలస్యంగా రావడం, కరెంట్ పోవడం, వాటర్​ బాటిళ్లు విసరడం, ప్రజల పిచ్చి అభిమానం వల్లే పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని స్పష్టం అవుతుంది. 39 మంది అమాయకుల ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోయాయు.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

విజయ్​ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు సీఎం ఎంకే స్ఠాలిన్​ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఘటనపైనే త్వరలోనే రిటైర్డ్​ జడ్డి అరుణా జగదీశన్ తో ఏకసభ్య కమిషన్​ వేస్తామని తెలిపారు. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలకు ఆదేశిస్తామన్నారు. దీనిపై ఎటువంటి రాజకీయ కక్ష లేదన్నారు. సీఎం స్టాలిన్​ శనివారమే బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి అధికారులను కోరారు. బాధితులకు అండగా నిలుస్తామని ఈ ఘటనలో మరణించిన వారికి ఒక్కొరికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్​ గ్రేషియా ప్రకటించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లడుతూ భవిష్యత్​ లో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇటువంటి ఘటనలు ఇంతకు ముందు రాష్ట్రంలో జరగలేదని గుర్తు చేశారు. అలాగే సహాయక చర్యలు తీసుకోవాలని, బాధ్యులకు అండగా నిలవాలని సహచర మంత్రులకు సూచించారు. విజయ్ అరెస్ట్ తప్పదన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో టీవీకే కు చెందిన పలువురిపై కేసులు నమోదు చేశారు. అయితే ఘటన పై పూర్తి నివేదిక వచ్చిన తర్వాతనే చర్యలుంటాయన్న సీఎం వ్యాఖ్యల వెనుక విజయ్​ ను ఈ కేసులో ఇప్పుడే అరెస్ట్ చేయకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.​

నివేదిక కోరిన కేంద్రం

కరూర్​ తొక్కిసలాటపై కేంద్రం ప్రభుత్వం నివేదిక కోరింది. ఆదివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా తమిళనాడు సీఎం స్టాలిన్​ తో మాట్లాడారు. తొక్కిసలాటకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏ సహయం కావాలన్న చెప్పాలని, కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా నిచ్చారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఇస్తామని తెలిపారు.

విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రత

కరూర్​ ప్రచార సభలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అలాగే తొక్కిసలాట ఘటన తరువాత విజయ్​ బాధితులను పరామర్శించకుండా, నేరుగా ఆయన భద్రతా సిబ్బంది మధ్య చెన్నైలోని తన సొంత నివాసానికి చేరుకోవడంతో ప్రజలు మరింత కోపంగా ఉన్నారు.దీంతో ఆయన నివాసంపై దాడులు జరగవచ్చన నేపథ్యంలో విజయ్​ నివాసం దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. గతంలోనే ఆయనకు వై కేటగిరీ భద్రతను ఇస్తున్నారు. ఇప్పుడు ఏసీపీ స్థాయి కేడర్ ను ​ అక్కడ నియమించారు. ఎటువంటి ఘటనలు జరగకుండా 20 మందికి పైగా పోలీసులను మోహరించింది. అలాగే విజయ్​ ప్రైవేట్ సెక్యూరిటీ ఉండనే ఉంది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగతుందోనన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి.

కుట్ర జరిగింది; టీవీకే

ఈ తొక్కిసలాట ఘటన పై టీవీకే అనుమానాలు వ్యక్తం చేసింది. కొంతమంది ప్రచారం నిర్వహిస్తుండగా అక్కడ రాళ్లురువ్వారని,వెంటనే పోలీసులు లాఠీ చార్జ్​ చేశారని పేర్కోంది. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని, దీని వెనుక కుట్ర కోణం ఉందని, ఈ ఘటన పై స్వతంత్ర దర్యాప్తును కోరుతూ టీవీకే మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించింది. వీలైతే సీబీఐ దర్యాప్తు చేయాలని కోరతామని తెలిపారు.

దిగ్ర్భాంతి చెందిన దేశం

కరూర్ లో తొక్కిసలాట ఘటనపై ఆదివారం దేశం దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది. చాలా మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బాధితకుటుంబాలపై సానుభూతి వ్యక్తం చేశారు. దేశ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్​ షా, రాజ్​ నాథ్​, జేపీ నడ్డా, కాంగ్రెస్​ నాయకులు రాహుల్​ గాంధీ, మల్లికార్జున్​ ఖర్గే, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాలీవుడ్, టాలీవుడ్ నటినటులు విచారం వ్యక్తం చేశారు.​