
నాగాలాండ్ లో ఈడీ దాడులు:రాష్ట్రంలో తొలి ఫెమా కేసు నమోదు
ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తొలిసారి నాగాలాండ్‌లో దాడులు చేసింది. మంగళవారం ఆర్థిక నేరాల అన్వేషణ సంస్థ లిమా ఇంసాంగ్‌కు చెందిన అనుబంధ సంస్థలపై ఫెమా (ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్) నిబంధనల ఉల్లంఘన కేసులో మొదటిసారి సోదాలు చేపట్టింది. ఈడీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం డిమాపూర్, గువాహటి, చెన్నైల్లో మొత్తం ఏడుచోట్ల ఈ దాడులు జరిగాయి. ఇమ్సాంగ్ గ్లోబల్ సప్లయర్స్ కో. పేరుతో ఉన్న సంస్థపై ప్రధానంగా దృష్టి సారించారు. దీని యజమాని లిమా ఇంసాంగ్ మానవ జుట్టు ఎగుమతి పేరుతో విదేశాల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తెచ్చుకున్నట్లు అనుమానాలు రావడంతో ఈ దాడులు జరిగాయి. అయితే ఆ ఎగుమతులకు సంబంధించిన షిప్పింగ్ బిల్లులు, ఇన్వాయిసులు తదితర పత్రాలు సంబంధిత బ్యాంకులకు సమర్పించకపోవడం గమనార్హమని ఈడీ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా విదేశీ నిధులు తీసుకున్నారని నిర్ధారించారు.
తదుపరి దర్యాప్తులో ఈ నిధులు ఇన్కెమ్ ఇండియా ప్రైవేట్.లిమిటెడ్ అనే సంస్థకు, అలాగే లిమా ఇంసాంగ్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఖాతాలకు తరలించినట్టు బయటపడింది. ఈ కంపెనీ కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైందని, కంపెనీకి సంబంధించి ఆదాయ వివరాల్లో నష్టాలు చూపించినట్టు ఈడీ వివరించింది. అదనంగా చెన్నైలోని అనుమానాస్పద వ్యాపార సంస్థలకు కూడా ఈ నిధులు బదిలీ అయ్యాయని పేర్కొంది. ఈ చర్యతో నాగాలాండ్‌లో ఈడీ తొలిసారిగా ఫెమా చట్టం కింద దాడులు జరపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్థిక లావాదేవీలపై పర్యవేక్షణ మరింత కఠినం కానున్నయనే సంకేతాలు వెలువడ్డాయని అధికారులు పరిగణిస్తున్నారు.
అనుమానం బలపడడానికి కారణాలు
ఈడీ ఏకకాలంలో దాడులు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో
భౌగోళిక పరిస్థితులు:
డిమాపూర్ (నాగాలాండ్)లో పెద్దగా పరిశ్రమలు లేవు.
అక్కడ ప్రధానంగా హ్యాండ్‌క్రాఫ్ట్, వన్యప్రాణి ఉత్పత్తులు, కాఫీ, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి వ్యాపారాలే సాధారణంగా నిర్వహిస్తారు. అలాంటిది మానవ జుట్టు సేకరణ–ప్రాసెసింగ్–ఎగుమతి వ్యాపారాలు అక్కడ దాదాపు లేవు.
సరఫరా లేకపోవడం:
మానవ జుట్టు సేకరణకు ఆలయాలు లేదా పెద్ద సెలూన్లు అవసరం. ఇవి దక్షిణ భారత రాష్ట్రాలైన (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు)లో విస్తారంగా ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతి దేవాలయంలో తలనీలాలు వేలానికి ప్రసిద్ధి గాంచింది. కానీ నాగాలాండ్‌లో అలాంటి మూలాలు లేవు. అంటే జుట్టు సేకరణకు, ప్రాసెసింగ్‌కి అవసరమైన వనరులు లేవు.
ఎగుమతికి సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం:
డిమాపూర్‌లో పెద్ద పోర్ట్ లేదు. ఎగుమతి కోసం సాధారణంగా చెన్నై, ముంబయి లేదా విశాఖపట్నం పోర్టులు ఉపయోగిస్తారు. కానీ ఆ ప్రాంతం నుంచి అంత దూరం సరుకు రవాణా చేయడం ఆర్థికపరంగా ఎటువంటి లాభం లేదు. నిధుల ప్రవాహం అసాధారణంగా ఉండటం:
ఈడీ చెబుతున్నదాని ప్రకారం ఈ కంపెనీకి విదేశాల నుంచి భారీ మొత్తంలో విదేశాల నుంచి డబ్బులు వచ్చాయి. కానీ వ్యాపారం లాభదాయకంగా లేకపోయినా, భారీగా డబ్బులు రావడంతో ఈడీకి అనుమానాలు బలపడ్డాయి. దీంతో నాగాలాండ్ లో ఫెమా చట్టం అమలులోకి వచ్చిన దాదాపు 25 సంవత్సరాల తర్వాత తొలికేసు నమోదైంది.
