
నాగార్జున సాగర్.. వెళ్ళొద్దాం!
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కృష్ణా నది తీరంలో ఒదిగిన నాగార్జున సాగర్ ఆనకట్ట, కేవలం ఒక ఇంజనీరింగ్ విస్మయం మాత్రమే కాదు, పర్యాటకుల హృదయాలను ఆకర్షించే ఒక అద్భుత కేంద్రం. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్టగా పేరొందిన ఈ నిర్మాణం, సహజ సౌందర్యం, చారిత్రక వైభవం,సాహస ఆకర్షణల సమ్మేళనంగా నిలుస్తుంది. హైదరాబాద్ నుండి 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం, ప్రకృతి ప్రేమికులు, చరిత్ర ఔత్సాహికులు,సాహస యాత్రికులకు ఒక స్వర్గధామంగా మారింది.
ఇంజనీరింగ్ అద్భుతం
1955లో భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేతులమీదుగా శంకుస్థాపన జరిగిన నాగార్జున సాగర్ ఆనకట్ట, 1972 నాటికి పూర్తిగా రూపొందింది. 150 మీటర్ల ఎత్తు, 1.6 కిలోమీటర్ల పొడవుతో, 26 గేట్లతో నిర్మితమైన ఈ ఆనకట్ట, 11,472 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ ఆనకట్ట హరిత విప్లవంలో కీలక పాత్ర పోషించిన మొదటి నీటిపారుదల ప్రాజెక్టులలో ఒకటి, అలాగే 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో శక్తి వనరుగా కూడా సేవలందిస్తోంది. వర్షాకాలంలో గేట్లు ఎత్తినప్పుడు జలాశయం నుండి జాలువారే నీటి ప్రవాహం, తెల్లని పాల నురుగులా మారి చూపురులని ఆకట్టుకుంటుంది . ఆ జాలువారే జలాధారలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.
నాగార్జునకొండ: చారిత్రక సంపద
జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండ, బౌద్ధ చారిత్రక స్థలంగా ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల కాలంలో శ్రీ పర్వతంగా పిలువబడిన ఈ ప్రాంతంలో, ఆచార్య నాగార్జునుడు బోధనలు చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆనకట్ట నిర్మాణ సమయంలో తవ్వకాల్లో బయటపడిన 2వ శతాబ్దపు బౌద్ధ అవశేషాలు, విగ్రహాలు, జాతక కథలతో చెక్కబడిన విభిన్న వస్తువులు, రాతి యుగ ఆయుధాలు,శాసనాలు ఇక్కడి మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. ఈ ద్వీపానికి చేరుకోవడానికి తెలంగాణ టూరిజం శాఖ నిర్వహించే మోటర్ బోట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక గంట సమయం పట్టే ఈ బోటు యాత్ర, పర్యాటకులకు చిరస్మరణీయ అనుభవాన్ని అందిస్తుంది.
బుద్ధవనం: ఆధ్యాత్మిక సంగమం
నాగార్జునకొండ సమీపంలో ఉన్న బుద్ధవనం, 274 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఒక ఆధ్యాత్మిక కేంద్రం. బౌద్ధమతంలోని అష్టాంగ మార్గాలను ప్రతిబింబించేలా ఎనిమిది విభాగాలుగా రూపొందించబడిన ఈ ప్రాంతంలో, 34 ఎకరాలు( దమ్మ) నాగార్జున ఉపాసన ధ్యాన కేంద్రంగా ఉన్నాయి. బౌద్ధ చరిత్ర, కృష్ణా నది పరివాహకంలో దాని వ్యాప్తి, ఆచార్య నాగార్జున పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ కేంద్రం ఆధ్యాత్మిక శాంతిని కోరుకునే వారికి ఒక ఆదర్శవంతమైన గమ్యస్థానం.బుద్ధవనం ప్రాజెక్టు, బౌద్ధమతం యొక్క చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను ఆవిష్కరించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రూపొందించబడింది. నాగార్జున సాగర్ ప్రాంతం బౌద్ధమత చరిత్రలో కీలకమైనది, ఎందుకంటే ఈ ప్రాంతం గౌతమ బుద్ధుని బోధనలను వ్యాప్తి చేసిన ఆచార్య నాగార్జునుడి స్మృతులను కలిగి ఉంది. ఈ చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని, బుద్ధవనం ఒక సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయబడింది. ధ్యానం మానసిక శాంతి, ఆత్మవిశ్వాసం, ఒత్తిడి నిర్వహణను ప్రోత్సహిస్తుంది. గౌతమ బుద్ధుని బోధనల ఆధారంగా రూపొందిన ఉపాసన, ధ్యానం, ఆధునిక జీవనశైలిలో ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్న వారికి ఒక ఆశ్రయంగా నిలుస్తోంది.
