Let's talk: editor@tmv.in
నాంపల్లి భారీ అగ్నిప్రమాదం.. ఐదు మృతదేహాల గుర్తింపు

నాంపల్లి భారీ అగ్నిప్రమాదం.. ఐదు మృతదేహాల గుర్తింపు

Gaddamidi Naveen
26 జనవరి, 2026

హైదరాబాద్ నాంపల్లిలో శనివారం మధ్యాహ్నం సంభవించిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక ఫర్నిచర్ షోరూమ్ ఉన్న నాలుగంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు, పొగ కారణంగా ఇద్దరు చిన్నారులు, ఒక వృద్ధురాలు సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సెల్లార్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఫర్నిచర్ నిల్వ చేయడం, అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేయడమే ఈ ప్రాణనష్టానికి ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే, భవనం భవనంలో ఐదుగురు చిక్కుకుపోయారన్న సమాచారం అందడంతో సహాయక చర్యలు ప్రారంభించారు. ఆదివారం నాటికి బేస్‌మెంట్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఐదు మృతదేహాలను వెలికితీసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మృతుల్లో ఇద్దరు బాలురు, ఒక వృద్ధ మహిళతో పాటు 30 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పురుషులు ఉన్నారు.

మృతులైన ఇద్దరు బాలురు ఏడేళ్లు, 11 ఏళ్ల వయస్సు కలవారు. వారు ఆ భవనానికి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి కుమారులు. కుటుంబం భవనంలోనే నివాసం ఉంటోంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో సెక్యూరిటీ గార్డ్ బయట ఉండగా, ఆయన భార్య కూడా పనిమీద బయటకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అదే భవనంలో మరో గదిలో నివసిస్తున్న 60 ఏళ్ల వృద్ధ మహిళ, కర్ణాటకలోని కలబురగి జిల్లాకు చెందినవారు, స్వీపర్-కమ్-సెక్యూరిటీగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారని చెప్పారు.

మృతులైన మరో ఇద్దరు పురుషులు హైదరాబాద్‌కు చెందినవారు కాగా, వారు ఆ భవనంలో కార్మికులుగా పనిచేస్తున్నారు. చిన్నారులు, వృద్ధ మహిళను కాపాడేందుకు వారు మంటల్లోకి వెళ్లారని, అయితే మంటలు తీవ్రమవడంతో బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారని అధికారులు వివరించారు.

ప్రభుత్వ 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఈ ఘటనపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ, ఈ భవనంలో అగ్నిమాపక నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు వెల్లడించారు. బేస్‌మెంట్‌లు కేవలం పార్కింగ్‌కు మాత్రమే ఉపయోగించాల్సి ఉండగా, అక్కడ ఫర్నిచర్, రసాయనాలు, ప్లాస్టిక్, రెక్సిన్, వస్త్రాలు, ఫోమ్ మ్యాట్రెస్సులు వంటి అత్యంత అగ్ని ప్రమాదకర వస్తువులను నిల్వ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా, కుటుంబాలను అక్కడే నివాసం ఉండేలా ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు.

ఫర్నిచర్ షోరూమ్ యజమాని అక్రమంగా భవనంలలో ముడి సరుకులు నిల్వ చేయడంతో తీవ్ర పొగ ఏర్పడి, అందులో చిక్కుకున్న వారు ఉక్కిరిబిక్కిరి అయ్యి మృతి చెందినట్లు అనుమానిస్తున్నామని ఆయ‌న‌ తెలిపారు. అయితే, ఖచ్చితమైన మృతిచేత కారణాలు పోస్టుమార్టం, వైద్య పరీక్షల అనంతరం తెలుస్తాయని చెప్పారు.అగ్నిప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావొచ్చని, లేదా భవనంలో నివసిస్తున్న కుటుంబం ఉపయోగించిన వంటగ్యాస్ కారణం కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ అంశాలపై సవివరమైన దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

శనివారం మధ్యాహ్నం 1.41 గంటలకు అగ్నిప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఫైర్ సర్వీసులు, పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, హైదరాబాద్ హైడ్రా కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చినా, ఘనమైన పొగ కారణంగా రక్షణ చర్యలు క్లిష్టంగా మారాయి. బేస్‌మెంట్‌కు వెళ్లే మార్గాలు ఫర్నిచర్‌తో పూర్తిగా మూసుకుపోవడంతో లోపలికి చేరుకోవడం కష్టమైందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అగ్నిమాపక వాహనాలతో పాటు స్కైలిఫ్ట్, ఫైర్‌ఫైటింగ్ రోబోట్‌ను కూడా వినియోగించారు. భవన యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.