Let's talk: editor@tmv.in
నాలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

నాలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

Pinjari Chand
16 మార్చి, 2026

దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌‌ న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌‌ సింగ్‌ సంధు, వివేక్‌జోషి కూడా పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. ఇక పశ్చిమబెంగాల్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశ ఏప్రిల్ 23న, రెండో దశ ఏప్రిల్ 29న నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.

ఈ ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 17.4 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 2,18,807 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.

ప్రస్తుతం తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ ఎంకే. స్టాలిన్ నాయకత్వంలోని ద్రావిడ మున్నేట్ర కజగం ప్రభుత్వం అధికారంలో ఉంది. పశ్చిమబెంగాల్‌లో 294 స్థానాలు ఉండగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆల్‌ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంది.

కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ పినరయ్‌ విజయన్‌ నాయకత్వంలోని లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్​రంట్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా, హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది.

పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఆల్‌ఇండియా ఎన్‌.ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వెంటనే అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్నికలు హింస లేకుండా, ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా నిర్వహించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ హెచ్చరించారు.

నామినేషన్ల ప్రక్రియ విషయానికి వస్తే, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 16న విడుదల అవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 23 కాగా, వాటి పరిశీలన మార్చి 24న జరుగుతుంది. అభ్యర్థిత్వ ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 26గా నిర్ణయించారు.

తమిళనాడుకు ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 30న విడుదల అవుతుంది. నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 6. వాటి పరిశీలన ఏప్రిల్ 7న జరుగుతుంది. అభ్యర్థిత్వ ఉపసంహరణకు ఏప్రిల్ 9 చివరి తేదీగా నిర్ణయించారు.

పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 30న, రెండో దశకు ఏప్రిల్ 2న విడుదల అవుతుంది. మొదటి దశ నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 6 కాగా, రెండో దశకు ఏప్రిల్ 9గా నిర్ణయించారు. మొదటి దశ పరిశీలన ఏప్రిల్ 7న, రెండో దశ పరిశీలన ఏప్రిల్ 10న జరుగుతుంది. అభ్యర్థిత్వ ఉపసంహరణకు మొదటి దశకు ఏప్రిల్ 9, రెండో దశకు ఏప్రిల్ 13 చివరి తేదీలుగా నిర్ణయించారు.

పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశలో 152 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండో దశలో 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

భారీగా సిబ్బంది

ఈ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 25 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని నియమించనున్నారు. వీరిలో 15 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 8.5 లక్షల మంది భద్రతా సిబ్బంది, 49 వేల మంది మైక్రో ఆబ్జర్వర్లు, 1,444 మంది ఆబ్జర్వర్లు, 40 వేల మంది కౌంటింగ్ సిబ్బంది, 21 వేల మంది సెక్టార్ అధికారులు ఉన్నారు. ఓటింగ్ శాతం వివరాలను ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ కేంద్రాల నుంచి అప్లోడ్ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఓటింగ్ ముగిసిన వెంటనే తుది వివరాలను ప్రకటిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీల గడువు విషయానికి వస్తే, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ గడువు మే 7న, తమిళనాడు మే 10న, అస్సాం మే 20న, కేరళ మే 23న ముగియనుంది. పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్ 15న ముగియనుంది.

ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు

దేశంలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఆదివారం ప్రకటించారు. భారత ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఐదు స్థానాలకు ఏప్రిల్ 9న, మరో మూడు స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. అన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మే 4న నిర్వహించనున్నారు. సంబంధిత ఎమ్మెల్యేలు మరణించడంతో ఈ ఉపఎన్నికలు అవసరమయ్యాయని ఈసీ తెలిపింది.

ఉపఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలు ఇవి:

పొండ(గోవా),భగల్‌కోట్, దావణగెరి సౌత్(కర్ణాటక), కొరిడాంగ్(నాగాలాండ్), ధర్మనగర్(త్రిపుర), ఉమ్రేత్(గుజరాత్),రాహురి, బారామతి(మహారాష్ట్ర) ఉన్నాయి.

పులుల అభయారణ్యాలు.. కొండల్లో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాలు అత్యంత ప్రత్యేకంగా ఉన్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌‌ తెలిపారు. ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

పోలింగ్ సిబ్బంది కొన్ని ప్రాంతాలకు చేరుకోవడానికి చాలా కష్టమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ఉదాహరణకు బుక్సా టైగర్‌‌ రిజర్వ్ కొండల గుండా నడుచుకుంటూ వెళ్లి అలీపూర్‌‌దౌర్‌‌ జిల్లాలోని మూడు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అక్కడ బుక్సా బూత్‌లో 759 మంది, చునాభట్టి బూత్‌లో 235 మంది, అడ్మా బూత్‌లో 445 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు.

అస్సాంలోని మజూలీ ప్రాంతం నుంచి దూరంగా ఉన్న ధనేఖానా పోలింగ్ కేంద్రానికి చేరుకోవడానికి పోలింగ్ బృందాలు మొదట పడవలో బ్రహ్మపుత్ర నది దాటాలి. అనంతరం రహదారి మార్గంలో ప్రయాణించి చివరగా ట్రాక్టర్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అక్కడ మొత్తం 248 మంది ఓటర్లు ఉన్నారు.

కేరళలోని గిరిజన ప్రాంతమైన ఎడమళకుడిలో ఉన్న పోలింగ్ కేంద్రం కూడా ప్రత్యేకమైనదని తెలిపారు. అక్కడికి ఎన్నికల అధికారులు ముందుగా ప్రత్యేక వాహనాల్లో 30 కిలోమీటర్లు కఠినమైన మార్గంలో ప్రయాణించి, తరువాత ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ బూత్‌లో మొత్తం 693 మంది ఓటర్లు ఉన్నారు.

ఇక తమిళనాడులోని వరుసనాథ్ హిల్స్‌ ప్రాంతంలో ఉన్న వెల్లిమలై పోలింగ్ కేంద్రంలో కేవలం ఐదుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఈ బూత్‌కు చేరుకోవడానికి పోలింగ్ అధికారులు మూడు గంటల పాటు కఠినమైన మార్గంలో ప్రయాణించాల్సి వస్తుందని చెప్పారు.

అదే విధంగా పుదుచ్చేరిలో 1885లో నిర్మించిన వీ.వో. చిదంబరం పిళ్లై స్కూల్‌ను ఆదర్శ పోలింగ్ కేంద్రంగా రూపొందించినట్లు తెలిపారు. ఫ్రెంచ్ పాలన కాలంలో ‘ఎకోల్ ప్రీమైర్ డి గార్సోన్స్’గా పిలిచే ఈ పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వాటిలో వరుసగా 722 మంది, 651 మంది ఓటర్లు ఉన్నారు.

సీఈసీ తొలగింపు నోటీసుపై ప్రశ్నలకు స్పందించని జ్ఞానేశ్ కుమార్

తనను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో ఇచ్చిన నోటీసుపై వచ్చిన ప్రశ్నలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పందించకుండా తప్పించుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సందర్భంగా మీడియా సమావేశంలో ఈ అంశంపై పాత్రికేయులు ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నలకు జ్ఞానేశ్ కుమార్ సమాధానం ఇవ్వలేదు. తనపై పక్షపాత వైఖరి ప్రదర్శించారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌లోని లోక్‌సభ,రాజ్యసభల్లో ఆయనను పదవి నుంచి తొలగించాలని నోటీసులు ఇచ్చాయి. ఎన్నికల ప్రక్రియలో ముఖ్యంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.