Let's talk: editor@tmv.in
నష్టాల్లో హైదరాబాద్ మెట్రో

నష్టాల్లో హైదరాబాద్ మెట్రో

FL - SIMHCLM
15 సెప్టెంబర్, 2025

హైదరాబాద్ మెట్రో.. నగరం స్థాయిని మరో మెట్టు ఎక్కించిన రవాణా వ్యవస్థ.. అనతికాలంలోనే కోట్లాదిమందికి సులువైన రవాణా సౌకర్యాన్ని కల్పించిన వ్యవస్థ.. హైద్రాబాద్ అంటే చార్మినార్.. ఐటి.. ఫార్మా .. వీటితో పాటు మెట్రో అనేది కూడా దాని కేరాఫ్ అయింది. లార్సన్ అండ్ టూబ్రో సంస్థ చేపట్టి, నిర్వహిస్తున్న ఈ మెట్రో వ్యవస్థ ఇప్పుడు అదే సంస్థకు భారమైంది. ఇక నడపలేం.. మావల్ల కావడం లేదు.. నిర్వహణ నష్టాలూ ఎక్కువైనాయి.. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేస్తాం.. అంటూ కేంద్రానికి లేఖ రాసింది. మెట్రో సంస్థ ఘనంగా ప్రారంభమైనా ఆదాయం అంత ఘనంగా లేదని ఆ సంస్థ అంటోంది.

వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ని 2017 నవంబరులో ఈ మెట్రో వ్యవస్థ నాగోల్, అమీర్పేట, మియాపూర్ మార్గంలో మొదలైంది. రెండవ దశగా ఎల్బీ నగర్, అమీర్పేట మార్గాన్ని 2018 అక్టోబరులో ప్రారంభించారు. ఆ తరువాత అమీర్పేట-హైటెక్ సిటీ.. ఆపైన జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం కూడా అందుబాటులోకి వచ్చింది. తక్కువ ఖర్చుతో ట్రాఫిక్ సమస్య లేకుండా ఎంతదూరం నగరపరిధిలో సులువుగా ప్రయాణం చేసే వారికీ ఇదొక వరం. రోడ్డు మీద రెండు గంటలు పట్టే ప్రయాణం దీనిలో ముప్పావుగంటలో హాయిగా సాగిపోతుంది. అందుకే సంస్థ ఏర్పాటైన ఐదేళ్లకు అంటే 2022 నవంబరు 29 నాటికి మెట్రోలో 31 కోట్ల మంది ప్రయాణించారని లెక్కలు తేల్చారు. దీనిలో రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 4.40 లక్షలు. అయితే ఇన్ని లక్షలమంది ప్రయాణిస్తున్న తమకు నష్టాలూ తప్పడం లేదని లార్సన్ అండ్ టూబ్రో అంటోంది.

మెట్రో రైల్ నిర్వహణపై ఎల్ అండ్ టీ సంస్థ ఓ ప్రకటన చేస్తూ భారీ నష్టాల కారణంగా మెట్రోను ఇకపై నడపడలేమని చేతులు ఎత్తేసింది. అందువల్ల ఈ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తామని అంటోంది. తమ ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి జైదీప్కు ఎల్ అండ్ టీ లేఖ కూడా రాసింది. మెట్రో ఎనిమిదేళ్ళ ప్రస్థానంలో తాము ఆశించిన విధంగా లాభాలు లేవని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు గత కొంతకాలంగా మెట్రో వ్యవస్థకు ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని అంటున్నారు. ఇక పెద్ద ఎత్తున పేరుకుపోయిన బకాయిలతో సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని అంటున్నారు. ప్రయాణీకుల టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం మెట్రో రైల్ నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని కుండబద్ధలు కొట్టారు. ఇలాంటి ఆర్ధికపరమైన ఇబ్బందులలో ఉంటూ మెట్రోను నడపడం తమకు భారంగా మారిందని ఎల్ అండ్ టీ కేంద్రానికి వివరించింది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ మెట్రో నిర్వహణను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని భావిస్తున్నామని అంటున్నారు. దీని మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి నిర్ణయం తీసుకుంటాయన్నది చూడాలి.

నష్టాల్లో హైదరాబాద్ మెట్రో - Tholi Paluku