ధ్యాన కేంద్రం యొక్క ప్రత్యేకతలు
దమ్మ(ధర్మం) నాగార్జున ఉపాసన ధ్యాన కేంద్రం, శాంతియుత వాతావరణంలో ధ్యాన సాధన కోసం ఆదర్శవంతమైన స్థలం. ఇక్కడ నిర్వహించే ధ్యాన కార్యక్రమాలు 10 రోజుల కోర్సుల నుండి కొన్ని రోజుల స్వల్పకాలిక శిక్షణ వరకు విస్తరించి ఉంటాయి. ఈ కేంద్రం ఆధ్యాత్మిక ఔత్సాహికులకు మాత్రమే కాకుండా, ఒత్తిడి నుండి ఉపశమనం కోరుకునే సామాన్య ప్రజలకు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కేంద్రంలో ధ్యాన సాధనతో పాటు, బౌద్ధ సాహిత్యం, చరిత్రను అధ్యయనం చేసేందుకు ఒక గ్రంథాలయం కూడా అందుబాటులో ఉంది. బుద్ధవనం ప్రాంగణంలో బౌద్ధ స్థూపాలు, శిల్పాలు, చారిత్రక ప్రదర్శనలు, సందర్శకులకు బౌద్ధమతం యొక్క గొప్ప వారసత్వాన్ని తెలియజేస్తాయి.
నాగార్జున సాగర్ జలాశయం యొక్క సుందరమైన దృశ్యాల నడుమ ఉన్న బుద్ధవనం, పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కృష్ణా నది ఒడ్డున, నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ కేంద్రం, ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక శాంతి కలబోసిన అనుభవాన్ని అందిస్తుంది. జాతీయ రహదారి 565 ద్వారా సులభంగా చేరుకోగల ఈ ప్రాంతం, హైదరాబాద్, విజయవాడ నుండి వచ్చే సందర్శకులకు అనువైన గమ్యస్థానంగా ఉంది. అదనంగా, బుద్ధవనం వద్ద ఏర్పాటు చేసిన మ్యూజియం బౌద్ధ చరిత్ర, నాగార్జునుడి బోధనల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. ఈ ప్రదర్శనలు విద్యార్థులు, చరిత్ర ఔత్సాహికులు, పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉంటాయి.
బుద్ధవనం, బౌద్ధమతం యొక్క శాంతి, అహింస సిద్ధాంతాలను ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కేంద్రం ద్వారా నిర్వహించే ధ్యాన శిక్షణ కార్యక్రమాలు, స్థానికులతో పాటు దేశ, విదేశీ సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, బౌద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఒక వేదికగా నిలుస్తోంది. కృష్ణా నది ఒడ్డున, పచ్చని అటవీ ప్రాంతంలో ఈ కేంద్రం సందర్శకులకు మానసిక శాంతితో పాటు చారిత్రక జ్ఞానాన్ని అందిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఒక మణిదీపంగా వెలుగొందుతోంది.
