Let's talk: editor@tmv.in
నాణాల రూపంలో నిక్షిప్తమైన చరిత్ర: మన నాగరికతకు మౌన సాక్ష్యం

నాణాల రూపంలో నిక్షిప్తమైన చరిత్ర: మన నాగరికతకు మౌన సాక్ష్యం

Dantu Vijaya Lakshmi Prasanna
6 నవంబర్, 2025

మన చేతుల్లో చప్పున మోగే నాణం... మనకు అది కేవలం ధనమై కనిపిస్తుంది. కానీ ఆ చిన్న లోహపు ముక్కలో దాగి ఉన్నది వేల ఏళ్ల మన భారత నాగరికత అని మనలో ఎంత మందికి తెలుసు. ఒకప్పుడు రాజులు యుద్ధం గెలిచిన ఆనందాన్ని నాణాల రూపంలో ముద్రించారు. మరొక యుగంలో కళాకారులు తమ ప్రతిభను వాటిపై చెక్కి శాశ్వతం చేశారు.వీటిని పట్టుకున్నప్పుడు మనం కేవలం ఒక రూపాయిని కాదు, మన చరిత్రను, మన సంస్కృతిని, మన పాత తరం శ్రమను స్పృశిస్తున్నాము అనే భావనను కలిగిస్తాయి. ప్రతి నాణం ఒక రాజ్య కథ చెబుతుంది.ప్రతి ముద్ర ఒక యుగం నిశ్శబ్ద సాక్ష్యంగా నిలుస్తుంది. నాణాలు మౌనంగా ఉన్నా, వాటి మోగింపు మనకు “ఇది మన గాధ” అని చెబుతుంది. ఇదే భారత నాణాల చరిత్ర, లోహంలో లిఖించబడిన మన జాతి జీవకథ.ఆ కథ లను వివరంగా తెలుసుకుందామా …….

నాణాలు అంటే ఏమిటి?

నాణాలు అనేవి ద్రవ్య వ్యవస్థలో ఉపయోగించే లోహపు ముక్కలు, వీటిపై ప్రభుత్వం లేదా రాజు గుర్తులు, విలువ, చిహ్నాలు ముద్రించబడి ఉంటాయి. ఇవి వస్తువుల మార్పిడి స్థానంలో ద్రవ్య రూపంలో ఉపయోగించే చెల్లుబాటు అయ్యే వస్తువులు.సరళంగా చెప్పాలంటే ..“వాణిజ్యం, కొనుగోలు, అమ్మకాలకు ఉపయోగించే, అధికారికంగా ముద్రించబడిన లోహపు ద్రవ్యాన్ని నాణెం అంటారు.”

చరిత్రలో నాణాల ప్రాధాన్యత:రాజుల పేర్లు, పాలనా కాలం తెలుసుకోవచ్చు. సామ్రాజ్య విస్తరణ, పరిపాలన విధానం తెలిసేది. మత విశ్వాసాలు, కళా శైలి గురించి వివరాలు లభిస్తాయి. వాణిజ్య సంబంధాలు, ఆర్థిక స్థితి అర్థమవుతుంది. పాతకాలపు నాణాల ద్వారా ప్రాంతాల మధ్య సాంస్కృతిక సంబంధాలు కూడా గుర్తించవచ్చు.ఉదాహరణ: దక్షిణ భారతదేశంలో కనుగొన్న రోమన్ నాణేలు. ఆ కాలంలో భారతదేశం, రోమ్ వాణిజ్య సంబంధాలు ఉన్నాయని నిరూపించాయి.

పాత కాలంలో నాణాలు తయారు ఎలా?::పురాతన కాలంలో నాణాలను చేతిపనితోనే తయారు చేసేవారు. కాలక్రమానుసారం నాణాల తయారీ విధానం మారింది.

పంఛ్ గుర్తు నాణాలు: భారతదేశంలోని మొదటి నాణాలు. క్రీ.పూ. 6వ శతాబ్దంలో మహాజనపదాల కాలంలో వాడారు. ఒక లోహపు పలకను తీసుకుని, దానిపై వివిధ గుర్తులు పంచ్ (ముద్ర) చేయడం ద్వారా తయారు చేసేవారు.

