Let's talk: editor@tmv.in
నారాయణపేట జిల్లాలో విద్యార్థుల ప్రమాదకర ప్రయాణం!

నారాయణపేట జిల్లాలో విద్యార్థుల ప్రమాదకర ప్రయాణం!

Gaddamidi Naveen
6 జనవరి, 2026

విద్యార్థుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. పాఠశాలకు సమయానికి చేరుకోవాలనే ఆరాటంలో విద్యార్థులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ప్రభుత్వం కనీస రవాణా సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ అగ్యమగోచరంగా మారింది. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని గొప్పలు చెబుతున్నా.. ఇటువంటి దృశ్యాలు వాస్తవాన్ని బయటపె డుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో సీఎం సొంత జిల్లా అయిన నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో విద్యార్థుల ప్రయాణం నరకప్రాయంగా మారింది. సరైన రవాణా సౌకర్యాలు లేక, విద్యార్థులు వెళ్లే సమయంలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో వారు బొలెరో లాంటి ప్రైవేట్ వాహనాలకు ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. సోమవారం అటువంటి ప్రమాదకరమైన ప్రయాణమే ప్రజలను ఆలోచనలో పడేలా చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో ప్రభుత్వం పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.

విద్యార్థులు చెప్పేది ఒక్కటే, సంవత్సరాలుగా పాఠశాల సమయాల్లో సరిపడా బస్సులు లేకపోవడంతో తమకు ప్రత్యామ్నాయం లేకుండా ఇలా ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ టైమింగ్‌కి బస్సులు లేకపోవడం వల్లే ఇలా ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నామని విద్యార్థులు తెలుపుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రంలోని పాఠశాలలకు వచ్చే పిల్లలు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులోనే ప్రాణాపాయం ఎదుర్కోవాల్సి రావడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అదుపు తప్పి కింద పడితే ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఈ 'మృత్యు ప్రయాణం' సాగిస్తున్నారు.

తమ పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో లేదోనని తల్లిదండ్రులు ప్రతిరోజూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, పాఠశాల వేళల్లో అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించక ముందే రవాణా శాఖ, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నారాయణపేట జిల్లాలో విద్యార్థుల ప్రమాదకర ప్రయాణం! - Tholi Paluku