
నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తన స్వగ్రామమైన నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఏటా సంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రకారం ఈ ఏడాది కూడా గ్రామస్తులతో పండుగ ఆనందాన్ని పంచుకునేందుకు ఆయన నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గ్రామానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ వేడుకలకు ముఖ్యమంత్రితో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు ఐటీ మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి హాజరయ్యారు. గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సీఎం కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
వేడుకల సందర్భంగా పిల్లల కోసం మ్యూజికల్ చెయర్స్, నిమ్మకాయ,చమచ పోటీలు, కోడి పందాలు వంటి పలు సంప్రదాయ ఆటలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఆటలను ఆసక్తిగా వీక్షిస్తూ పిల్లలతో ముచ్చటించారు. అనంతరం విజేతలకు స్వయంగా బహుమతులు అందజేశారు. అదేవిధంగా మహిళలు వేసిన రంగవల్లులను పరిశీలించి వారికి బహుమతులు అందజేశారు. సుమారు రెండు గంటల పాటు గ్రామస్తులతో గడిపిన చంద్రబాబు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
సంక్రాంతి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నారావారిపల్లెతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రంగంపేట–భీమవరం రోడ్డును శేషాచల లింగేశ్వర స్వామి ఆలయానికి కలిపే రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన రహదారిని ప్రారంభించారు. నారావారిపల్లెలో 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌స్టేషన్, రూ.1.4 కోట్లతో నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్, వైద్య సేవల అందుబాటును మెరుగుపరిచే సంజీవని ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టును ప్రారంభించారు. అదేవిదంగా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర రామ్‌నారాయణ్ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.45 లక్షలతో నిర్మించిన పేషెంట్ అటెండెంట్ అమీనిటీస్ కాంప్లెక్స్‌ను, ఎస్వీ యూనివర్సిటీలో రూ.7.5 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్, రూ.5 కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
మూలపల్లిలో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్‌కు, మూలపల్లి చెరువుతో పాటు మరో నాలుగు చెరువులకు నీటి సరఫరా చేసేందుకు రూ.126 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.10 లక్షలతో పశువుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేశారు.
ఎస్వీ యూనివర్సిటీలో పరిశోధన, ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా రూ.6 కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ల్యాబ్స్, విద్యా మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రూ.5.03 కోట్లతో అకడమిక్ బిల్డింగ్ రెండో అంతస్తు, రూ.2.91 కోట్లతో ప్రహరీ గోడ నిర్మాణ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.
నాగాలమ్మకు ప్రత్యేక పూజలు
ఈ నెల 15న తమ గ్రామ దేవత నాగాలమ్మ ఆలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అదే రోజు నారావారిపల్లె నుంచి అమరావతికి తిరిగి వెళ్లనున్నారు.