మోల్డ్ నాణాలు: తర్వాత కాలంలో మట్టి లేదా లోహపు మోల్డ్ (ఆకారం) తయారు చేసి, దానిలో కరిగిన లోహం పోసి నాణం తయారు చేసేవారు. రెండు వైపులా చిహ్నాలు, రాజుల ముఖచిత్రాలు ముద్రించేవారు.

హ్యామర్ చేయడం: లోహపు పలకను వేడి చేసి, రెండు ముద్రల మధ్య ఉంచి హ్యామర్‌తో కొట్టి చిహ్నాలు ముద్రించేవారు.

నాణాల ప్రధాన రకాలు: నాణాలు ప్రధానంగా లోహం, తయారీ విధానం, కాలం ఆధారంగా విభజించబడతాయి. బంగారు నాణాలు, వెండి నాణాలు, రాగి నాణాలు, కంచు లేదా మిశ్రమ లోహ నాణాలు. ముద్రణ నాణాలు, యంత్రాలతో తయారు చేసిన ఆధునిక నాణాలు. కాలం ప్రకారం- ప్రాచీన నాణాలు, మధ్యయుగ నాణాలు,ఆధునిక నాణాలు

ప్రాచీన భారతంలో నాణాల ఆరంభం:భారతదేశంలో వివిధ కాలాల్లో అనేక రకాల నాణాలు వాడబడ్డాయి. అవి ముఖ్యంగా ఈ విధంగా ఉన్నాయి.

పంఛ్ గుర్తు నాణాలు: ఇవి భారతదేశపు తొలి నాణాలు. క్రీ.పూ. 6వ శతాబ్దం మహాజనపదాల కాలం నాటివి. బరువులు, చిహ్నాలు వేర్వేరు గా ఉంటాయి. భారతదేశంలో నాణాల చరిత్ర సుమారు క్రీ.పూ. 6వ శతాబ్దంలో ప్రారంభమైంది. అది మహాజనపదాల కాలంలో మగధ, కోశల, అవంతి, వత్స, కురు వంటి రాజ్యాలు ఉనికిలో ఉన్న సమయం. ఈ కాలంలో వాడిన మొదటి నాణాలు “పంచ్ మార్క్‌డ్ కోయిన్స్ గా ప్రసిద్ధి పొందాయి. ఇవి వెండి లేదా రాగితో తయారు చేసిన చిన్న ముక్కలు, వీటిపై పంచ్ చేయబడిన చిహ్నాలు ఉండేవి. సూర్యుడు, వృక్షం, చేప, చక్రం, పశువులు వంటివి. ఈ చిహ్నాలు రాజ్యాల గుర్తులు, మతప్రతీకలు, లేదా వ్యాపార చిహ్నాలుగా ఉపయోగించబడ్డాయి. ఇవి భారత ఉపఖండంలో నాణాల వ్యవస్థకు మొదటి పునాది.

మౌర్య సామ్రాజ్యం లో ద్రవ్య వ్యవస్థలో విప్లవం:ఈ కాలంలో మొదటిసారిగా రాజ్యాధికారికంగా ముద్రించబడిన నాణాలు వెలువడ్డాయి. అర్థశాస్త్రకారుడు కౌటిల్యుడు తన అర్థశాస్త్రం గ్రంథంలో నాణాల తయారీ, పరిశీలన, తూకం, నాణ్యత వంటి అంశాలను విపులంగా వివరించాడు. ఈ కాలంలో నాణాలపై రాజచిహ్నాలు, ధర్మచక్రం, ఏనుగు, నంది వంటి ప్రతీకలు ముద్రించబడ్డాయి. మౌర్య నాణాలు ఆర్థిక స్థిరత్వానికి పునాది వేస్తూ, భారతదేశంలో నాణాలు - రాజ్యాధికారానికి చిహ్నం అనే భావనను ఏర్పరిచాయి.

