



నాసా ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం విజయవంతం
అంతరిక్ష పరిశోధనల్లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 50 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, మానవాళిని మళ్ళీ చంద్రుడి చెంతకు చేర్చే చారిత్రక 'ఆర్టెమిస్-2' మిషన్ భారత కాలమానం ప్రకారం గురువారం (అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం) ఘనంగా ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి 32 అంతస్తుల ఎత్తు గల 'స్పేస్ లాంచ్ సిస్టమ్' రాకెట్ నలుగురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది. పాత తరం అపోలో మిషన్ల జ్ఞాపకాలను నెమరువేస్తూ, వేల సంఖ్యలో ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు.
చరిత్రలో నిలిచిపోయే బృందం
ఈ మిషన్ ద్వారా నాసా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఓరియన్ క్యాప్సూల్‌లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యోమగాముల బృందం అత్యంత వైవిధ్యమైంది. ఇందులో కమాండర్ రీడ్ వైస్‌మ్యాన్, పైలట్ విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ ఉన్నారు. జాబిల్లి యాత్రకు వెళ్తున్న తొలి మహిళగా క్రిస్టినా కోచ్, తొలి నల్లజాతీయుడిగా విక్టర్ గ్లోవర్, అమెరికాయేతర పౌరుడిగా జెరెమీ హాన్సెన్ రికార్డు సృష్టించారు. "ఇది కేవలం ఒక వర్గానికి చెందిన చరిత్ర కాదు.. ఇది యావత్ మానవాళి చరిత్ర" అని విక్టర్ గ్లోవర్ ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.
చిన్నపాటి అడ్డంకులున్నా.. విజయవంతంగా!
రాకెట్ ప్రయోగానికి ముందు కొంత ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎదురైన హైడ్రోజన్ లీకేజీ సమస్యలు ఈసారి రాకపోవడంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే చివరి నిమిషంలో బ్యాటరీ సెన్సార్లు, కమాండ్ సిస్టమ్‌లో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తినప్పటికీ, ఇంజనీర్లు వాటిని త్వరితగతిన సరిచేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. రాకెట్ నింగిలోకి ఎగిరిన ఐదు నిమిషాలకే కమాండర్ వైస్‌మ్యాన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడిని చూస్తూ "అందమైన చంద్రోదయం.. మేము అటువైపే వస్తున్నాం" అని సందేశం పంపారు.
10 రోజుల సాహస యాత్ర
ఈ మిషన్ మొత్తం 10 రోజుల పాటు సాగనుంది. మొదటి 25 గంటల పాటు వ్యోమగాములు భూమికి సమీపంలో ఉంటూ క్యాప్సూల్ పనితీరును పరీక్షిస్తారు. ఆ తర్వాత చంద్రుడి వైపు ప్రయాణం మొదలవుతుంది. ఈ యాత్రలో వారు చంద్రుడిపై దిగరు కానీ, చంద్రుడి వెనుక భాగం నుంచి మరో 6,400 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తారు. ఇంతటి సుదూర ప్రాంతానికి చేరుకున్న తొలి మానవులుగా వీరు నిలవనున్నారు. తిరిగి వచ్చే క్రమంలో చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని వాడుకుంటూ (ఫ్రీ-రిటర్న్ ట్రాజెక్టరీ) పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతారు.
క్యాప్సూల్‌లో కొత్త సవాళ్లు
ఆర్టెమిస్-1 మిషన్ ఖాళీగా వెళ్లగా, ఆర్టెమిస్-2లో వ్యోమగాములకు అవసరమైన లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, నీటి సౌకర్యం, టాయిలెట్ వంటివి ఏర్పాటు చేశారు. అయితే ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే క్యాప్సూల్‌లోని టాయిలెట్ మొరాయించినట్లు క్రిస్టినా కోచ్ నియంత్రణ కేంద్రానికి సమాచారం అందించారు. ప్రస్తుతం ఇంజనీర్లు ఆ సమస్యను పరిష్కరించే పనిలో ఉండగా, వ్యోమగాములు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఉపయోగిస్తున్నారు.
చైనాతో పోటీ.. చంద్రుడిపై స్థావరం
అమెరికా ఈసారి చంద్రుడిపై కేవలం అడుగుపెట్టి తిరిగి రావడమే కాకుండా, అక్కడ శాశ్వత స్థావరాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా చైనా కంటే ముందే 2028 నాటికి చంద్రుడి దక్షిణ ధృవంపై అమెరికా జెండా పాతాలని ట్రంప్ యంత్రాంగం పట్టుదలతో ఉంది. ఆర్టెమిస్-2 విజయవంతమైతే, 2027లో ఆర్టెమిస్-3 ద్వారా డాకింగ్ పరీక్షలు నిర్వహించి, 2028లో వ్యోమగాములను నేరుగా చంద్రుడి ఉపరితలంపైకి పంపనున్నారు.
అపోలోకు వారసుడిగా ఆర్టెమిస్
"అపోలో మిషన్లను చూడని తరానికి ఇది వారి అపోలో" అని నాసా సైన్స్ చీఫ్ నిక్కీ ఫాక్స్ అభివర్ణించారు. అప్పట్లో కేవలం సోవియట్ యూనియన్‌పై గెలవడమే లక్ష్యంగా సాగిన యాత్రలు, ఇప్పుడు అంగారక గ్రహం వైపు వెళ్లేందుకు చంద్రుడిని ఒక మెట్టుగా వాడుకునే దిశగా సాగుతున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం కావాలని గతంలో చంద్రుడిపై నడిచిన చార్లీ డ్యూక్ వంటి అనుభవజ్ఞులు వ్యోమగాములకు శుభాకాంక్షలు తెలిపారు.
