Let's talk: editor@tmv.in
నాంపల్లి, కరీంనగర్ కోర్టులకు బాంబు బెదిరింపులు

నాంపల్లి, కరీంనగర్ కోర్టులకు బాంబు బెదిరింపులు

Gaddamidi Naveen
19 ఫిబ్రవరి, 2026

తెలంగాణలోని రెండు కీలక కోర్టు సముదాయాలకు బుధవారం బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం రేగింది. హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు, కరీంనగర్ జిల్లా కోర్టులకు వేర్వేరుగా అందిన ఈమెయిల్స్ అధికారులను, న్యాయవాదులను భయాందోళనలకు గురిచేశాయి.

ఘటనల వివరాలు

నాంపల్లి ప్రాంతంలో ఉన్న సీబీఐ కోర్టుకు గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఈమెయిల్‌లో న్యాయమూర్తి ఛాంబర్‌తో పాటు కోర్టు ప్రాంగణంలో ఆర్డీఎక్స్ ఐఈడీలు అమర్చినట్లు పేర్కొనడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ బృందాలను రంగంలోకి దించారు. కోర్టు పరిసరాలను పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇది కేవలం ఫేక్ మెయిల్‌గా అధికారులు నిర్ధారించారు.

ఇదే సమయంలో క‌రీంన‌గ‌ర్ జిల్లా కోర్టుకు కూడా ఇదే తరహాలో మరో బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 12.05 గంటలకు పేలుళ్లు జరుగుతాయని హెచ్చరించారు. కోర్టు ప్రాంగణంలో పేలుడు పదార్థాలు అమర్చినట్లు పేర్కొనడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కోర్టు భవనంలోని కొంత భాగాన్ని ఖాళీ చేయించి, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ కూడా అనుమానాస్పద వస్తువులు ఏవీ లభించలేదు.

ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వీటి వెనుక ఉన్న దుండగులెవరు? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటువంటి తప్పుడు బెదిరింపులు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తాయని అధికారులు హెచ్చరించారు.