ఇండో - గ్రీక్ కాలం తో పాశ్చాత్య శైలి ప్రవేశం:అలెగ్జాండర్ దండయాత్ర తరువాత భారతదేశంలో గ్రీకు ప్రభావం తో ఇవి భారతదేశం లోకి ప్రవేశించాయి. నిజమైన ముఖచిత్రాలతో ఉన్న మొదటి నాణాలు ఇవే. వీటికి గ్రీకు–ప్రాకృత లిపులు రెండు వైపులా వాడేవారు. మౌర్యుల అనంతరం ఇండో-గ్రీక్ రాజులు (క్రీ.పూ. 2వ శతాబ్దం) ఉత్తర భారతంలో పాలించారు. వారి వల్ల భారత నాణాల రూపకల్పనలో గ్రేక్ కళాశైలి ప్రవేశించింది. ఇండో–గ్రీక్ నాణాలు మొదటిసారిగా రాజుల ముఖచిత్రాలతో వెలువడ్డాయి. ఇది భారత నాణాల రూపకల్పనలో కొత్త దిశ. నాణాల వెనుక భాగంలో దేవతల చిత్రాలు ఉండేవి. ముఖ్యంగా జ్యూస్, అథీనా, హెలియోస్ వంటి గ్రీక్ దేవతలు. ఈ నాణాలు రెండు భాషలలో ఉండేవి. గ్రీక్ లిపి, ఖరోష్ఠి లిపి. ఇది భారతదేశంలో ద్విభాషా నాణాల వ్యవస్థకు ఆరంభం.

శాతవాహన నాణాలు: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందాయి. సింహాలు, గుర్రాలు, రథాల చిత్రాలు, శాసనాలు కలిగి ఉండేవి.

కుషాణుల కాలం లో మత సమన్వయం, బంగారు నాణాల యుగం:కనిష్కుడు బౌద్ధమతానికి మద్దతు ఇచ్చినప్పటికీ, వారి నాణాల్లో భారత, గ్రీక్, ఇరానియన్, బౌద్ధ దేవతలు అన్నీ కనిపిస్తాయి. ఇది ఆ కాలంలో ఉన్న మతసహనానికి నిదర్శనం. కుషాణులు బంగారు నాణాల వాడుకను విస్తృతం చేశారు. వీటి రూపకల్పన అత్యంత నైపుణ్యంతో, కళాత్మకంగా ఉండేది. కళా, మత, సంస్కృతి పరంగా అగ్రగామి నాణాలు ఇవి. గుప్త నాణాల్లో దేవతలు, సంగీత దృశ్యాలు మొదలైనవి కనిపిస్తాయి.

గుప్త యుగం - నాణాల సువర్ణ యుగం:భారత నాణాల చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అధ్యాయం గుప్త వంశం (క్రీ.శ. 320 – 550). వీరి కాలాన్ని నిజంగానే “సువర్ణయుగం” అంటారు, ఎందుకంటే ఈ కాలంలో బంగారు నాణాలు అత్యధికంగా వెలువడ్డాయి. చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు వంటి రాజులు తమ విజయాలను, యాగకార్యాలను నాణాలపై ముద్రించించారు. నాణాలపై దేవతల చిత్రాలు, రాజుల యోధ రూపాలు, సంగీత వాయిద్యాలు, నాట్య భంగిమలు కనిపిస్తాయి. ఈ కాలం నాణాలు భారతదేశ కళాత్మకతకు, లిపి సౌందర్యానికి, ఆర్థిక శక్తికి ప్రతీక.

మధ్యయుగం - మత, భాష, లిపి వైవిధ్యం: గుప్తుల తర్వాత వచ్చిన రాజపుత్రులు, చాళుక్యులు, పల్లవులు, చోళులు, కాకతీయులు మొదలైన వంశాలు తమ ప్రాంతీయ చిహ్నాలతో నాణాలు వెలువరించాయి. ఇస్లామిక్ సుల్తానేట్ కాలం (13వ–16వ శతాబ్దం) లో ఫార్సీ లిపి, అరబిక్ లిపిలో ముద్రించిన నాణాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.మొఘల్ కాలం (1526–1857) లో నాణాలు అత్యంత శాస్త్రీయంగా తయారయ్యాయి. అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్ వంటి రాజుల నాణాలు నేటికీ భారత మింట్ మ్యూజియంలలో మణిరత్నాలుగా నిలిచాయి. మొఘల్ నాణాలు భారత ఉపఖండంలో ఏకీకృత ద్రవ్య వ్యవస్థకు బాట వేశాయి.ఫార్సీ లిపితో, అల్లాహ్ పేరు, రాజుల బిరుదులు చెక్కబడి ఉండేవి. ఇవి బంగారం, వెండి, కంచు నాణాలు అత్యంత అందమైనవిగా వీటిని ముద్రించారు.

తెలంగాణ చరిత్రలో నాణేల పాత్ర

*రాజవంశాల గుర్తింపు: *వివిధ రాజవంశాలకు చెందిన నాణేలు ఆయా పాలకుల పేర్లు, బిరుదులు, చిహ్నాలతో ముద్రించబడ్డాయి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, బహమనీలు, కుతుబ్ షాహీలు, నిజాంల కాలం నాటి నాణేలు తెలంగాణ చరిత్ర నిర్మాణంలో కీలక ఆధారాలు.

ఆర్థిక పరిస్థితి: నాణేలు ముద్రించడానికి ఉపయోగించిన లోహాలు (బంగారం, వెండి, రాగి, సీసం) ఆ కాలపు ఆర్థిక శ్రేయస్సును తెలుపుతాయి. ఉదాహరణకు, శాతవాహన కాలంలో సీసం నాణేలు ఎక్కువగా వాడబడ్డాయి.

వాణిజ్యం, వ్యాపారం: తెలంగాణలో రోమన్ నాణేల నిధులు లభించడం ప్రాచీన కాలంలో రోమ్‌తో జరిగిన సముద్ర వాణిజ్యానికి నిదర్శనం.

మత విశ్వాసాలు: నాణేలపై కనిపించే దేవతల చిత్రాలు లేదా మతపరమైన చిహ్నాలు (ఉదాహరణకు, బౌద్ధ చిహ్నాలు) ఆ కాలంలో ప్రజల మత విశ్వాసాలను తెలియజేస్తాయి.

నాణెం ముద్రణ కేంద్రాలు: నాణేలపై ఉన్న గుర్తులు నాణేలు ఎక్కడ ముద్రించబడ్డాయో తెలుపుతాయి, ఇది ఆ ప్రాంతంలోని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను గుర్తిస్తుంది.

శాతవాహనులు, ఆంధ్రదేశపు ఆర్థిక మార్పుల ఆరంభం

శాతవాహన వంశం (క్రీ.పూ. 1వ శతాబ్దం నుండి క్రీ.శ. 2వ శతాబ్దం వరకు) భారతదేశం దక్షిణ భాగంలో పెద్ద రాజ్యాన్ని నిర్మించింది. వారి పాలనలో ప్రతిష్ఠానపురం (ఇప్పటి పాత కరీంనగర్ దగ్గర) ధారుర్, కోటలింగాల, బోధన్, ధూలికట్టు వంటి ప్రాంతాలు ముఖ్య కేంద్రాలుగా ఉండేవి. శాతవాహనులు వాణిజ్యాభివృద్ధికి పెద్దపీట వేశారు. వారే దక్షిణ భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన నాణాల వ్యవస్థను ఏర్పరచిన తొలి రాజవంశం. ఈ నాణాల రూపకల్పన, లోహం, చిహ్నాలు అన్నీ ఆ కాలపు సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. కోటిలింగాల వంటి ప్రదేశాలలో శాతవాహన రాజులు చిముకు, కన్హా, శాతకర్ణి నాణేలు దొరికాయి. ఇవి శాతవాహన పాలన ప్రారంభ స్థలాన్ని నిర్ణయించడంలో సహాయపడ్డాయి.

శాతవాహన నాణాల రూపం చిహ్నాలు

శాతవాహన నాణాలు సాధారణంగా సీసం, రాగి, వెండి, బంగారం వంటి లోహాలతో తయారు అయ్యేవి. వీటిపై ఉన్న చిహ్నాలు ఆ కాలపు రాజధర్మం, మతాచారం, వాణిజ్యం, కళాసౌందర్యం అన్నింటినీ వ్యక్తపరుస్తాయి.

ప్రత్యేకతలు: నాణాలపై రాజుల పేర్లు బ్రాహ్మీ లిపిలో ఉండేవి. ఉదా: “శ్రీ సాతకర్ణి, గౌతమిపుత్ర సాతకర్ణి”. చిహ్నాలుగా సింహం, రథం, చక్రం, శంఖం, ఉద్దయమ సూర్యుడు, ఉభయచర దేవతలు కనిపిస్తాయి. కొన్ని నాణాలలో బుద్ధ చిహ్నాలు, ధర్మచక్రం, త్రిశూలం, పద్మం మొదలైనవి ఉండేవి. ఈ నాణాల రూపకల్పనలో ప్రాంతీయ కళా మేధస్సు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చిహ్నాలు కేవలం అలంకారమే కాదు. అవి ఆ సమాజపు ధార్మిక విశ్వాసాలకు, రాజకీయ విలువలకు ప్రతీకలు.

కోటలింగాల తవ్వకాలు- తెలంగాణ చరిత్రలో విప్లవాత్మక ఆవిష్కరణ

1978–1980 మధ్య కాలంలో కోటలింగాల (కరీంనగర్ జిల్లా) లో జరిగిన పురావస్తు తవ్వకాలలో సుమారు 400కి పైగా నాణాలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ శాతవాహనుల ప్రారంభకాలపు నాణాలు అని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇక్కడ లభించిన నాణాలపై “శ్రీ శాతకర్ణి” అనే శాసనం ఉండటంతో, చరిత్రకారులు శాతవాహనులు తమ పాలనను తెలంగాణ నేలనుండే ప్రారంభించారని నిర్ధారించారు. ఇది తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన ఆధారం. కోటలింగాల నాణాల వలన ప్రతిష్ఠానపురం నిజంగా రాజధాని ప్రాంతమని, శాతవాహన సామ్రాజ్యం మూలాలు ఈ నేలలోనే ఉన్నాయని ప్రపంచం గుర్తించింది. ఫణిగిరిలో ఇటీవల (2023) కనుగొనబడిన 3,730 సీసం నాణేలు ఇక్ష్వాకు కాలం నాటి (సా.శ. 3వ-4వ శతాబ్దం) ఆర్థిక, సాంస్కృతిక కార్యకలాపాలపై కొత్త వెలుగునిచ్చాయి.

వాణిజ్య సంబంధాలు, రోమన్ నాణాలకు సాక్ష్యం: శాతవాహన కాలంలో భారతదేశం, ముఖ్యంగా దక్షిణం, రోమన్ సామ్రాజ్యంతో గట్టి వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేది. ఈ వాణిజ్యానికి ఆధారంగా తెలంగాణలోని పలు ప్రాంతాలలో రోమన్ బంగారు, వెండి నాణాలు లభించాయి. ఇవి ఆ కాలంలో తెలంగాణ వ్యాపారులు రోమన్ పోర్టులతో (ఉదా: ముజిరిస్, బారుగజా) సుగమంగా వ్యాపారం నిర్వహించారని తెలుపుతున్నాయి. రోమన్ నాణాలు ఇక్కడికి రావడం అంటే, ఆర్థిక మార్పిడి వ్యవస్థ ఎంత సమృద్ధిగా ఉండేదో తెలుస్తుంది. ఇది శాతవాహనుల ఆర్థిక దృక్పథాన్ని, విదేశీ వాణిజ్య పటిమను ప్రతిబింబిస్తుంది.

