Let's talk: editor@tmv.in
నాచారం చెరువు పునరుద్ధరణకు 'హైడ్రా' శ్రీకారం

నాచారం చెరువు పునరుద్ధరణకు 'హైడ్రా' శ్రీకారం

Gaddamidi Naveen
25 మార్చి, 2026

నగరంలోని చెరువుల పునరుద్ధరణలో భాగంగా హైడ్రా రెండో విడత పనులను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఉప్పల్ మండలంలోని నాచారం పెద్ద చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. సుమారు 108.30 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువులో, 81.12 ఎకరాల మేర గుర్రపుడెక్క పేరుకుపోయి నీటి జాడ కనిపించకుండా పోవడాన్ని ఆయన గమనించారు.

చెరువులోని మురుగునీటిని వెంటనే కిందకు వదిలేసి, పూడికను పూర్తిగా తొలగించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఎస్టీపీ ఉన్నప్పటికీ నేరుగా మురుగునీరు కలవడంతో గుర్రపుడెక్క వ్యాపించి, దోమల బెడద ఎక్కువైందని స్థానికులు ఫిర్యాదు చేశారు. అంబర్‌పేట బతుకమ్మ కుంట, కూకట్‌పల్లి నల్లచెరువు తరహాలో నాచారం చెరువును కూడా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని వారు కోరారు. ఉప్పల్ నల్లచెరువు పనులకు ఆటంకం కలగకుండా కాలువను డైవర్ట్ చేసి, ఇక్కడ పనులు మొదలుపెట్టాలని అధికారులు నిర్ణయించారు.

అనంతరం మల్కాజిగిరి పరిధిలోని మీర్జాల్‌గూడ, చిన్మయి మార్గ్ ప్రాంతాలలో వరద ముప్పును కమిషనర్ సమీక్షించారు. వర్షాకాలంలో మహేంద్రహిల్స్ నుంచి వచ్చే భారీ వరద నీరు సాఫీగా వెళ్లేందుకు వీలులేకుండా నాలాలు కుంచించుకుపోయినట్లు గుర్తించారు. ప్రస్తుతం కేవలం ఒక మీటరు వెడల్పు ఉన్న నాలా వరద నీటికి సరిపోవడం లేదు.ఉన్న డ్రైనేజీ కాలువను విస్తరించాలా లేదా సమాంతరంగా మరో కాలువను నిర్మించాలా అనే అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్మయి మార్గ్ విస్తరణకు స్థానికులు సహకరించాలని కోరారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం, హైడ్రా తీసుకుంటున్న చొరవపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ కమిషనర్‌ను శాలువాతో సన్మానించారు. పనులు వేగంగా పూర్తి చేసేందుకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.