
నామినేషన్లు వేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి: మమతా బెనర్జీ
నామినేషన్లు దాఖలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం తన పార్టీ అభ్యర్థులకు సూచించారు. ఇటీవల ఎన్నికల సంఘం నియమించిన అధికారులు టీఎంసీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించేందుకు నియమించబడ్డారని ఆమె ఆరోపించారు. బీర్భూమ్ జిల్లాలోని నానూర్‌లో జరిగిన ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ నామినేషన్ వేయడానికి వెళ్లేప్పుడు న్యాయవాదులను కూడా వెంట తీసుకెళ్లాలని అభ్యర్థులకు సూచించారు. రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు మారాయని, కొత్త అధికారుల ద్వారా నామినేషన్లను తిరస్కరించే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు.
బీజేపీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తులను తీసుకొస్తోందని ఆమె ఆరోపించారు. మహిళలు ముఖ్యంగా బీజేపీకి ఓటు వేయకూడదని ఆమె పిలుపునిచ్చారు. బీహార్ ఎన్నికల ముందు పేదల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారని, ఇప్పుడు బెంగాల్‌లో కూడా పేదల బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతున్నారని సమాచారం ఉందని ఆమె చెప్పారు. ఎవరికీ తమ బ్యాంకు వివరాలు ఇవ్వవద్దని ప్రజలను హెచ్చరించారు.
తొలగించిన ఓటర్లను జాబితాలో చేర్పించాం
ఓటర్ల జాబితా సవరణల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆమె స్వాగతించారు. ఇప్పటికే తొలగించిన సుమారు 22 లక్షల మంది ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చించామని, మరో 18 లక్షల పేర్లు చేర్చాల్సి ఉందని తెలిపారు. దీనికి సంబంధించి ట్రిబ్యునళ్లలో అప్పీలు చేయాల్సి ఉంటుందని, ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ఆమె చెప్పారు. తరువాత బుర్వాన్‌లో జరిగిన మరో సభలో అనేక నియోజకవర్గాల్లో ఓటర్ల పేర్లు భారీగా తొలగించారని ఆమె ఆరోపించారు. దిన్హాటాలో సుమారు 30 వేల పేర్లు, తన నియోజకవర్గమైన భవానీపూర్‌లో దాదాపు 40 వేల పేర్లు తొలగించారని పేర్కొన్నారు. ముర్షిదాబాద్ జిల్లాలోని నబాగ్రామ్‌లో జరిగిన సభలో యువతకు భత్యాలు ఇవ్వడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు. ‘యువసాథి’ పథకం భత్యం కాదని, యువతకు అందించే ‘పాకెట్ మనీ’ అని ఆమె అన్నారు. ‘లక్ష్మీర్ భండార్’ పథకం కింద లబ్ధిదారులకు కూడా నిధులు అందుతాయని చెప్పారు.
రాష్ట్రంలో అక్రమ చొరబాట్లు జరిగాయని కేంద్రం చేసే ఆరోపణలను ఖండిస్తూ, అలాంటి ఘటనలు జరిగితే దానికి బాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దేనని ఆమె పేర్కొన్నారు. ఎల్పీజీ ధరలు పెంచినందుకు కేంద్రాన్ని ఆమె విమర్శించారు. ఎన్నికల తర్వాత ప్రజలకు గ్యాస్ కూడా అందకపోవచ్చని, తిరిగి సంప్రదాయ పొయ్యిలపై వంట చేయాల్సి రావచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోందని, అయితే దానికి బీజేపీ క్రెడిట్ తీసుకుంటోందని ఆమె విమర్శించారు.
పోలింగ్ శిక్షణ కేంద్రంలో హింస.. బీడీఓ సస్పెన్షన్‌కు ఈసీ ఆదేశం
పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ శిక్షణ కార్యక్రమం సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది. నదియా జిల్లాలోని హన్స్ఖాలి బ్లాక్ అభివృద్ధి అధికారి (బీడీఓ) సయంతన్ భట్టాచార్యను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించింది. మార్చి 27న హన్స్ఖాలి బ్లాక్‌లోని ఒక పాఠశాలలో పోలింగ్, ప్రెసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక ఉపాధ్యాయుడు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ఈ విషయంపై రణాఘాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శిక్షణ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలు చూసిన అధికారి ఎన్నికల విధుల్లో అవసరమైన ప్రమాణాలు పాటించడంలో విఫలమయ్యారని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఘటన ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలకు చెడ్డపేరు తెచ్చిందని వ్యాఖ్యానించింది. అందుకే సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా ఆదేశించింది.
