
నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు
ఇటీవల హైదరాబాద్ ను బాంబు బెదిరింపు ఈ మైల్స్ బయపెడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్‌కు గురువారం ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అయితే, ప్రాంగణమంతా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం పోలీసులు దానిని 'ఉత్తుత్తి బెదిరింపు' గా తేల్చి చెప్పారు.
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తి పంపిన బాంబు బెదిరింపు మెయిల్ తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో బాంబు పేలుతుందని మెయిల్‌లో పేర్కొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాంబ్ స్క్వాడ్‌ను హుటాహుటిన కోర్టుకు పంపించారు అధికారులు. న్యాయస్థానం చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా చర్యలలో భాగంగా కోర్టు పరిసరాల్లో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు తరలించారు. కోర్టు ప్రాంగణమంతా ఖాళీ చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పోలీసుల సోదాల్లో అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని, ఆ ఈ-మెయిల్ కేవలం భయాందోళన కలిగించడానికి పంపిన పుకారు అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోలీసు అధికారులు మెయిల్ పంపిన వ్యక్తి వివరాలు గుర్తించేందుకు సైబర్ నిపుణులతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, భద్రతా చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి ఈ కాల్స్ , మెయిల్స్ పంపిస్తున్నారనే అంశాలపై సైబర్ నిపుణుల సహకారంతో సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఒకే తరహాలో వరుసగా జరుగుతున్న ఇలాంటి బెదిరింపు ఘటనలు ప్రజల్లో తీవ్ర భయాందోళనకు కారణమవుతున్నాయి.
