
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి జాతర సందర్భంగా జరిగిన దాడిలో రెండు నెలల పసిపాప మృతి చెందడం రాష్ట్రాన్ని కుదిపేసిన అమానవీయ ఘటనగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్, తాను రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక తండ్రిగా, సమాజంలోని ఒక వ్యక్తిగా ఆ కుటుంబానికి అండగా నిలవడానికి వచ్చానని తెలిపారు. పసిపాప ప్రాణాలు పోయిన తీరు మాటలకు అందని మహా విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు హంతకులకు అండగా నిలబడటం ముమ్మాటికి తప్పేనని కేటీఆర్ విమర్శించారు. ఇంతటి అమానవీయ సంఘటన జరిగినా ప్రభుత్వం, ముఖ్యమంత్రి మౌనంగా ఉండడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులతో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని కూడా ఆరోపించారు.
మల్లన్న దర్శనం కోసం గుడికి వెళ్లిన చంద్రకళ కుటుంబంపై 20 నుంచి 25 మంది కలిసి మూకదాడి చేయడం, పసిపాపను వదిలిపెట్టమని వేడుకున్నా కాలితో తన్ని చంపిన తీరు అత్యంత హేయమని కేటీఆర్ అన్నారు. 21వ శతాబ్దంలో కూడా కులం, మతాల పేరిట హింసకు పాల్పడటం, హంతకులను కాపాడే ప్రయత్నాలు జరగడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఈ ఘటన తర్వాత తెలంగాణ సమాజం మొత్తం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
హంతకుడు ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దాడి చేసిన ఎనిమిది మందిపై హత్య నేరం కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని, అవసరమైతే ఉరిశిక్ష వరకు శిక్షించాలన్నారు. ఈ కేసులో రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదని, న్యాయం జరిగేదాకా ప్రతి ఒక్కరూ, మీడియా, రాజకీయ నాయకులు, ప్రజలు ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.
బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని, అలాగే తాము పది లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఈ పోరాటంలో అండగా నిలిచిన నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సహా బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు మరియు ఇతర నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
