Let's talk: editor@tmv.in
నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం రెండేళ్లలో పూర్తి: సీఎం

నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం రెండేళ్లలో పూర్తి: సీఎం

Gaddamidi Naveen
2 డిసెంబర్, 2025

ప్రజా ప్రభుత్వం రెండో సంవత్సరం విజయోత్సవ సభలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మక్తల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నారాయణపేట్ - కొడంగల్ ఎత్తిపోతల పథకం ను చేపట్టడమే కాకుండా, వచ్చే రెండేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించినట్టు ప్రకటించారు.

సభలకు హాజరయ్యే ముందు సీఎం రేవంత్ రెడ్డి, మక్తల్‌లోని శ్రీ శ్రీ శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవస్థానాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో రూ. 118.82 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అంబేద్కర్ నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, పాలమూరు జిల్లాకు దశాబ్దాలుగా జరిగిన అన్యాయం, నిర్లక్ష్యాన్ని గుర్తుచేశారు. పాడిపంటలకు జీవం పోసే విధంగా వర్షాలుగా స్తంభింపజేయబడిన జీవో 69 ను పునరుద్ధరించడం, అలాగే నారాయణపేట్–కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. రైతుల1.04 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అప్పులు తీర్చుకుంటూ వేల కోట్ల విలువైన పథకాల్ని అమలు చేశాం. ఇది ప్రజా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని ముఖ్యమంత్రి అన్నారు.

మక్తల్‌లో ప్రారంభించిన ప్రధాన అభివృద్ధి పనులు

• రూ. 8 కోట్లతో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు, పలు అభివృద్ధి పనులు.

• రూ. 25 కోట్ల వ్యయంతో ఆధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం.

• రూ. 3.50 కోట్లతో మక్తల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో మౌలిక సదుపాయాల బలోపేతం, కొత్త తరగతి గదుల నిర్మాణం.

• రూ. 82.32 కోట్లతో మక్తల్–నారాయణపేట్ రహదారి అభివృద్ధి తొలి దశలో 26 కి.మీ రోడ్డుకు శంకుస్థాపన.

పాలమూరు ప్రాంతానికి నీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధి రూపంలో భారీ మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి మరొక ముందడుగు

వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి మరొక ముందడుగుగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 151.92 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు (ఎం), అమరచింత మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ. 15 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, డ్రైనేజ్, వీధి దీపాలు వంటి పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని 50 పడకల సాముదాయిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ఈ కేంద్రం కీలకంగా మారుతుందని సీఎం పేర్కొన్నారు. ప్రాంతీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువ భాగంలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ. 121.92 కోట్లు మంజూరైందని. ఈ వంతెన పూర్తికావడంతో రెండు పక్కల గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, వ్యవసాయ రంగానికి, నీటిపారుదల అవసరాలకు కూడా ఇది ప్రయోజనకారిగా మారనుందని సీఎం పేర్కొన్నారు.

అమరచింత మున్సిపాలిటీ పరిధిలో రూ. 15 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. పట్టణ అభివృద్ధి, పరిశుభ్రత, రహదారి నిర్మాణం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ పనులు చేపడుతున్నారు. ఈ శంకుస్థాపనలతో మక్తల్ నియోజకవర్గం అభివృద్ధిలో నూతన అధ్యాయం ప్రారంభమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రామాణిక పనులు చేస్తూ ప్రజల అంచనాలను తీర్చేందుకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు.