
నాటో ఓ కాగితపు పులి.. సహాయం కోరితే ‘నో’ చెప్పారు: ట్రంప్
నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిప్పులు చెరిగారు. ఇరాన్‌తో జరిగిన యుద్ధ సమయంలో నాటో కూటమితో పాటు జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వంటి మిత్రదేశాలు అమెరికాకు అండగా నిలవడంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. నాటోను ఒక ‘కాగితం పులి’గా అభివర్ణించిన ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు నాటో అంటే భయం లేదని ఎద్దేవా చేశారు. నేడు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే వాషింగ్టన్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సహాయం కోరితే ‘నో’ చెప్పారు!
సోమవారం వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ యుద్ధ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. "ఇరాన్ యుద్ధం నాటోపై ఒక చెరగని ముద్ర వేసింది. అది నా మనసులో ఎప్పటికీ అలాగే ఉంటుంది. యుద్ధ సమయంలో నేను నాటో దేశాలను సాయం చేయమని గట్టిగా అడగలేదు.. కేవలం ‘మీరు సాయం చేయాలనుకుంటే చేయొచ్చు’ అని మాత్రమే అన్నాను. కానీ వారు మాత్రం ‘వద్దు.. మేము సాయం చేయం’ అని ముఖం మీదే చెప్పారు" అని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘గ్రీన్‌లాండ్’ అంశం నుంచే చిచ్చు
అమెరికాకు, నాటోకు మధ్య విభేదాలు ఇప్పుడే మొదలైనవి కావని, గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే ప్రతిపాదనను నాటో వ్యతిరేకించినప్పటి నుంచే ఈ దూరం పెరిగిందని ట్రంప్ స్పష్టం చేశారు. "అసలు నిజం చెప్పాలంటే.. ఇదంతా గ్రీన్‌లాండ్‌తోనే మొదలైంది. మాకు గ్రీన్‌లాండ్ కావాలని అడిగాం, కానీ వారు ఇవ్వడానికి నిరాకరించారు. అప్పుడే నేను వారికి ‘బై బై’ చెప్పేశాను" అని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధం ముగిసి, అమెరికా విజయం సాధించిన తర్వాత ఇప్పుడు నాటో దేశాలు తనను కలవడానికి వస్తున్నాయని, అకస్మాత్తుగా సాయం చేస్తామంటున్నారని ఆయన విమర్శించారు.
మిత్రదేశాల తీరుపై అసహనం
నాటోతో పాటు ఆసియాలోని కీలక మిత్రదేశాలైన జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాల తీరును కూడా ట్రంప్ తప్పుబట్టారు. "జపాన్ మాకు సాయం చేయలేదు.. ఆస్ట్రేలియా చేయలేదు.. దక్షిణ కొరియా అస్సలు చేయలేదు. కిమ్ జోంగ్ ఉన్ నుంచి రక్షణ కల్పించేందుకు జపాన్‌లో 50 వేల మంది, దక్షిణ కొరియాలో 45 వేల మంది అమెరికా సైనికులను పహారా ఉంచాం. కానీ అవసరమైనప్పుడు వారు మాత్రం చేతులెత్తేశారు" అని మండిపడ్డారు.
‘కిమ్‌తో సత్సంబంధాలు’
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తన సంబంధాలు చాలా బాగున్నాయని ట్రంప్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. "అణు ఆయుధాలు ఉన్న కిమ్ జోంగ్ ఉన్ పక్కనే మన 45 వేల మంది సైనికులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఇలా జరిగి ఉండాల్సింది కాదు. గతంలో ఒక అధ్యక్షుడు తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించి ఉంటే కిమ్ వద్ద అణు ఆయుధాలు ఉండేవి కావు. కానీ వారంతా తమ పనిని సరిగ్గా చేయడానికి భయపడ్డారు" అని ట్రంప్ విమర్శలు గుప్పించారు.
