Let's talk: editor@tmv.in
నాకు పదవులు కాదు ప్రజలే ముఖ్యం: ఎంపీ ఈటల

నాకు పదవులు కాదు ప్రజలే ముఖ్యం: ఎంపీ ఈటల

Gaddamidi Naveen
11 అక్టోబర్, 2025

హుజురాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు, కమిట్‌మెంట్ లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని పార్టీ అని విమర్శించారు. రెండేళ్లు గడిచినా స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదన్నారు. ఆరు నెలల్లోనే 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహిస్తామని గట్టిగా చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు చేతులు ఎత్తేసి వెనక్కి తగ్గిందన్నారు. ప్రజలను ఇంతకాలం మోసం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? అని ప్రశ్నించారు.

నాకు పదవులు ముఖ్యమేమీ కావు. ప్రజల సమస్యల పరిష్కారం, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం నాకు ముఖ్యమైనదని పేర్కొన్నారు. ప్రజలతో ఉన్న అనుబంధం నాకు అత్యంత ప్రాధాన్యం. నేను ఆడుపడేవాడిని అయితే కేసీఆర్ దగ్గరే ఉండేవాడిని కానీ నేను ఉద్యమ బిడ్డను, అన్యాయం జరిగితే ఎదుర్కొని పోరాడే వ్యక్తిని నా జీవితంలో నేను వెనక్కి తగ్గడం అనేది ఉండదని తెలిపారు. తెలంగాణ చరిత్ర రాసినప్పుడు నా పేరు కూడా ఐదు పేజీల చరిత్రలో తప్పకుండా ఉంటుందన్నారు.

హుజురాబాద్ ప్రజలతో తనకు 25 ఏళ్లుగా ఉన్న బంధాన్ని గుర్తు చేస్తూ, నేను ఇక్కడ కొత్తవాడిని కాదు. ఇక్కడ జరిగిన ప్రతి ఎన్నికలో మా బలగమే గెలిచిందన్నారు. ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని. 25 ఏళ్లుగా నాతో పాటు నడుస్తున్న సైన్యాన్ని గెలిపించడం నా బాధ్యత, అని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి తెలంగాణ ప్రజలను అయోమయనికి గురి చేసిందని ఆయన మండిపడ్డారు. 85 శాతం బడుగు బలహీన వర్గాలతో ఉన్న రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు ప్రకటించారని పేర్కొన్నారు. కానీ ఆ హామీని అమలు చేసే ధైర్యం, నిబద్ధత, అవగాహన ఏదీ కాంగ్రెస్ చూపలేదని విమర్శించారు. ఇది ప్రజలను వంచించడం తప్ప మరొకటి కాదన్నారు. బీజేపీ మాత్రం మొదటి నుండి ఈ రిజర్వేషన్ డిమాండ్‌కి మద్దతు ఇస్తూనే ఉంది. అసెంబ్లీలోనూ, కౌన్సిల్‌లోనూ మేము మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డిపై విమర్శలు

ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కూడా తీవ్రంగా విమర్శిస్తూ, రేవంత్ రెడ్డికి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే సత్తా ఉంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాల్సిన అవసరమే లేదన్నారు. గవర్నర్, రాష్ట్రపతి ఆపలేని వ్యవహారమని తాము చెప్పినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గందరగోళం సృష్టించిందన్నారు. కోర్టు తీర్పు రాకముందే నామినేషన్లు స్వీకరించి అవమానాన్ని మూటగట్టుకున్నారు, అని అన్నారు.

బీసీల హక్కుల కోసం పోరాడే సంఘాలు, నాయకులు కూడా జాగ్రత్తగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ ఈశ్వరయ్య కూడా ఈ చర్య నిలబడదని స్పష్టంగా చెప్పారని తెలిపారు. అయినా కొందరు బీజేపీ వ్యతిరేకత పేరుతో వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రతి ఇంట్లో చదువుకున్న యువత ఉన్నారని రాజ్యాంగంపై అవగాహన వారికి ఉందన్నారు. యువతను మోసం చేయాలనే ప్రయత్నం విఫలమవుతుందని ఎంపీ ఈటల రాజేంద్రర్ హెచ్చరించారు.ప్రజలను మోసం చేయకుండా, 42 శాతం బీసీ రిజర్వేషన్లతో తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేకపోతే ప్రజల కోపని తట్టుకోలేరని హెచ్చరించారు.

నాకు పదవులు కాదు ప్రజలే ముఖ్యం: ఎంపీ ఈటల - Tholi Paluku