Let's talk: editor@tmv.in
నాంపల్లి కోర్టుకు మాజీ సీఎం జగన్ హాజరు

నాంపల్లి కోర్టుకు మాజీ సీఎం జగన్ హాజరు

Pinjari Chand
21 నవంబర్, 2025

దాదాపు దశాబ్దం నుంచి కొనసాగుతున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో (డిస్ప్రోపోర్షనేట్‌ అసెట్స్‌) కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుమారు ఆరు సంవత్సరాల తరువాత గురువారం నాంపల్లి ప్రత్యేక సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఇటీవల జారీ చేసిన వ్యక్తిగత హాజరు తప్పనిసరి ఆదేశాల మేరకే ఆయన కోర్టుకు వచ్చారు. జగన్‌ రాకతో కోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. లోపల అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.అనంతరం జగన్‌ తరఫు న్యాయవాది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోర్టు ఆదేశం మేరకు జగన్‌ హాజరయ్యారు. కోర్టు ఆయన హాజరును రికార్డ్‌ చేసింది. దాంతో ఈ రోజు అప్లికేషన్‌ ముగిసిందని తెలిపారు. తదుపరి విచారణ తేదీ ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు.

2012లో నమోదైన కేసు

సిబిఐ 2012లో జగన్‌ను అరెస్టు చేసినప్పుడు, ఆయన తండ్రి వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్విడ్ ప్రో కో పేరుతో పలువురు వ్యాపారవేత్తలతో ఒప్పందాలు చేసుకుని ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడం, దానికి ప్రతిఫలంగా జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకున్నారన్న ఆరోపణలే కేంద్ర బిందువయ్యాయి. జగన్‌ మాత్రం ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని అప్పటి నుంచి ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు.

వైఎస్సార్‌ మరణం–రాష్ట్ర రాజకీయాల్లో మలుపు

2009లో హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్సార్‌ మృతి తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో జగన్‌ వేగంగా రాజకీయంగా ఎదిగారు. రాష్ట్ర విభజన తర్వాత 2019–2024 మధ్య ముఖ్యమంత్రిగా పాలించారు. ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన హవా కొనసాగుతూనే ఉంది.

నాంపల్లి కోర్టుకు మాజీ సీఎం జగన్ హాజరు - Tholi Paluku