నాణాల ద్వారా మతపరమైన సమన్వయం: శాతవాహన నాణాల్లో హిందూ, బౌద్ధ, జైన ప్రతీకలు కలగలసి కనిపిస్తాయి. దీని ద్వారా ఆ కాలంలో మతసహనం, బహుమత సిద్ధాంతం ఉన్నట్లు స్పష్టమవుతుంది. ధర్మచక్రం, పద్మం, నంది, సింహం వంటి ప్రతీకలు బౌద్ధ–హిందూ మతాల ప్రభావాన్ని తెలియజేస్తాయి. కొందరు రాజులు నాణాలపై తమ తల్లుల పేర్లను కూడా చెక్కించారు (ఉదా: గౌతమిపుత్ర శాతకర్ణి). ఇది మహిళలకు ఆ కాలంలో ఉన్న గౌరవాన్ని ప్రతిఫలిస్తుంది.

ఇతర వంశాల నాణాలు – తెలంగాణ ఆర్థిక పరిణామం: శాతవాహనుల తర్వాత తెలంగాణలో పలు వంశాలు పాలించాయి. ప్రతి వంశం తమ ప్రత్యేక నాణాలను విడుదల చేసింది.

ఇక్ష్వాకులు (క్రీ.శ. 3వ శతాబ్దం): నాణాలపై ధర్మచక్రం, త్రిశూలం, కపోతం వంటి బౌద్ధ చిహ్నాలు కనిపించాయి.

చాళుక్యులు: సింహం, గద్ద వంటి యోధ చిహ్నాలు ముద్రించారు

కాకతీయులు (12–14వ శతాబ్దం): తెలుగు లిపిలో చెక్కిన “ప్రతాపరుద్ర” వంటి పేర్లు ఉన్న నాణాలు. ఇవి తెలంగాణలో ప్రాంతీయ భాషా ప్రాధాన్యతకు నిదర్శనం.

కుతుబ్‌షాహీలు, నిజాములు: ఫార్సీ లిపిలో అల్లాహ్, సుల్తాన్ పేర్లు ఉన్న నాణాలు.

హైదరాబాద్ మింట్‌లో తయారైన ఈ నాణాలు ఆధునిక ద్రవ్యవ్యవస్థకు పునాది వేశాయి.

ఇలా తెలంగాణలో లభించిన నాణాలు సహస్రాబ్దాల చరిత్రను ఒకే త్రెడ్‌తో కుట్టి ఉంచుతున్నాయి. నిజాం కాలంలో "హాలీ సిక్కా” అనే సొంత కరెన్సీ చెలామణిలో ఉండేది. 1918 నాటి హైదరాబాద్ కరెన్సీ చట్టం ప్రకారం కాగితపు నోట్లను కూడా ప్రవేశపెట్టారు, హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఈ కరెన్సీని నిర్వహించేది. చార్మినార్ వంటి చిహ్నాలు నాణేలు నోట్లపై ముద్రించబడ్డాయి. నాణేలు, శాసనాలు తెలంగాణ చరిత్రను నిర్ధారించడానికి అందులోని అంతరాలను పూరించడానికి ప్రామాణికమైన ఆధారాలుగా నిలుస్తాయి.

ప్రాముఖ్యత: నాణాలు కేవలం ఆర్థిక పరికరాలు మాత్రమే కాదు, అవి చరిత్ర పుటలలో మిగిలిన లోహపు పుస్తకాలు. నాణాల శాస్త్రం ద్వారా వీటిని విశ్లేషించడం వలన పాలకుల కాలపరిమితి నిర్ధారణ మతపరమైన మార్పులు వాణిజ్య మార్గాలు. సామాజిక ఆర్థిక పరిస్థితులు, కళా, లిపి పరిణామం వంటి అంశాలపై స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నాయి.

నాణాల రూపంలో నిక్షిప్తమైన చరిత్ర: మన నాగరికతకు మౌన సాక్ష్యం - Tholi Paluku