సాహసం,సహజ సౌందర్యం
నాగార్జున సాగర్ పరిసరాల్లోని దట్టమైన పచ్చని అడవులు, నల్లమల కొండలు,కృష్ణా నది అందాలు పర్యాటకులకు మరపురాని అనుభవాన్ని అందిస్తాయి. తెలంగాణ టూరిజం శాఖ నిర్వహించే బోటింగ్ సౌకర్యాలు, జలాశయంలో క్రూయిజ్‌లను అందిస్తూ, సహజ సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని అర్బన్ పార్క్, సఫారీ వాహనాలతో పర్యాటకులకు జంతుజాలం,వృక్షజాల అందాలను చూపిస్తుంది. ఎత్తిపోతల జలపాతం, చంద్రవంక,నక్క వాగు నీటి ప్రవాహాలతో 70 అడుగుల ఎత్తు నుండి జాలువారే దృశ్యం, సాగర్‌కు 15 మైళ్ల దూరంలో మరో ఆకర్షణగా నిలుస్తుంది. నాగార్జున సాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతంలోని వైజాగ్ కాలనీ, ఇసుక తిన్నెలు, రాళ్లు, చల్లని గాలులతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. స్థానిక చేపలు, నాటు కోడి కూర, జొన్న రొట్టెలతో ఈ ప్రాంతం,,అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రుచులను పరిచయం చేస్తుంది. కుటుంబ సమేతంగా సేదతీరేందుకు అనువైన గమ్యస్థానంగా దీన్ని ఎంచుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని 'తెలంగాణ గోవా'గా కూడా పిలుస్తారు.
పర్యాటక అభివృద్ధి కోసం కృషి
తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్‌ను పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. 2022లో 28 కోట్ల రూపాయలతో రోడ్ల విస్తరణ, డిజిటల్ లైబ్రరీ, ఆడిటోరియం,ఆధునిక బస్టాండ్ వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఇటీవల, నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచీ సర్వీసులను ప్రారంభించడం ద్వారా టూరిజం శాఖ మరో అడుగు ముందుకు వేసింది. నాగార్జున సాగర్, సహజ సౌందర్యం, చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శాంతితో కూడిన ఒక సంపూర్ణ పర్యాటక కేంద్రం.స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ అద్భుత కేంద్రాన్ని సందర్శించాల్సిందే.
ఎలా చేరుకోవాలి?
నాగార్జున సాగర్‌కు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెగ్యులర్ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సమీప రైల్వే స్టేషన్ మాచర్ల (24 కి.మీ), విమానాశ్రయం హైదరాబాద్‌లో ఉంది. నాగార్జునకొండకు బోటు సర్వీసులు ఉదయం 9:30, 11:30,మధ్యాహ్నం 1:30 గంటలకు అందుబాటులో ఉన్నాయి. మ్యూజియం టికెట్ ధరలు పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10,బోటు ఛార్జీలు పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.120
నాగార్జున సాగర్ బౌద్ధ ధ్యాన కేంద్రం శాంతి, సాంస్కృతిక వారసత్వం కలబోసిన క్షేత్రం. కృష్ణా నది తీరంలో విరాజిల్లుతున్న నాగార్జున సాగర్ ప్రాంతం జలాశయం, సాగు సౌకర్యాలకే పరిమితం కాదు. ఇక్కడ బౌద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని, శాంతిని, ధ్యాన జీవన విధానాన్ని ప్రోత్సహించే ఒక అద్భుత కేంద్రం. పర్యాటకులను, ఆధ్యాత్మిక ఔత్సాహికులను ఆకర్షిస్తోంది. ఈ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ హిల్ కాలనీలో బౌద్ధమత సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తూ, ధ్యానం, చరిత్ర, పర్యాటకం యొక్క సమ్మేళనంగా నిలుస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దింది. కాబట్టి మీరు ఈ వర్షాకాలంలో ఆ ఆద్యాత్మిక శోభను, ప్రకృతిసోయగాన్ని ఆస్వాదించి రండి..
