
నాలుగు దశాబ్దాల తర్వాత ముంబై మేయర్ పీఠం.. బీజేపీ కైవసం
దేశంలోనే అత్యంత ధనిక పౌర సంస్థ అయిన బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో, నాలుగు దశాబ్దాలకు పైగా విరామం తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తొలి మేయర్‌ను నియమించేందుకు సిద్ధమైంది. థాకరే కుటుంబం ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ, బీజేపీకి చెందిన రెండుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికైన రీతూ తావ్డే శనివారం మేయర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ మిత్రపక్షమైన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, డిప్యూటీ మేయర్ పదవికి సంజయ్ ఘాడిని అభ్యర్థిగా ప్రకటించింది.
రీతూ తావ్డే, సంజయ్ ఘాడి ఇద్దరూ మున్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా, బీజేపీ ముంబై అధ్యక్షుడు అమిత్ సతం, మాజీ శివసేన ఎంపీ రాహుల్ షెవాలే సహా మహాయుతి కూటమికి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు నామినేషన్లు దాఖలు చేయడానికి శనివారమే చివరి రోజు. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనుండగా, అదే రోజు నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువు ముగుస్తుంది. 227 సభ్యులున్న బీఎంసీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 89 సీట్లు గెలుచుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 29 సీట్లు సాధించింది. మొత్తం 118 మంది కార్పొరేటర్లతో కూడిన పాలక మహాయుతి కూటమి, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునేందుకు అవసరమైన 114 సీట్ల మెజారిటీని దాటింది.
1997 నుంచి 2022 వరకు 25 ఏళ్లపాటు బీఎంసీని పాలించిన ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) ఈ ఎన్నికల్లో 65 సీట్లు గెలుచుకుంది. దాని మిత్రపక్షాలు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) ఆరు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) ఒక సీటు సాధించాయి. మేయర్ అభ్యర్థి రీతూ తావ్డే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆమె 2012లో బీజేపీలో చేరి, అదే సంవత్సరం కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. తన తొలి పదవీకాలంలో రీతూ తావ్డే విద్యా కమిటీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. స్థానిక మౌలిక వసతులు, నీటి సరఫరా, ప్రజా భద్రత వంటి అంశాలపై చురుకుగా పని చేశారు. ఘాట్‌కోపర్ తూర్పు (132వ వార్డు) కార్పొరేటర్‌గా ఉన్న ఆమె, గత పదవీకాలంలో దుకాణాల్లో మానికిన్లపై అభ్యంతరకర దుస్తుల అంశాన్ని లేవనెత్తి ప్రత్యేకంగా వార్తల్లో నిలిచారు.
5వ వార్డు కార్పొరేటర్ సంజయ్ ఘాడి 15 నెలల పాటు డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారని శివసేన కార్యదర్శి సంజయ్ మోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన సీనియర్ మాజీ శివసేన (యూబీటీ) కార్పొరేటర్లలో ఘాడి ఒకరని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. డిప్యూటీ మేయర్ పదవీకాలాన్ని విభజించడం ద్వారా మరికొంతమంది శివసేన కార్పొరేటర్లకు అవకాశం ఇవ్వాలన్నది పార్టీ ఉద్దేశమని తెలిపారు.
విలేకరుల సమావేశంలో బీజేపీ నేత అమిత్ సతం మాట్లాడుతూ 44 సంవత్సరాల తర్వాత ముంబైకి బీజేపీ మేయర్ రానున్నారని అన్నారు.
1982–83లో బీజేపీకి చెందిన ప్రభాకర్ పాయ్ ముంబై మేయర్‌గా పనిచేశారని గుర్తు చేశారు. బీఎంసీని అవినీతి పట్టు నుంచి విముక్తం చేయడమే మహాయుతి లక్ష్యమని సతం స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలు చేయడం ప్రతి ఒక్కరి హక్కు. మాకు ఇప్పటికే 118 మంది కార్పొరేటర్ల మద్దతు ఉంది. ఇంకా మరికొందరి మద్దతు కూడా లభిస్తోందని తెలిపారు.
ముంబై మేయర్ మరాఠీ, హిందూ వ్యక్తే అవుతారని మహాయుతి మొదటి నుంచే స్పష్టం చేసిందని, ఇప్పుడు నగరానికి ‘మరాఠీ, మాల్వణి, కొంకణి, హిందూ మేయర్’ లభించనుందని ఆయన అన్నారు. డిప్యూటీ మేయర్ పదవీకాలాన్ని 15 నెలలుగా నిర్ణయించడం ద్వారా శివసేన మరింతమంది కార్యకర్తలకు అవకాశం కల్పించాలనుకుంటోందని పేర్కొన్నారు.
బీజేపీ కార్యకర్తలను పక్కనపెట్టింది
ఇదిలా ఉండగా, మేయర్ పదవికి కాంగ్రెస్ మాజీ నేత అయిన రీతూ తావ్డేను ఎంపిక చేయడంపై ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) తీవ్ర విమర్శలు చేసింది. ఆ పార్టీ ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మాట్లాడుతూ, ఈ నిర్ణయం బీజేపీకి నిబద్ధతతో పనిచేసిన అనుభవజ్ఞులైన కార్పొరేటర్లకు అవమానమని వ్యాఖ్యానించారు. సంవత్సరాల పాటు పార్టీ కోసం రక్తం, చెమట, కన్నీళ్లు చిందించిన బీజేపీ కార్యకర్తలను పక్కన పెట్టి, కాంగ్రెస్ మాజీ మహిళను మేయర్‌గా ఎంపిక చేయడం తప్పుడు సందేశాన్ని పంపుతోందని ఆయన అన్నారు. పార్టీకి నిబద్ధత, కట్టుబాటు ఇక విలువలేనివా? అని బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నించారు.
జనవరి 15న జరిగిన ముంబై పౌర ఎన్నికల్లో కాంగ్రెస్ 24 సీట్లు, ఏఐఎంఐఎం ఎనిమిది, ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) మూడు, సమాజ్‌వాదీ పార్టీ రెండు సీట్లు గెలుచుకున్నాయి. తొమ్మిదేళ్ల విరామం తర్వాత జరిగిన ఈ కీలక ఎన్నికల్లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. మునుపటి బీఎంసీ పదవీకాలం ముగిసిన అనంతరం, 2022 మార్చి 7 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిర్వాహకుడిగా బీఎంసీ కమిషనర్ కొనసాగుతున్నారు. దేశంలోనే అత్యంత ధనిక పౌర సంస్థగా గుర్తింపు పొందిన బీఎంసీకి 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ. 74,450 కోట్ల బడ్జెట్ కేటాయించబడింది. ఇది కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
